నేనిక్కడ, ఇట్లున్న...
ABN, First Publish Date - 2023-06-26T01:12:38+05:30
నిప్పు కణికల పాన్పు ఇది పడగలెత్తిన విషసర్పములటువైపు ముడుచుకుని వేచివున్న మృగములిటువైపు ఒక కాలు దివిన ఒక కాలు భువిన...
నిప్పు కణికల పాన్పు ఇది
పడగలెత్తిన విషసర్పములటువైపు
ముడుచుకుని వేచివున్న మృగములిటువైపు
ఒక కాలు దివిన ఒక కాలు భువిన
కాలసలు కదలదు కాలమసలు గడవదు
కన్ను చూడదు కంఠమాడదు
కనుదోయి సైగలకు కనుబొమ్మలే బదులు
నోరు మండే ఎడారిధూపమాయే
నిలువెల్లా నిర్వాణరూపమాయె
సంద్రాన అలలు లేవు
బంగారు కలలు లేవు
ఏమానందం ఉందని ఈ భూతలాన
ఎవరొచ్చిరి ఏమిచ్చిరి
ఏ మాటలు ఎక్కడెక్కడ గుచ్చిరి
ఈ గాయమెవ్వడు చేసెను
ఈ గానమెవ్వడు పాడెను
ఎందుకింత నిర్దయ
దేహం రక్తపాశముతో బంధించినప్పుడు
కొత్త కుండ భళ్ళున పగిలినప్పుడు
చెరువుకట్ట కాడ కట్టె కాలినప్పుడు
దాపురించేటి సమస్త శూన్యమయం
నల్ల కలువలు నలుదిక్కుల విచ్చు విధాన
పగటి చీకట్లు గొప్పగా కప్పెడు విధాన
చిరునవ్వు పొరలపై జారు కన్నీరు
ఆరునెల్లు మంచానే తెలవారునని
దిక్కుదిక్కునెల్ల దివ్యనేత్రోత్సవం
గుత్తులు గుత్తులుగా రాలేటి
గొంతుకోసే పువ్వులు
ధగధగ మెరిసేటి నిగూఢ నవ్వులు
మనవాడెవ్వడు కానివాడెవ్వడు
గగన వనమున కలుగు స్థలమున
శోకమెరుగని తలమున
అమ్మా నువ్వెట్లున్నావే?
అంతా క్షేమమేనా?
వేణు ఊడుగుల
Updated Date - 2023-06-26T01:12:38+05:30 IST