ఐదవ తరగతి ‘A’ విభాగం
ABN, First Publish Date - 2023-06-26T01:09:29+05:30
వాన కురవని రోజుల్లో కూడా పసుపు రంగు గొడుగుతో వచ్చే తిలకవతి టీచర్, క్లాసులో మొదటి రోజు మమ్మల్ని అడిగింది. ‘‘చదువయ్యాక మీరంతా ఏమవ్వాలని అనుకుంటున్నారు?’’...
వాన కురవని రోజుల్లో కూడా
పసుపు రంగు గొడుగుతో వచ్చే
తిలకవతి టీచర్,
క్లాసులో మొదటి రోజు
మమ్మల్ని అడిగింది.
‘‘చదువయ్యాక మీరంతా ఏమవ్వాలని
అనుకుంటున్నారు?’’
మొదటి బెంచీని ఎవరితోనూ పంచుకోని
కవిత, వనిత ఇద్దరూ
‘‘డాక్టర్!’’ అన్నారు ఒకే గొంతుకతో.
ఈ రోజు పెళ్ళై పిల్లల్ని కని,
రేషన్ దుకాణం క్యూలో
నిలబడివున్న కవితను,
సిగలో దువ్వెనతో పిల్లల్ని స్కూలుకు
సాగనంపుతున్న వనితను
అప్పుడప్పుడూ చూస్తూనే ఉన్నాను.
ఇంజినీరు అవుతానని అన్న
ఎల్. సురేష్ కుమార్
మధ్యలోనే డుమ్మా కొట్టి
మగ్గం నెయ్యడానికి
వెళ్లిపోయాడు.
‘‘నాన్నగారి పాత సామాన్ల దుకాణం
చూసుకుంటాను.’’
ఆఖరు బెంచి సి.ఎన్. రాజేష్ అన్నప్పుడు
అందరూ గొల్లుమని నవ్వారు.
ఈ రోజు అతగాడు న్యూజెర్సీలో
డాక్టరుగా, మైక్రోబయాలజీలో
రీసెర్చ్ చేస్తున్నాడు.
‘‘ఫ్లయిట్ తోలుతాను’’ అని
అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన
జస్టిన్ చెల్లబాబు
పబ్లిక్ సర్వీస్ పరీక్షలు వ్రాసి
గుమాస్తాగిరీ వెలగబెడుతున్నాడు.
అణుశక్తి శాస్త్రవేత్తనవుతానని అన్న నేను
కవితలు వ్రాస్తున్నాను.
జీవితపు సుడిగాలి
అందరినీ దిశ మార్చి వేయగా
‘‘ఉపాధ్యాయుడిని అవుతాను’’ అని చెప్పిన
గుండు సురేష్ మాత్రం
మేము చదివిన అదే స్కూలులో
టీచరుగా ఉన్నాడు.
‘‘అనుకున్న పనినే చేస్తున్నావు,
ఎలా వుందిరా మామా?’’ అడిగాను.
చాక్‌పీసు నుసి అంటుకున్న వేళ్ళతో
నా చెయ్యి పట్టుకుంటూ,
‘‘చదువయిన తరువాత
మీరేం అవబోతున్నారని
నా విద్యార్థులను
అస్సలు అడగడం లేదురా!’’ అన్నాడు
తమిళం : ఎన్. ముత్తుకుమార్ (1975 - 2016)
అనువాదం : గౌరీ కృపానందన్
97910 69485
Updated Date - 2023-06-26T01:09:29+05:30 IST