CM KCR: అధికప్రసంగం
ABN, First Publish Date - 2023-08-22T02:07:22+05:30
అధికారంలో ఉండే ఉన్మత్తత అటువంటిది. అందుకే, రాజకీయాలలో ఉన్నవారు ఆ మాదక ద్రవ్యం కోసం యాతన పడుతుంటారు. ఒకసారి మైకం కమ్మిన తరువాత, విచక్షణలు, వివేకాలు ఏవీ పనిచేయవు.
అధికారంలో ఉండే ఉన్మత్తత అటువంటిది. అందుకే, రాజకీయాలలో ఉన్నవారు ఆ మాదక ద్రవ్యం కోసం యాతన పడుతుంటారు. ఒకసారి మైకం కమ్మిన తరువాత, విచక్షణలు, వివేకాలు ఏవీ పనిచేయవు. దేనినైనా అతిక్రమించవచ్చునని, ఏమైనా మాట్లాడవచ్చునని అనిపిస్తుంటుంది. స్వభావరీత్యా అహంకారి కూడా అయినప్పుడు, పాలకుడి నోటికి ఇక పట్టపగ్గాలు ఉండవు. అడ్డగోలుగా మాట్లాడుతూ కూడా దాన్నొక విధానమని, తమ ఇష్టమని దబాయించగలరు.
సోమవారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పత్రికాసమావేశం ఏర్పాటు చేసి, రానున్న అసెంబ్లీ ఎన్నికలలో పోటీచేసే తమ పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయో ఇంకా సూచన లేకముందే, ఎంతో ముందుజాగ్రత్తతో వ్యూహరచన చేస్తున్నారంటే, ఆదమరిస్తే ప్రమాదమన్న సూచన ఏదో క్షేత్రస్థాయి నుంచి వచ్చిందన్నమాట. రాష్ట్రంలో తక్కిన రెండు ప్రధాన పార్టీల సమాయత్తత ఏమంత బలంగా కనిపించడం లేదు కాబట్టి, ముందే బలగాలను మోహరించడం కెసిఆర్‌కు ఒక అనుకూల అంశమూ, అవసరమూ కూడా కావచ్చు. ఆ ఆత్రుత నుంచి కొంత, మూడోసారి కూడా తామే గెలవబోతున్నామనే సొంత ఊహల వల్ల కొంత కెసిఆర్ మాట ఎప్పటికంటె ఎక్కువగా గతి తప్పింది. ఆ విచిత్ర మానసిక స్థితి నుంచే, తన పాలన మంచిచెడ్డలను చెప్పే పత్రికల మీద నోటికి వచ్చినట్టు వ్యాఖ్యలు చేశారు. పేరు చెప్పకున్నా, ఆయన ఉద్దేశించింది ‘ఆంధ్రజ్యోతి’ అని తెలుస్తూనే ఉన్నది.
పత్రికలు ఏమి చేయాలని ప్రభువులు అనుకుంటున్నారు? బంగారు తెలంగాణ సాధించామని ముఖ్యమంత్రి భావించవచ్చు. దాన్ని తక్కిన సమాజమంతా అంగీకరించాలి కదా? అంగీకరించాలంటే ప్రజల అనుభవంలోకి ఆ స్వర్ణయుగం రావాలి కదా? ఈ రాష్ట్రంలో పాలకపక్షమే కాదు, అనేక ప్రతిపక్షాలున్నాయి. అనేక ప్రజాసంఘాలున్నాయి. అవి అనేక అంశాల మీద ప్రభుత్వాలను తప్పుపడుతూ ఉంటాయి. ప్రజాస్వామ్యంలో పత్రికలు కూడా ప్రజాజీవితంలో ముఖ్యపాత్ర వహిస్తాయి. అవి పాలనలోని మంచి చెడ్డలను చెబుతాయి. అధికార పార్టీ భారత రాష్ట్రసమితి పక్షాన ఒక తెలుగుపత్రిక, ఒక ఆంగ్ల పత్రిక, ఒక న్యూస్ చానెల్ నడుస్తున్నాయి. మరికొన్ని పత్రికా సంస్థలు ప్రభుత్వ పాలనను సానుకూలంగా చూస్తూ కలసి సాగుతూండవచ్చు. అన్ని పత్రికలూ అట్లా ఉండాలని లేదు కదా? రేపు బిఆర్ఎస్ ఓడిపోయి, ఏ కాంగ్రెస్ పార్టీయో, బిజెపియో అధికారంలోకి వస్తే, ప్రస్తుత అధికారపత్రిక ఆయా పార్టీల పాలనకు అనుకూలంగా రాస్తుందా? ప్రభుత్వానికి సొంత డబ్బా కొట్టుకోవడానికి మీడియా సంస్థలను పెట్టుకున్నవారు కూడా, సాధ్యమైనంత తటస్థతను, నిష్పక్షపాతాన్ని, ప్రజానుకూలతను విధానంగా పెట్టుకున్న పత్రికలను తప్పుపట్టడమే విడ్డూరం!
సత్యాన్ని చెప్పే వేదికల మీద ద్వేషాన్ని బాహాటంగా, నిస్సంకోచంగా ప్రకటించడం మరీ బరితెగించిన తనం. పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వరు, సమావేశాలకు ఆహ్వానాలు పంపరు. ముఖ్యమైన ప్రారంభోత్సవాలకు ఆవిష్కరణలకు కూడా అనుమతులుండవు. టీవీ చానెళ్లపై అనధికార నిషేధాలు విధిస్తారు. ఇవన్నీ చాలవన్నట్టు, ఇప్పుడు తమను విమర్శించే పత్రికలో పనిచేసే పాత్రికేయుల మీద కూడా కక్ష సాధిస్తారట! మంచీ చెడ్డా ఉచితం అనుచితం తెలిస్తే, ఎవరైనా ఇట్లా మాట్లాడతారా? విమర్శ అంటే వారి దృష్టిలో విషమే. విషం చిమ్మే పత్రికలలో పనిచేసేవారికి ఇళ్ల స్థలాలు ఇవ్వబోమని, అది తమ విధానమని కెసిఆర్ బోరవిడుచుకుని మరీ చెప్పారు! అంతేకాదు, అది తమ నిర్ణయాధికారం (డిస్క్రిషన్) అని సమర్థించుకున్నారు. నియమాల మొగ్గు ఎట్లా ఉన్నా, పాలకులు విచక్షణతో విలువల వైపు నిలబడాలి, బలహీనుల వైపు ఉండాలి, తనపర భేదం లేకుండా న్యాయం వైపు ఉండాలి. అదేమీ కాదు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించడం, విమర్శను అణచివేయడమే తన విధానం అని చెప్పుకున్న ముఖ్యమంత్రిని ఏమని అభివర్ణించాలి?
పత్రికలపై పాలకుల కన్నెర్రను పాత్రికేయులు ఏనాటి నుంచో అనుభవిస్తూనే ఉన్నారు. అప్రియమైన సత్యాన్ని వెల్లడి చేసినప్పుడు ప్రతీకారచర్యలు కానీ, కల్లోల సమయాల్లో కవరేజి కోసం వెళ్లినప్పుడు లాఠీదెబ్బలు కానీ అనుభవిస్తున్నది పాత్రికేయులే. వివిధ పక్షాల చేతుల్లో, ప్రభుత్వం చేతుల్లో కూడా ప్రాణాలు కోల్పోయిన, క్షతగాత్రులయిన పాత్రికేయులు అనేకం. కాబట్టి, ఇప్పుడు వారిని మరో బెదిరింపుతో లొంగదీసుకోవాలనుకోవడంలో అర్థం లేదు. జర్నలిస్టుల మీద ఒత్తిడి తెచ్చి, సంపాదకీయ, యాజమాన్య విధానాలను ప్రభావితం చేయాలనుకోవడం అవివేకం.
అయినా, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి, అంత సంకుచితమైన మాటలు ఎట్లా మాట్లాడారు అని ఆశ్చర్యం కలుగుతున్నది. అక్కసు ఆపుకోలేక, ఇట్లా బయటపడి ఉండవచ్చును. ఇటువంటి ధోరణి ఒక రంగానికే పరిమితం కాదు కదా, అన్నిటా వ్యక్తమవుతుంది. అది రానున్న ఎన్నికల సమరంలో నాయకుడికి ప్రతికూల అంశం అవుతుంది. చేతల్లో ఎట్లాగూ ప్రజాస్వామ్యం లేదు, మాటల్లోనూ అదే ధోరణి వ్యక్తమయితే, ఎముకలు మెడలో వేసుకున్నట్టే.
ప్రజల వైపు నిలబడి, ప్రజల క్షేమం కోసం జరిగే పత్రికారచన ఇటువంటి బెదిరింపులకు చలించదు. విమర్శ స్వీకరించి దిద్దుబాటు చేసుకుంటే పాలకులకు మంచిది. విమర్శను తొక్కిపెట్టి, అంతా బాగుందని భ్రమపడి, భ్రమపెడితే ప్రయోజనం ఏమిటి? ప్రజలు మరీ అమాయకులు కారు.
Updated Date - 2023-08-22T03:28:17+05:30 IST