ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆధునిక తెలుగు కవిత్వంలో అంబేడ్కర్‌

ABN, First Publish Date - 2023-04-10T01:03:01+05:30

ఆధునిక భారతీయ సాహిత్యంలో డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ప్రభావంతో విస్తారంగా సాహిత్యం వచ్చింది. మరాఠి, గుజరాతి, హిందీ తెలుగు తదితర భారతీయ భాషల సాహిత్యంలో అంబేడ్కర్‌ మూర్తిమత్వాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

ఆధునిక భారతీయ సాహిత్యంలో డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ప్రభావంతో విస్తారంగా సాహిత్యం వచ్చింది. మరాఠి, గుజరాతి, హిందీ తెలుగు తదితర భారతీయ భాషల సాహిత్యంలో అంబేడ్కర్‌ మూర్తిమత్వాన్ని, ఆయన తాత్త్విక దృక్పథాన్ని కవులు, రచయితలు స్ఫూర్తిదాయకంగా అక్షరబద్ధం చేశారు. ఇరయ్యోశతాబ్దపు సామాజిక విముక్తి ఉద్యమా లను మరో మలుపు తిప్పిన నవభారత వైతాళికుడు అంబేడ్కర్‌. ఆయన ప్రతిపాదించిన సాంఘిక ప్రజా స్వామ్యం, ఆర్థిక సమానత్వం, అణగారిన వర్గాలకు రాజకీయాధికారం, ప్రత్యామ్నాయ సంస్కృతి, రాజ్యాంగ నైతికత తదితర అంశాల గురించి విస్తృతంగా చర్చలు జరుతున్న సందర్భంలో ఈ సమున్నత విలువల సమాహారం తెలుగుకవిత్వంలో ప్రతిఫలించిన విధానాన్ని పరిశీలించాలి.

ఆధునిక తెలుగు కవిత్వంలో ముప్పయ్యో దశకం నుండే అంబేడ్కర్‌ ప్రభావం కనిపిస్తుంది. 1944లో హైదరాబాద్‌ తోపాటు ఆంధ్రా ప్రాంతంలో అనేక పట్టణాలలో పర్యటించిన అంబేడ్కర్‌ యువతరంలో, దళిత విద్యావంతుల్లో, అణగారిన వర్గాలకు చెందిన కవుల్లో సరికొత్త ఉత్తేజాన్ని, సామాజిక చైతన్యాన్ని కలిగించాడు. మహద్‌ పోరాటం, రౌండ్‌ టేబుల్‌ సమావేశం, పూనాఒడంబడిక తదితర సంఘటనలతో అంబేడ్కర్‌ జాతీయస్థాయిలో నాయకునిగా ప్రఖ్యాతి గాంచాడు. కారంచేడు నేపథ్యంలో ఆవిర్భవించిన దళిత మహాసభ రగిలించిన ఆత్మగౌరవపోరాటం, అంబేడ్కర్‌ రచనలు తెలుగులోకి అనువాదం కావటం, ఈ రచనల అధ్యయనంతో మొదటి తరం దళితవిద్యావంతులు చైతన్యం కావడం, కాన్షీరామ్‌ అందించిన రాజ్యాధికార దృష్టితో దళిత, బహుజనులు సంఘటితం కావడం... వంటి పరిణామాలు తెలుగు కవిత్వాన్ని కుదిపివేశాయి. 1987 అక్టోబర్‌లో హైదారాబాద్‌లో జరిగిన అఖిల భారత దళిత రచయితల సదస్సు అంబేడ్కర్‌ను అర్థం చేసుకోవడానికి కవులకు ఉత్ర్పేరకంగా నిలిచింది.

1906 నుంచి హైదరాబాద్‌ కేంద్రంగా దళితుల సర్వతో ముఖ విముక్తి కోసం చారిత్రాత్మక పోరాటం సాగించిన భాగ్యరెడ్డివర్మ సాంగత్యంలో కుసుమ ధర్మన్న అంబేడ్కర్‌ రాజకీయ ఎరుకను అందిపుచ్చుకున్నాడు. స్వయంగా అంబేడ్కర్‌ను, గాంధీని కలుసుకొని వారి అభిమానాన్ని పొందిన దళిత నాయకుడు కుసుమ ధర్మన్న. తెలుగులో అంబేడ్కర్‌ స్ఫూర్తితో రచనలు చేసిన తొలికవి కుసుమ ధర్మన్న. తొలిదశలో ధర్మన్న గాంధీ ఆదర్శాలను అనుస రించాడు. గాంధీ పట్ల గౌరవంతో తన కుమారులకు పతిత పావన మూర్తి, మోహనదాసు అని పేర్లు కూడా పెట్టుకున్నాడు. దళిత రాజకీయహక్కుల పరిరక్షణ కోసం అంబేడ్కర్‌ ప్రతిపాదనతో బ్రిటీష్‌ ప్రభుత్వం ప్రకటించిన కమ్యూనల్‌ అవార్డ్‌ను గాంధీ వ్యతిరేకించి, ఆమరణ నిరాహార దీక్ష చేశాడు. ఈ పరిణామంతో దళిత విద్యా వంతుల్లో, మేధావుల్లో గాంధీ పట్ల వ్యతిరేకత చోటు చేసుకుంది. కుసుమ ధర్మన్న గాంధీ ధోరణిని తప్పు బట్టాడు. హరిజనోద్యమ వైఖరిని దుయ్యబట్టాడు. దళితుల ప్రగతికి, భారతదేశ సంపూర్ణ విముక్తికి బాటలు వేస్తున్న ఆదర్శవంతమైన అంబేడ్కర్‌ కార్యాచరణను, ఆయన తాత్త్విక విలువలను అర్థం చేసుకొని ధర్మన్న అంబేడ్కర్‌ వాదిగా జీవించాడు. ‘నేను హిందువుగా పుట్టినప్పటికీ హిందువుగా మరణించ’నని యోలా డిక్లరేషన్‌లో అంబేడ్కర్‌ ప్రకటించిన తరువాత ధర్మన్న మతదృక్పథం మారిపోయింది. ‘మాకొద్దీ తెల్లదొరతనం’ పాట (1921)లో హిందూ మతం పట్ల కొంత సానుకూల వైఖరిని చూపించిన ధర్మన్న ‘‘మేమేగ లేమండోయ్‌ - ఈ సైతాను మతముతోటి సాగలేమండోయ్‌’’ (దండాలు పాట - 1933) అని మత విముఖత తెలియజేసి, ఆ తరువాత ‘‘హిందూ సంఘమా సెలవు’’ (విజయ నగరంలో ధర్మన్న ప్రసంగం - 1936) అంటూ పూర్తిగా తిరస్కరించాడు. జయభేరి పత్రిక ముఖచిత్రంపై గాంధీ, అంబేడ్కర్‌ చిత్రాలను ప్రచురించి, గాంధీది సవతి తల్లి ప్రేమ అని, అంబేడ్కర్‌ది కన్నతల్లి ప్రేమ అని కుసుమ ధర్మన్న సత్యసమ్మతంగా, సాహసోపేతంగా సూత్రీకరించాడు. ప్రత్యామ్నాయ ఆలోచనలతో కుసుమ ధర్మన్న జాషువా, బోయి భీమన్నలను కూడా తీవ్రంగా ప్రభావితం చేశాడు. ప్రారంభదశలో వీరందరూ గాంధీని ఆరాధించారు.

గాంధీ ప్రారంభించిన హరిజనోద్యమం వల్ల తన జాతి జనుల కష్టాలన్నీ తొలగిపోతాయని జాషువా ఆశించాడు. అందుకనే జాషువా గాంధీతో భావోద్వేగబంధాన్ని ఏర్పరుచు కున్నాడు. ‘గాంధీ శాంతి సిద్ధాంత మార్దవ మార్గాటుడ’నని గర్వంగా ప్రకటించుకున్నాడు. కానీ స్వాతంత్ర్యానంతర సామాజిక పరిస్థితులను గమనించిన తరువాత జాషువా ఎంతగానో మధనపడ్డాడు. ఈ దిశగా జాషువాలో కట్టలుతెంచుకున్న భావావేశానికి గాంధేయ సూత్రాలు బంగారు సంకెళ్ళు వేశాయి. ఈ సంకెళ్ళలో ఇమడలేక బయట పడలేక ఆయన తీవ్ర సంఘర్షణను అనుభవించాడని ఆయన కవిత్వం సాక్ష్యం చెబుతుంది. ‘గబ్బిలం’ రెండవ భాగం (1946)లో ‘‘కలడంబేద్కరు నా సహోదరుడు’’ అనే పద్యంలో మొదటిసారిగా జాషువా అంబేడ్కర్‌ గురించి ప్రస్తావించాడు. అంబేడ్కర్‌ అనేక కష్టనష్టాలను ఎదు ర్కొని, విదేశాలకువెళ్లి దళితుల ఉన్నతి కోసం తిరిగి వచ్చిన విద్వాంసుడని, వైస్రాయి కొలువు కూటమిలో ఉత్తముడని గబ్బిలానికి చెబుతాడు కవి. ‘‘అతని మెప్పుల్‌ నీ జయారంభముల్‌’’ అంటూ అంబేడ్కర్‌ మెచ్చుకుంటే గబ్బిలానికి విజయం లభిస్తుందని ప్రత్యేకంగా పేర్కొం టాడు కవి. అంబేడ్కర్‌ లాగానే జాతీయోద్యమ కార్యా చరణను జాషువా అనుమానించాడు. ‘‘స్వాతంత్య్రంబను స్వర్ణసౌధమున మా భాగంబు మాకిత్తురో ఖాతా లేదని త్రోసిపుచ్చెదరో’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు. స్వాతంత్య్రం అనే మంత్రదండం సాంఘిక దోపిడిని, అంటరానిత నాన్ని అంతంచేయగలదా? అని అంబేడ్కర్‌ సందేహం వెలిబుచ్చాడు. ‘‘స్వరాజ్య సూత్రము అస్పృశ్యతా వ్యాఘ్రాన్ని బంధించగలదా?’’ అని జాషువా కూడా ప్రశ్నించాడు. హరిజనోద్ధరణ ఒక రాజకీయఎత్తుగడ మాత్రమేనని, హరిజనోద్ధరణ ద్వారా దళితుల సంపూర్ణ విముక్తి సాధ్యం కాదని అంబేడ్కర్‌ భావించాడు. ‘‘హరి జనులనుద్ధరించు ప్రయత్నములందు/ వెనుక ముందాడుచున్నవి పెద్ద తలలు కొన్ని’’ అని జాషువా ఈ ఉద్యమ పరిమితులను ఎత్తిచూ పాడు. స్వతంత్ర భారతంలో దళితులు దేశ పాలకులుగా ఉండాలనుకుంటున్నారని అని అంబేడ్కర్‌ రాజకీయ భరోసాను అందించాడు. ‘‘వెరపు వలదు నీకు హరిజనసోదరా/ స్వీయ రాజ్యరథము వెడలి వచ్చె/ లాగికొమ్ము నీకు భాగమ్ము గలదంచు’’ జాషువ అంబేడ్కర్‌ ఉద్బోధించిన రాజ్యాధికార ఎరుకను సముచితంగా కవిత్వీకరించాడు. అంబేడ్కర్‌ మరణాంతరం శ్రద్ధాంజలి శీర్షికతో జాషువా రాసిన పద్యాలను పరిశీలిస్తే ఆయన అంబేడ్కర్‌ మహాశయుని ఎలా అర్థం చేసుకున్నాడో తెలుస్తుంది. ‘‘అస్పృశ్యతా/ ధూమజ్వాలల గ్రాగు సోదర జన/ స్తోమార్థమై, శాంతి సం/ గ్రామో ద్దండులతో నెదిర్చి జయశం/ఖంబెత్తి, యావజ్జగం/ బామోదింపగ నిద్ర మేల్కొలిపె నా/డాత్మీయ జాతీ యులన్‌’’ (ఖండకావ్యం7) అంటూ అంబేడ్కర్‌ నిర్వహించిన అద్వితీయ పాత్రను జాషువ కొనియాడాడు. గాంధీని ఉద్దేశించే జాషువా శాంతిసంగ్రామోద్దండులు అనే మాట ప్రయోగించాడని భావించవచ్చు. జాతీయస్థాయిలో అంబేడ్కర్‌ చేసిన కృషిని వార్తా పత్రికల ద్వారా తెలుసుకొని జాషువ ప్రేరణ పొంది ఉండవచ్చు. అసమసమాజం నేర్పిన అనుభవాలతో, అస్తిత్వ చైతన్యంతో జాషువా అంబేడ్కర్‌ లాగానే ఆలోచించి ఉండవచ్చు.

‘‘గొంతెత్తి నీ పాట పలికింతునా/ గంతేసి నీ బాట నడిపింతునా’’ అంటూ తన రచనల డా. బోయి భీమన్న ద్వారా అంబేడ్కర్‌ ఔన్నత్యానికి నీరాజనాలు పలికాడు. అంబేడ్కర్‌ విశ్వరూపం భీమన్న కవిత్వంలో సాక్షాత్కరిస్తుంది. అంబేడ్కర్‌ అందించిన విద్యాచైత న్యాన్ని, రాజకీయచైతన్యాన్ని ‘పాలేరు’, ‘కులిరాజు’ నాటకాల్లో ప్రజారంజకంగా చిత్రించాడు. అంబేడ్కర్‌ ఆంధ్రదేశ పర్యటన సందర్భంగా జరిగిన సభలో బోయి భీమన్న అంబేడ్కర్‌ గురించి ఆంగ్లంలో కవిత చదివి, అంబేడ్కర్‌ ప్రశంసలందుకున్నాడు. కలకత్తా నుంచి వెలువడే ‘పీపుల్స్‌ హెరాల్డ్‌’ పత్రిక భీమన్న కవితను సంపాదకీయంగా ప్రచురించింది. భీమన్న సాహిత్యంలో మొదట వైదిక మత ధోరణి తొంగి చూస్తుంది. ఆర్ష సంప్రదాయాన్ని భీమన్న అభిమానించాడు. రారాజు పక్షం వహించి భీష్ముడు పాండవుల విజయాన్ని అభి లషించినట్లు, వైదిక సమాజ అస్తిత్వాన్ని అంగీకరి స్తూనే భీమన్న అంబేడ్కర్‌ ప్రాభవానికి జేజేలు పలికాడు. ఇలాంటి వైరుధ్యాలున్నప్పటికి అంతిమంగా భీమన్న అంబేడ్కర్‌ను అను సరించాడు. అంబేడ్కర్‌ ప్రసిద్ధ రచన ‘ఎన్హిలేషన్‌ ఆఫ్‌ కాస్ట్‌’ను కులనిర్మూలన పేరుతో భీమన్న అనువదించాడు. ఈ రచన తరువాత భీమన్న ఆలోచనల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇంచుమించుగా ఇదే సందర్భంలో ఆయన రచించిన ‘ధర్మంకోసం పోరాటం’ అంబేడ్కర్‌ వాదానికి నిలువుటద్దంలా ఉంటుంది. ధర్మం అంటే సర్వమానవ సమానత్వమే. అంబేడ్కర్‌ అభిలషించిన సమతామార్గాన్ని అనుసరించటమే ఈనాటి ఏకైక సాంఘిక ధర్మమని ఈ గ్రంథంలో భీమన్న ప్రతిపాదించాడు. మార్క్స్‌ కంటే మహాత్ముడి రాజనీతి, మహాత్ముడి రాజనీతి కంటే, అంబేడ్కర్‌ సమతాధర్మం ఉన్నతమైనదని భీమన్న వాదించాడు. అంబేడ్కర్‌ వ్యక్తిత్వాన్ని, ఆయన ప్రబోధాలను, ఆలోచనల సారాం శాన్ని వివేచిస్తూ వందకు పైగా పాటలు రచించి ప్రజల్లో భీమ చైతన్యాన్ని రగిలించాడు. ‘‘జయ జయ అంబేద్కర/ జయ దళిత జనస్వరా/ జయ భారత భాస్కరా’’ అనే భీమన్న పాట ఐదు దశాబ్దాలుగా తెలుగు ప్రజల గుండెల్లో ప్రతిధ్వనిస్తుంది. ‘‘అడుక్కుంటే దొరికేది ఎంగిలి/అదిలిస్తే లభించేది అధికారం’’ అంటూ భీమన్న అంబేడ్కర్‌ నిర్దేశించిన ‘మాస్టర్‌ కీ’ విశిష్టతను జాతి జనులకు చాటి చెప్పాడు. ‘అంబేద్కరిజం’ , ‘అంబేడ్కర్‌ మతం’ వంటి వచన రచనల్లో ఆ మహానాయకుడిని అనుసరించవలసిన ఆవశ్యకతను, ఆయన ఆశించిన సాంఘిక, ఆర్థిక ప్రజాస్వామ్య దృష్టిని భీమన్న నిశితంగా విశదపరిచాడు.

బోయి భీమన్న తరువాత అంబేడ్కర్‌ పట్ల అమితానురాగంతో కవిత్వం వెలువరించిన కవి చోడగిరి చంద్ర రావు. ‘ఏమి చెప్ప నయ్య భీమరాయ’ అనే మకుటంతో భీమద్విశతి రచించి బహుముఖీ నమైన అంబేడ్కర్‌ స్ఫూర్తిని సమర్థవంతంగా చంద్ర రావు కవిత్వీకరించాడు. సభ్య సమాజము, సాటి భారతీయులు అంటరాని జనులను మానసిక చిత్రహింసలకు గురి చేసి, చితుల పడదోస్తుంటే బాధ్యతారహితంగా ప్రేమకవిత్వం రాయలేనని చెప్పి ‘భీమ కవి’గా చంద్రరావు అంబేడ్కర్‌ సమతా సందేశాన్ని అక్షరబద్ధం చేశాడు. ‘‘కవిత నీవు, నాకు కావ్య వస్తువు నీవు/ కంఠ మందు నీవు, కనుల నీవు/ నీవు లేని నేను నిర్జీవ ప్రతిమనే’’ అని చంద్రరావు అంబేడ్కర్‌ పట్ల అసాధారణ భక్తిప్రపత్తులను వెలిబుచ్చాడు. కారల్‌ మార్క్స్‌, మావో ల భావజాల ప్రభావంతో ఎరుపెక్కిన డెబ్భయ్యో దశకం తెలుగుకవిత్వంలో చంద్రరావు భీమ పతాకాన్ని ఎగురవేయడం విశేషంగా చెప్పవచ్చు.

బొడ్డుప్రకాశం, నూతక్కి అబ్రహాం, అత్తోట రత్నకవి, తిమోతి జ్ఞానానందకవి, బీర్నీడి మోషే, దాసి బస వయ్య, కె.సి. జాన్‌, మల్లవరపు జాన్‌, కొలకలూరి స్వరూపరాణి తదితర పద్యకవులు, కవయిత్రులు అంబేడ్కర్‌ను నాయకోత్తముడిగా, దైవంగా, దార్శని కునిగా మహర్ప్రభువుగా, నిమ్నజాతి విమోచకునిగా జాతిభవిష్యదభీప్సితుండుగా, ‘‘రాజ్యాంగమనియెడి శిశువును కన్నట్టి ప్రియజనకుని’’గా ప్రస్తుతించారు. ‘అంబేద్కరో సమరసింహ’ అనే కావ్యంలో అంబేడ్కర్‌ పోరాట తీరుతెన్నులను రావూరి ఏకాంబరం ఆమోదయోగ్యమైన వాదనాపటిమతో విమర్శించాడు. గాంధీ తదితర జాతీయ నాయకుల కంటే నా జాతి విద్యావంతులే నాకు ద్రోహం చేశారని అంబేడ్కర్‌ ఆవేదన చెందాడు. ఈ ఆవేదనకు ఏకాంబరం అక్షర రూపమిచ్చాడు ‘‘సిద్ధాంతములు నాస్తి, రాద్ధాంతములు జాస్తి/ సిగపట్లు జస్తయ్యె సిగ్గులేక/ స్వార్థ ప్రయోజనాల్‌, బహునాయకత్వాలతో, అనైక్యతతో అంబేద్కరీయులే అంబేద్కరీయులకు ఆగర్భశత్రువులగా మారుతున్నా’’రని రావూరి ఏకాంబరం ఆత్మవిమర్శ దృక్కోణంలో నుండి ఆరోపించాడు. కులాన్ని కూల్చందే, ధనాన్ని పంచనిదే దేశానికి ప్రగతి లేదనే స్పష్టమైన అంబేడ్కర్‌ ప్రభావంతో కొలకలూరి ఇనాక్‌ ఆరు దశాబ్దాల నుంచి కవిత్వం రాస్తున్నాడు. మనిషి సైనికుడవ్వాలన్నా, తాత్త్వికుడవ్వాలన్నా అతనిని నడిపించే భావజాలం ప్రధానమని భావించిన దళిత ఉద్యమనేత కత్తి పద్మారావు అసాధారమైన తన వక్తృత్వం, కర్తృత్వం తో అంబేడ్కర్‌ సామాజిక, రాజకీయ, సాంస్కృతిక తత్త్వాన్ని విస్తృతంగా చాటి చెబుతున్నాడు. వామపక్ష ఉద్యమాలదారిలో నుంచి దళిత ఉద్యమంలోకి దూసుకువచ్చిన బొజ్జాతారకం ‘నది పుట్టిన గొంతుక’ కవితాసంపుటిలో గాంధీ అంబేడ్కర్‌ల మధ్యవున్న భావజాలపరమైన వ్యత్యాసాన్ని వివేచించాడు. ‘అందుకోదండాలు బాబా అంబేద్కరా’ పాట ద్వారా మాస్టార్జీ అంబేడ్కర్‌ జీవన స్ఫూర్తిని అద్భుతంగా ఆవిష్కరించి దళిత ఉద్యమంలో సాంస్కృతిక ఉత్తేజాన్ని కలిగించాడు. శంభుక , సవేర ల కవిత్వంలో అంబేడ్కర్‌ చింతన వ్యక్తమవుతుంది. జి. లక్ష్మీనరసయ్య ప్రధాన సంపాదకుడిగా వెలువడిన ‘పదునెక్కినపాట’ కవితాసంకలనం నుండి తెలుగు దళిత కవిత్వంలో ప్రగాఢమైన , సుస్పష్టమైన అంబేడ్కర్‌ ప్రభావ ముద్ర కనిపిస్తుంది. సమకాలీన కథ, నవల, నాటకం, పాట తదితర ప్రక్రియల్లోకి విస్తరిస్తున్న అంబేడ్కర్‌ ప్రభావం గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయవలసిన అవసరముంది.

కోయి కోటేశ్వర రావు

9440480274

Updated Date - 2023-04-10T01:03:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising