వచ్చేస్తోంది.. హోండా ఎలివేట్
ABN, First Publish Date - 2023-06-07T03:01:42+05:30
జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా తొలిసారిగా ఎలివేట్ పేరుతో మిడ్‌సైజ్ ఎస్‌యూవీ మోడల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. భారత్ సహా ప్రపంచ మార్కెట్ కోసం తయారు చేసిన ఈ కొత్త కారును మంగళవారం ఢిల్లీలో ఆవిష్కరించింది...
జూలైలో బుకింగ్స్ ప్రారంభం
ఆ తర్వాత మార్కెట్లోకి విడుదల
రూ.12-17 లక్షల శ్రేణిలో ధర!?
న్యూఢిల్లీ: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా తొలిసారిగా ఎలివేట్ పేరుతో మిడ్‌సైజ్ ఎస్‌యూవీ మోడల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. భారత్ సహా ప్రపంచ మార్కెట్ కోసం తయారు చేసిన ఈ కొత్త కారును మంగళవారం ఢిల్లీలో ఆవిష్కరించింది. భారత్‌లో హోండా ఇదివరకు ఎస్‌యూవీ సెగ్మెంట్లో సీఆర్-వీ, బీఆర్-వీ మోడళ్లను విక్రయించింది. కస్టమర్ల నుంచి అంతగా ఆదరణ లభించకపోవడంతో ఇప్పటికే వాటిని మార్కెట్ నుంచి ఉపసంహరించుకుంది. తాజాగా హోండా.. ఎలివేట్‌తో ఎస్‌యూవీ సెగ్మెంట్లోకి పునఃప్రవేశించబోతోంది. ఈ జూలైలో ఎలివేట్ బుకింగ్స్‌ను ప్రారంభించనున్నట్లు హోండా వెల్లడించింది. పండగ సీజన్‌లో మార్కెట్లోకి విడుదల చేయడంతో పాటు ధరను ప్రకటించనున్నట్లు తెలిపింది. వేరియంట్‌ను బట్టి ధర రూ.12-17 లక్షల శ్రేణిలో ఉండవచ్చని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హ్యుండయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, స్కోడా కుషాక్, ఫోక్స్‌వ్యాగన్ టైగున్ మోడళ్లతో ఈ కారు పోటీ పడనుంది.
2030 నాటికి 5 కొత్త ఎస్‌యూవీలు: మూడేళ్లలోగా ఎలక్ట్రిక్ ఎలివేట్ సహా 2030 నాటికి భారత మార్కెట్లోకి 5 కొత్త ఎస్‌యూవీలను ప్రవేశపెట్టాలనుకుంటున్నట్లు హోండా కార్స్ ఇండియా ప్రెసిడెంట్ అండ్ సీఈఓ టకుయా సుమురా తెలిపారు. ఎలివేట్ విడుదల ద్వారా భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో మార్కెట్ వాటాను మరింత పెంచుకోవాలనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం భారత మార్కెటో హోండా.. సిటీ, అమేజ్ పేరుతో సెడాన్ మోడళ్లను మాత్రమే విక్రయిస్తోంది. అయితే, భారత కార్ల మార్కెట్లో 40 శాతానికి పైగా వాటా ఎస్‌యూవీలదే. ఏటేటా ఈ వాటా పెరుగుతూ పోతోంది.
Updated Date - 2023-06-07T03:01:42+05:30 IST