VOter : ఎవరి జేబులో డబ్బులవి?
ABN, First Publish Date - 2023-08-26T03:21:35+05:30
మీరు నాకు రుణపడ్డారు. నాకు విధేయులుగా ఉండండి. ఆ రుణం తీర్చుకోండి!’... జనానికి ఇదీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాజా హుకుం! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజం! పాత పథకాలకే పేరు మార్చి, అమ లు తీరు మార్చిన జగన్ సర్కారు ‘సంక్షేమ’ డబ్బా గొప్పగా కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఎడాపెడా అప్పులు చేసి, అభివృద్ధిని పణంగా పెట్టి మరీ ఆయన ‘బటన్’ నొక్కుతున్నారని జనానికి తెలిసిపోయింది. ఈ నేపథ్యంలోనే...
ఎల్లప్పుడూ ఎందుకు ‘రుణపడాలి?’
సీఎం జగన్ వింత వైఖరి.. పథకాల లబ్ధిదారులకు వ్యక్తిగత లేఖలు
‘ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం’ అంటూ ప్రజల నుంచి సంతకాలు
పన్నులు, అప్పుల డబ్బులే పంపిణీ.. మరి జగన్‌కు రుణపడటమేమిటో?
(అమరాతి - ఆంధ్రజ్యోతి)
‘మీరు నాకు రుణపడ్డారు. నాకు విధేయులుగా ఉండండి. ఆ రుణం తీర్చుకోండి!’... జనానికి ఇదీ సీఎం జగన్మోహన్ రెడ్డి తాజా హుకుం! వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజంగా నిజం! పాత పథకాలకే పేరు మార్చి, అమ లు తీరు మార్చిన జగన్ సర్కారు ‘సంక్షేమ’ డబ్బా గొప్పగా కొట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఎడాపెడా అప్పులు చేసి, అభివృద్ధిని పణంగా పెట్టి మరీ ఆయన ‘బటన్’ నొక్కుతున్నారని జనానికి తెలిసిపోయింది. ఈ నేపథ్యంలోనే... ఓటర్లను ‘ఎమోషనల్ బ్లాక్‌మెయిల్’ చేసే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ‘‘మీకు ఫలానా పథకం కింద ఇంత లబ్ధి చేకూరింది. దేవుని దయ, ప్రజలందరి చల్లని దీవెనలు మంచి చేసే మన ప్రభుత్వం మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అంటూ వైఎస్ జగన్ సంతకం ముద్రించిన పత్రాలను ఇంటింటికీ పంచాలని నిర్ణయించారు. అయితే... ఈ పత్రం తమకు అందినట్లుగా లబ్ధిదారులు ‘రశీదు’ (అక్నాలెడ్జ్‌మెంట్)పై సంతకం చేయాలి. ‘‘నాకు/నా కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ద్వారా అక్షరాలా ఇంత మొత్తం లబ్ధి చేకూరినందుకు సంతోషిస్తున్నాను’’ అని రాశారు. అంతటితో ఆగి ఉంటే బాగుండేదే. కానీ... ‘గౌరవ ముఖ్యమంత్రివర్యులకు మరియు ఈ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను’’ అని కూడా రశీదుపై ముద్రించారు. దానిపై లబ్ధిదారు సంతకం తీసుకుంటారు. ‘ఎల్లప్పుడూ రుణపడి ఉండేలా’ ప్రజలను ఒప్పించాలని ప్రయత్నించడమే ఇక్కడ అసలు విచిత్రం! ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలే ఆయనకు రుణపడి ఉండాలన్న మాట!
అసలు ఉద్దేశం ఏమిటి?
‘ఫలానా ప్రభుత్వ పథకం ద్వారా మీకు ఇంత లబ్ధి చేకూరింది’ అని ప్రజలకు చెప్పడం కొత్తేమీ కాదు. మొదట్లో... సీఎం సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్) ద్వారా లబ్ధి పొందిన వారికి ఇలా లేఖలు పంపించేవారు. ‘‘మీ చికిత్స కోసం సీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ.50వేలు సహాయం అందించడం జరిగింది. మీరు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నాము’’ అంటూ లేఖలు పంపించేవారు. ఆ తర్వాత... వివిధ పథకాల లబ్ధిదారులకూ లేఖలను పంపించడం మొదలైంది. దీనివెనుక రెండు ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి... తమ ప్రభుత్వం ద్వారా లబ్ధి జరిగిందని చెప్పడం. రెండు... నిజంగా సదరు ప్రయోజనం చేకూరిందో, లేదో తనిఖీ చేయడం. సదరు పథకం తనకు వర్తించనప్పటికీ, లబ్ధి చేకూరినట్లుగా లేఖ అందితే వెంటనే సదరు వ్యక్తి అప్రమత్తమై అధికారులను నిలదీసే అవకాశముంది. ఒకరకంగా చెప్పాలంటే ఇది తనిఖీ వ్యవస్థ లాంటిది. అంతే తప్ప.. ‘నువ్వు మాకు రుణపడి ఉన్నావు’ అని చెప్పుకొనేందుకు కానే కాదు.
ఎవరి సొమ్ము... ఎవరికి ‘రుణం’?
సొంత జేబు నుంచో, సొంతంగా ఏర్పాటు చేసిన ట్రస్టు నుంచో సహాయం చేసిన వాళ్లు కూడా... ‘మీరు నాకు ఎల్లప్పుడూ రుణ పడి ఉండాలి’ అని ఆశించరు. అలా అని అడగరు. ఇక్కడ ముఖ్యమంత్రి ప్రజలకు తన సొంత డబ్బులేం పంచడంలేదు. పథకాల కోసం ఖర్చు చేస్తున్నది పన్నుల రూపంలో ప్రజలు కట్టే డబ్బులే! దీంతోపాటు రాష్ట్ర భవిష్యత్తును తాకట్టుపెడుతూ ఎప్పటికప్పుడు అప్పులు తెస్తున్నారు. ఇందులో సీఎం సొంత మెహర్బాణీ ఏమిటో, ఆయన పడుతున్న కష్టం ఏమిటో! ఒక ప్రాజెక్టు పూర్తి చేయడం కష్టం! ఒక భారీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకురావడం కష్టం! అభివృద్ధి చేయడం కష్టం! ఇవేవీ చేయకుండా... జనం సొమ్ములను జనానికే పంచుతూ, ‘మీరు ఎల్లప్పుడూ రుణపడి ఉండాలి’ అని ఆశించడమేమిటో! జగన్ సర్కారు ప్రచార పిచ్చి పీక్స్‌కు చేరినట్లు ఇప్పటికే విమర్శలున్నాయి. చివరికి... బడిపిల్లలకు పెట్టే కోడిగుడ్లమీద ‘జగన్, వైఎ్‌స’ల పేర్లు ముద్రిస్తున్నారు. ఇప్పుడు ఏకంగా జగన్ ఫొటోతో పథకాల లబ్ధి లేఖను రూపొందించారు. ‘‘దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలతో మీకు లబ్ధిచేకూర్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను సంతోషపడుతున్నాను. దేవునిదయ, ప్రజలందరి చల్లని దీవెనలు, మంచిచేసే మనందరి ప్రభుత్వంమీద కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అని అందులో ముద్రించారు. వీటిని వలంటీర్ల ద్వారా పంపిణీ చేసి, ‘రుణపడి ఉంటాను’ అనే పత్రంపై సంతకాలు తీసుకోనున్నారు.
హిట్లర్, తుగ్లక్ కూడా చేయని పని...
‘‘సీఎం తన ఇంట్లోనుంచి డబ్బులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదు. జనం సొమ్ముతోనే పాలన చేస్తున్నారు. తమ సంక్షేమం బాగా చూసుకుంటారని నమ్మే ప్రజలు ఆయన్ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు. అది మరచిపోయి, ప్రజలకు నేను చాలా చేశాను, ప్రజలే నాకు రుణపడి ఉన్నారని లిఖితపూర్వక ఆమోదపత్రాలు తీసుకోవడం వింతగా ఉంది. ఇలాంటి పనులు హిట్లర్, తుగ్లక్ కూడా చేయలేదు. ఎవరికి ఎవరు రుణపడి ఉన్నారో జగన్‌కు ఆయన మంత్రులు, సలహాదారులైనా చెప్పాలి. లేదంటే ఆయనేదో వింత ఆలోచనల్లో ఉన్నారని అంతా అనుకునే ప్రమాదం ఉంది’’
- మణికంఠ, సామాజిక వేత్త
Updated Date - 2023-08-26T03:21:40+05:30 IST