cm jagan 'outsourcing': ‘అవుట్ సోర్సింగ్’ హామీ ఏమైంది?
ABN, First Publish Date - 2023-06-11T03:50:07+05:30
రాష్ట్రంలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో సీఎం జగన్ మాట తప్పారని, మడమ కూడా తిప్పారని అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
అధికారంలోకి వస్తే క్రమబద్ధీకరిస్తామని ప్రతిపక్షనేతగా అప్పట్లో జగన్ హామీ
ఇప్పుడు కాంట్రాక్ట్ ఉద్యోగులకేనని ప్రకటన
పలువురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్వాసన
ఏ నెలా జీతాలు సక్రమంగా ఇవ్వని సర్కార్
ఇచ్చిన ఏ హామీనీ నిలబెట్టుకోని ముఖ్యమంత్రి
కార్పొరేషన్‌తోనూ ప్రయోజనం లేదని ఆవేదన
రెండున్నర లక్షల మంది ఉద్యోగుల ఆందోళన
(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో సీఎం జగన్ మాట తప్పారని, మడమ కూడా తిప్పారని అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. విపక్ష నేతగా ఉన్నప్పుడు తమ సమస్యలపై భారీ ఎత్తున అసెంబ్లీలో ప్రసంగాలు చేసిన ఆయన ఇప్పుడు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా తమ సమస్యలను పట్టించుకోకపోగా తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరిస్తామని ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కారని నిప్పులు చెరుగుతున్నారు. ఈ సందర్భంగా విపక్ష నేతగా అప్పట్లో జగన్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలను ఉద్యోగులు గుర్తు చేస్తున్నారు.
మేమొచ్చాకైనా చేస్తాం!
‘‘అధ్యక్షా ఒక్కటే ఒక్కటి నేను అడుగుతున్నా.. ఎన్నికల మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట ఏమిటి? ఆ రోజు ఏమైనా మీరు కాంట్రాక్టు వేరు. అవుట్ సోర్సింగ్ వేరు అని చెప్పారా? అవుట్ సోర్సింగ్‌లో కూడా అదే క్వాలిఫికేషన్ ఉన్న వారే పని చేస్తున్నారు. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు మధ్య చాలా చిన్న తేడా ఉంది. క్వాలిఫికేషన్‌లో మాత్రం ఎలాంటి తేడా లేదు. మీ(టీడీపీ) మేనిఫెస్టోలో మీరు చెప్పిందేమిటి? కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ అందరినీ ఫర్మినెంట్ చేస్తారని చెప్పారు. ఉద్యోగులందరూ మీ మాట నమ్మారు. వాళ్లను ఇప్పుడు నట్టేట ముంచొద్దు అని గట్టిగా చెప్తున్నా. ఇవాళ మీరు చేయకపోతే మేమొచ్చిన తర్వాత చేస్తామని భరోసా ఇస్తున్నా’’ అని ప్రతిపక్షనేతగా జగన్ అసెంబ్లీలో దంచికొట్టారు. అంతేకాదు.. ‘‘మీ మేనిఫెస్టో ఇది అధ్యక్షా! ఐకేపీ, ఎన్‌ఆర్‌ఈజీఎ్‌స, ఆర్టీసీ, విద్యుత్, వైద్య, ఆరోగ్య మొదలైన ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సర్వీసులను క్రమబద్ధీకరణ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తామన్నారు. పరిశీలిస్తాము అంటే.. చేయము అని మీ ఉద్దేశమా? అని అడుగుతున్నా. ఇవాళ ఏం చెప్తున్నారు. పరిశీలిస్తామని చెప్పినారు గానీ, ఇవ్వడానికి కాదు అని చెప్తున్నారు’’ అంటూ టీడీపీ సర్కార్‌ను నిలదీశారు. కట్ చేస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో జగన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టీడీపీపై ఓ రేంజ్‌లో విరుచుకుపడిన జగన్.. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల విషయంలో అన్యాయం చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా రెండన్నర లక్షల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాంట్రాక్ట్ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా క్రమబద్ధీకరించాలని గత ప్రభుత్వాన్ని నిలదీసిన జగన్ ఇప్పుడెందుకు మడమ తిప్పారని ప్రశ్నిస్తున్నారు. గత ప్రభుత్వం కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సమానపనికి సమాన వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం అప్పట్లో తమకు భారీగా వేతనాలు పెంచిందని పేర్కొంటున్నారు. సెర్ప్, ఉపాధి విభాగాల్లో పలు కేడర్లకు సంబంధించిన ఉద్యోగులకు అప్పటి మంత్రి నారా లోకేశ్ 50 శాతం వరకు జీతాలు పెంచారని చెబుతున్నారు. వైసీపీ సర్కార్ వచ్చిన తర్వాత ఉపాధి హామీ సిబ్బందిలో కొన్ని కేడర్లకు ఉన్న జీతాలను తగ్గించారని వాపోతున్నారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పట్ల జగన్ అప్పట్లో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన భరోసాను మాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షంలో ఓ మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట చెబుతున్నారని అంటున్నారు.
ఉద్యోగులకు ఉద్వాసన
వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏడాది పాటు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఊసే ఎత్తలేదు. పైగా అడుగడుగునా వారి ఉద్యోగ భద్రతపై అనుమానాలు రేకెత్తించారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్‌లో వీలైనంత మందిని తొలగించేందుకు ఉన్న మార్గాలనూ అన్వేషించింది. పేపర్ నోటిఫికేషన్, ప్రభుత్వ ఉత్తర్వులు లేకుండా 2019 మార్చి 31కి ముందు ఉద్యోగాల్లో చేరిన రూ.40 వేల పైబడి వేతనాలు పొందుతున్న సచివాలయ శాఖలు, విభాగాధిపతులు, జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామ కార్యాలయాల్లో పనిచేసే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని తొలగించారు. ఆ తర్వాత 31-03-2019 వరకు పనిచేస్తున్న రూ.40 వేల పైబడి వేతనం తీసుకుంటున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది జాబితాను సేకరించి వారిని ఇంటికి సాగనంపారు. అనంతరం ఆర్థికశాఖ అనుమతి లేకుండా నియామకాలు పొందిన వారిపై వేటు వేశారు. ఆర్థిక, సాధారణ పరిపాలనశాఖ రోజుకో మెమో, సర్క్యులర్‌తో సిబ్బందిని హడలెత్తించింది.
సకాలంలో అందని జీతాలు
వైసీపీ హయాంలో కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏ నెలా సకాలంలో జీతాలు చెల్లించలేదు. ఇప్పటికీ పలు శాఖల్లో పనిచేసే సిబ్బందికి నెలల తరబడి జీతాలు పెండింగ్‌లోనే ఉన్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు ఇవ్వాల్సిన హెల్త్‌కార్డులు, ఇతర బెనిఫిట్స్ ఇప్పటికీ అమలు కావడం లేదు. గ్రామ సచివాలయాలు ప్రారంభం కావడంతో ఉపాధి హామీ పథకంలో పనిచేసే సిబ్బంది ఉనికి కూడా ప్రశ్నార్థకమైంది. రాష్ట్రంలో ఏపీవోలు 591 మంది, కంప్యూటర్ ఆపరేటర్లు 1526 మంది, ఇంజనీరింగ్ కన్సల్టెంట్లు 520 మంది, టెక్నికల్ అసిస్టెంట్లు 2123 మంది, బేర్‌ఫుట్ టెక్నీషియన్లు 800 మందితో పాటు ఫీల్డ్ అసిస్టెంట్లు/సీనియర్ మేట్లు/జూనియర్ మేట్లు సుమారు 15 వేల మంది దాకా ఉన్నారు. వారంతా ఉద్యోగ భద్రతపై ఆందోళన చెంది అమరావతికి వచ్చి ముఖ్యమంత్రి, మంత్రులకు మొరపెట్టుకున్నారు. ఇక, వాటర్‌షెడ్ ఉద్యోగుల పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా 790 మంది సిబ్బంది వాటర్‌షెడ్ కార్యక్రమాల కోసం పనిచేస్తున్నారు.
కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని తొలగిస్తామని అధికారులు బహిరంగంగా చెప్పకపోయినా గ్రామ సచివాలయ ఉద్యోగుల విధులను బట్టి తమ ఉద్యోగాలకు ఉద్వాసన పలికినట్లేనని ఆవేదన చెందుతున్నారు. మహిళా శిశు సంక్షేమశాఖలో పోషణ్ అభియాన్‌లో పనిచేసే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు 340 మందిని తొలగించడంతో కాంట్రాక్టు ఉద్యోగుల్లో అప్పట్లోనే భయాందోళనలు పెరిగాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇంటికి పంపడంతో సిబ్బంది ఆందోళనతో నిరసనలు కూడా చేపట్టారు. కార్పొరేషన్‌తో భరోసా ఏదీ?
ప్రైవేట్ ఏజెన్సీల కమీషన్ల బెడద లేకుండా సకాలంలో జీతాలు వచ్చేలా చేస్తామని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భరోసా ఇస్తూ ప్రభుత్వం అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పింది. రాష్ట్రంలో రెండున్నరల లక్షల మంది ఉండగా, వీరిలో లక్ష మందిని మాత్రమే అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్‌లో నమోదు చేసింది. ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగులకు అందినట్లే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు నెల నెలా జీతాలు అందించనున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ కార్పొరేషన్ ఏర్పాటుతో ఒనగూరే ప్రయోజనమేమిటో ఎవరికీ అర్థం కాలేదు. పైగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ప్రాపకంతోనే ఈ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగాలు లభించడం, తొలగించడం చేస్తారన్న ప్రచారం సాగింది. దీంతోపాటు కార్పొరేషన్ ద్వారా అవినీతి, రాజకీయ పక్షపాతం లేకుండా ఒక్క ఉద్యోగమైనా మెరిట్‌కు లభిస్తుందా? అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. సొంత పార్టీ వ్యక్తుల కోసం ప్రస్తుతం పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులెందరిని బలిగొంటారోనన్న ఆందోళన సిబ్బందిలో నెలకొంది.
Updated Date - 2023-06-11T04:45:58+05:30 IST