Tidco houses : అమరావతిలో ‘టిడ్కో’ ఇళ్ల సంగతేంటి?
ABN, First Publish Date - 2023-05-02T02:41:26+05:30
రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించిన 5 వేల టిడ్కో ఇళ్ల సంగతేంటి? లబ్ధిదారుల వివరాలు, ఇళ్ల కేటాయింపునకు అనుసరించిన విధివిధానాలు
లబ్ధిదారుల వివరాలివ్వండి.. ప్రభుత్వం, సీఆర్డీఏకు హైకోర్టు ఆదేశం
అమరావతి, మే 1(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతి ప్రాంతంలో నిర్మించిన 5 వేల టిడ్కో ఇళ్ల సంగతేంటి? లబ్ధిదారుల వివరాలు, ఇళ్ల కేటాయింపునకు అనుసరించిన విధివిధానాలు ఏంటి? అని రాష్ట్ర ప్రభుత్వాన్ని, సీఆర్‌డీఏను హైకోర్టు ప్రశ్నించింది. ఆయా వివరాలను తమ ముందు ఉంచాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది. నిర్మాణం పూర్తి చేసుకున్న టిడ్కో ఇళ్లు కేటాయించకుండా హడావుడిగా ఇళ్ల పట్టాలు ఇవ్వడంపై పిటిషనర్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని పేర్కొంది. టిడ్కో ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం, పిటిషనర్లు పూర్తి సమాచారాన్ని ఇవ్వలేదని తెలిపింది. ఈ వ్యవహారంపై వాదనలు వినిపించేందుకు సిద్ధమై రావాలని సూచిస్తూ.. విచారణను నేటి(మంగళవారం)కి వాయిదా వేసింది. ఈమేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ ఎన్. జయసూర్యలతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది.
Updated Date - 2023-05-02T02:41:26+05:30 IST