చేపలు కాదు.. రొయ్యలే..!
ABN, First Publish Date - 2023-03-09T00:30:42+05:30
వరి సాగు వల్ల ఆదాయం అంతంతమాత్రంగా ఉండడంతో అధిక లాభాలు సంపాదించా లనే దిశగా పంట పొలాలను చెరువులను మార్చేస్తున్నారు.
చెరువుల్లో అనుమతులు తీసుకున్నది ఒకటి..
సాగు చేస్తున్నది మరొకటి
పెనుమంట్ర మండలంలో ఆక్వా విచిత్రం
కలెక్టర్ జోక్యంతో అధికారుల హడావుడి
పెనుమంట్ర, మార్చి 8 : వరి సాగు వల్ల ఆదాయం అంతంతమాత్రంగా ఉండడంతో అధిక లాభాలు సంపాదించా లనే దిశగా పంట పొలాలను చెరువులను మార్చేస్తున్నారు. చేపల చెరువులకు అనుమతులు తీసుకుని కొందరు గుట్టుచప్పుడు కాకుండా రొయ్యల సాగు చేస్తున్నారు. ఈ కారణంగా తమ పంట పొలాలు దెబ్బ తింటున్నాయని, పంట కాల్వలు మురుగు బోదెలుగా మార్చేస్తున్నారని ఎన్ని ఫిర్యాదులు చేసినా కాసుల గలగల మధ్య ఫలితం లేదని సరిహద్దు రైతులు వాపోతున్నారు. వీవీ పాలెంలోని పెనుమంట్ర సాంబయ్య చెరువుగట్టు ప్రాంతంలో కొందరు రొయ్యల సాగు చేస్తున్న కారణంగా ఉప్పు నీరు తమ పంట పొలాల్లోకి వచ్చి, వరి దిగుబడి తగ్గుతోందని రాగు సాయి మనోహర్, రాగు విజయేంద్రసాయి కలెక్టర్ కార్యాలయంలో జరిగే స్పందనలో నెల క్రితం ఫిర్యాదు చేశారు. మండలస్థాయి అధికారుల నిర్లక్ష్యం కారణంగా సంబంధిత రైతు కోర్టును ఆశ్ర యించడంతో అధికారులు దీనిని అడ్డుపెట్టుకుని చర్యలు తీసుకోవడం నిలుపుదల చేశారు. గత సోమవారం జరిగిన స్పందనలో మరోసారి ఫిర్యాదు చేయడంతో కలెక్టర్ పి.ప్రశాంతి మండల స్థాయి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని, అనధికారిక బోర్లను మూసివేయాలని ఆదేశించారు. దీంతో మండలస్థాయి అధికారుల్లో చలనం వచ్చింది. చర్యలు తీసుకోవాలంటూ గ్రామ సచివాలయ అధికారులను ఆదేశించా రు. ఏ చర్యలు తీసుకుంటారో చూడాలి. మండలంలోని పలు గ్రామాల నుంచి ఇదే రకం ఫిర్యాదులు వెల్లువలా వస్తున్నా మండల స్థాయి అధికారులు మాత్రం చేపల చెరువులు సాగు చేస్తున్నారనే నివేదికలు ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి.
3,098 ఎకరాల్లో సాగు
పెనుమంట్ర మండలంలో అధికారిక లెక్కల ప్రకారం 3,098 ఎకరాల్లో చేపల సాగు జరుగుతోంది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో రొయ్యల సాగు మాత్రమే జరగడం విశేషం. ఫిర్యాదు వచ్చినప్పుడు అధికారులు హడావిడి చేయడమే తప్పా చర్యలు శూన్యం. అనధికారికంగా కూడా రొయ్యల సాగు జరుగుతోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాస్థాయి అధికారులు ప్రత్యేక తనిఖీలు చేస్తే అసలు విష యం బయటపడుతుందని రైతులు చెబుతున్నారు.
Updated Date - 2023-03-09T00:30:42+05:30 IST