మూడు రోజులు.. రూ.21 కోట్లు
ABN, First Publish Date - 2023-01-18T00:09:43+05:30
జిల్లాలో సంక్రాంతి పండుగ పేరు చెప్పి మూడు రోజులు మద్యం ఏరులై పారింది.
భీమవరం క్రైం/భీమవరంటౌన్, జనవరి 17 : జిల్లాలో సంక్రాంతి పండుగ పేరు చెప్పి మూడు రోజులు మద్యం ఏరులై పారింది. మద్యం షాపుల వద్ద మద్యపాన ప్రియులు క్యూ కట్టారు. జిల్లాలోని 182 మద్యం షాపులు, 24 బార్లలలో సుమారు రూ.21 కోట్లు మద్యం తాగేశారు. గతేడాది మూడు రోజులు రూ.20 కోట్ల 2 లక్షలు అమ్మకాలు జరగ్గా ఈ ఏడాది 20 కోట్ల 89 లక్షల మద్యం అమ్మకాలు జరిగినట్టు ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. అంటే గతేడాది కంటే ఈ ఏడాది రూ.87 లక్షలు అదనంగా అమ్మకాలు జరిగాయి. ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చిన వారు సొంత వాహనాల్లో తెలంగాణ మద్యం వెంట తెచ్చుకున్నట్టు సమాచారం. దీంతో పక్క రాష్ట్ర మద్యం కూడా ఈ ప్రాంతంలో ఏరులై పారింది.
ఆర్టీసీ పండుగ ఆదాయం రూ.1.80 కోట్లు
ఈ ఏడాది సంక్రాంతి సీజన్‌లో ఆర్టీసీకి ఆదాయం పెరిగింది. కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత మొదటి పండుగ సందర్భంగా అధికారులు అంచనాలకు తగ్గటుగా ఆదాయం వచ్చింది. 11వ తేదీ నుంచి 14 తేదీ వరకు నాలుగు డిపోల నుంచి కలిపి రూ.కోటి 80 లక్షల 95 వేలు ఆదాయం వచ్చింది. హైదరాబాద్ నుంచి జిల్లా ప్రయాణికులను తీసుకు రావ డంలో అఽధికారులు స్పెషల్ సర్వీసులు మంచి ఫలితాన్నే ఇచ్చాయి. ఎటువంటి అదనపు ఛార్జీలు లేకుండా సాధారణ టిక్కెట్ ధరతోనే తీసుకురావడంతో ఆదాయం కొంత తగ్గింది. జిల్లావ్యాప్తంగా చూస్తే 11వ తేదీన రూ.41 లక్షల 58 వేల 679, 12న రూ.48 లక్షల 63 వేలు, 13న రూ.47 లక్షల 26 వేలు, 14న రూ.43 లక్షల 46 వేలు ఆదాయంగా వచ్చింది. ప్రస్తుతం పండుగ ముగియడంతో తిరుగు ప్రయాణానికి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నారు. బస్ కాంప్లెక్స్‌లు ప్రయాణికులతో రద్దీగా కనిపిస్తున్నాయి.
360 కేసులు..938 మంది అరెస్టు
జిల్లాలో ఈ నెల 14, 15, 16 తేదీల్లో కోడి పందేలు, జూదాలు, గుండాటలపై విస్తృతంగా దాడులు నిర్వహించినట్టు జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా మూడు రోజుల్లో 360 కేసులు నమోదు చేసి, 938 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. వారి వద్ద నుంచి 210 పందెం కోళ్లు, 227 కోడి కత్తులు, రూ.10,17,835 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందులో కోడి పందేలపై 174 కేసులు నమోదు చేయగా 409 మందిని అరెస్టు చేసి రూ.1,88,400 నగదు, 210 కోడిపుంజులు, 227 కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. జూదాలు, గుండాటపై 186 కేసులు నమోదు చేసి 526 మందిని అరెస్టు చేసి రూ.9,29,435 స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.
–––––––––––––
Updated Date - 2023-01-18T00:09:45+05:30 IST