విషాదం నుంచి తేరుకోని సోమవరం
ABN, First Publish Date - 2023-06-06T00:29:31+05:30
సోమవరం గ్రామం విషాదం నుంచి తేరుకోలేదు. కలవల శ్రీను ఆత్మహత్య ఘటన గ్రామస్థులను సైతం కంటతడి పెట్టించింది. మృతుడి భార్య పుష్పావతి, కుమార్తెలు మౌనిక, మహి కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి.
చాట్రాయి, జూన్ 5: సోమవరం గ్రామం విషాదం నుంచి తేరుకోలేదు. కలవల శ్రీను ఆత్మహత్య ఘటన గ్రామస్థులను సైతం కంటతడి పెట్టించింది. మృతుడి భార్య పుష్పావతి, కుమార్తెలు మౌనిక, మహి కుటుంబ సభ్యుల రోదనలు చూపరులను కంటతడి పెట్టిస్తున్నాయి. శ్రీను నుంచి ఎంతో సహాయం పొందిన సమీప బంధువైన సర్పంచ్ ఉప్పల శోభనబాబు పంచాయితీలో అవమానకర రీతిలో కొట్టి అవమానించటం వల్లే మనస్తాపంతో ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడని భార్య, కుమార్తెలు, బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు. సర్పంచ్ శోభనబాబు, మృతుడు కలవల శ్రీను ఒకే సామాజిక వర్గం మరియు దగ్గర బంధువులు కావటంతో ఎన్నో ఏళ్ళ నుంచి ఇద్దరు వైసీపీలో కలిసి కొనసాగుతున్నారన్నారు. శోభనబాబు గత స్థానిక ఎన్నికల్లో వైసీపీ తరఫున సర్పంచ్‌గా పోటీ చేయగా కలవల శ్రీను విజయవాడలో తన సోదరుడి ద్వారా రూ. లక్షల్లో అప్పు ఇప్పించటంతో పాటు 20 రోజుల పాటు ప్రచారంలో పాల్గొని నిర్వహించాడన్నారు. సర్పంచ్ శోభనబాబు పదవిలోకి వచ్చాక శ్రీనుకు ప్రాధాన్యత ఇవ్వకపోవటంతో విభేదాలు వచ్చినట్లు చెపుతున్నారు. శ్రీను ఆత్మహత్యకు బాధ్యులైన అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు.
నిష్పక్షపాతంగా దర్యాప్తు : డీఎస్పీ
కలవల శ్రీను ఆత్మహత్య ఘటనలో దోషులను కఠినంగా శిక్షిస్తామని నూజివీడు డీఎస్పీ అశోక్‌కుమార్ గౌడ్ అన్నారు. సోమవారం చాట్రాయి పోలీస్టేషన్‌లో మృతుడి కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి డీఎస్పీ ఘటన వివరాలు తెలుసుకున్నారు. నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని మృతుడి బంధువులకు డీఎస్పీ హామీ ఇచ్చారు.
దోషులను కఠినంగా శిక్షించండి : టీడీపీ
కలవల శ్రీను ఆత్మహత్య ఘటనలో దోషులను కఠినంగా శిక్షించాలని టీడీపీ నాయకులు డీఎస్పీని కలసి విజ్ఞప్తి చేశారు. పార్టీ జిల్లా అధికార ప్రతినిధి మందపాటి బసవారెడ్డి, తెలుగురైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మోరంపూడి శ్రీనివాసరావు, పార్టీ మండల అధ్యక్షుడు మరిడి చిట్టిబాబు, నోబుల్‌రెడ్డి, రామ్‌ప్రసాద్ డీఎస్పీని కలసి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.
Updated Date - 2023-06-06T00:29:31+05:30 IST