‘ఎంఆర్‌కే’లో మళ్లీ ఇంటర్మీడియట్
ABN, First Publish Date - 2023-08-27T23:56:03+05:30
బ్రిటీష్ హయాంలో ఏర్పడిన వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జడ్పీ హైస్కూల్‌ను మారిన విద్యా సంస్కరణలలో అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల విద్యాశాఖ నుంచి వెలువడిన 205 హైస్కూల్ అప్‌గ్రేడ్‌లో వీరవాసరం ఎంఆర్‌కేకు స్థానం లభించింది. గత ఏడాది మండలంలోని రాయకుదురు జడ్పీహైస్కూల్‌ను బాలికల జూనియర్ కళాశాల అప్‌గ్రేడ్ అయింది.
53 ఏళ్ల అనంతరం కో–ఎడ్యుకేషన్ కాలేజీగా ప్రభుత్వ నిర్ణయం
వీరవాసరం, ఆగస్టు 27 : బ్రిటీష్ హయాంలో ఏర్పడిన వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జడ్పీ హైస్కూల్‌ను మారిన విద్యా సంస్కరణలలో అప్‌గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల విద్యాశాఖ నుంచి వెలువడిన 205 హైస్కూల్ అప్‌గ్రేడ్‌లో వీరవాసరం ఎంఆర్‌కేకు స్థానం లభించింది. గత ఏడాది మండలంలోని రాయకుదురు జడ్పీహైస్కూల్‌ను బాలికల జూనియర్ కళాశాల అప్‌గ్రేడ్ అయింది. ప్రస్తుతం కో–ఎడ్యుకేషన్‌గా వీరవాసరం ఎంఆర్‌కే మారింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ హైస్కూల్ ప్లస్–2 (ఇంటర్మీడియట్) ప్రారంభం కానుండడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా 1961–62 నుంచి 1969–70 వరకు ఈ హైస్కూల్‌లో హెచ్‌ఎస్‌ఎల్‌సీ సెవెన్త్ ఫారం నిర్వహణ ఉంది. మారిన విద్యా సంస్కరణలో తిరిగి 1970 నుంచి 10వ తరగతి వరకు మారింది. 1969లో పంచాయతీరాజ్ చట్టం రావడంతో హైస్కూల్ నుంచి ప్లస్–2ను వేరుచేయడంతో హైస్కూల్‌లో ఇంటర్ విద్య అందుబాటులో లేకుండా పోయింది. అప్పటినుంచి ఈ ప్రాంత విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్యకోసం పట్టణాలకు వెళ్లాల్సి వచ్చింది. ఈ విధానంలో విద్యార్థులకు దూరాభారం గుర్తించిన గ్రామపెద్దలు వీరవాసరం ఎడ్యుకేషనల్ కమిటీ (వీఈసీ)గా ఏర్పడి జూనియర్ కళాశాలను ఏర్పాటు చేశారు.
మారిన వీఈసీ పరిస్థితి
1975లో ఏర్పడిన వీఈసీ జూనియర్ కళాశాల ప్రస్తుత పరిస్థితులలో స్థిరత్వాన్ని కోల్పోయింది. ఎయిడెడ్ కళాశాలగా ఉన్న వీఈసీని యాజమాన్యం ప్రభుత్వపరం చేసేందుకు ఆమోదం తెలిపింది. దాదాపుగా ప్రభుత్వపరం అయ్యే సమయంలో యాజమాన్యం పేరు మార్పుపై మెలిక పెట్టింది. ప్రభుత్వం ఈ మెలికపై సరైన నిర్ణయాన్ని వెల్లడించకపోవడం, విద్యాశాఖ అధికారుల అలసత్వాన్ని ప్రజలు తప్పుపట్టే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ కారణంతో వీఈసీ మనుగడ ప్రశ్నార్థకం అయింది. ఈ పరిస్థితులలోనే ఎంఆర్‌కేలో ప్లస్‌ల నిర్ణయంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎంఆర్‌కే జడ్పీ హైస్కూల్లో..
సుమారు 750 విద్యార్థులు, ఆరు ఎకరాల స్థలం, 26 గదులు కలిగిన భవనాలు ఉన్నాయి. అన్ని సదుపాయాలు ఉండడంతో ప్లస్ టూకు ఎంపికైంది. ఇంటర్మీడియట్ విద్యపై విద్యార్థుల్లోనూ ఆశలు పెరిగాయి. 53 ఏళ్ల అనంతరం హైస్కూల్‌లో ఇంటర్మీడియెట్ విద్య అంటూ ప్రచారం మొదలైంది.
Updated Date - 2023-08-27T23:56:03+05:30 IST