కలగా కోపల్లె వంతెన..!
ABN, First Publish Date - 2023-02-26T23:14:25+05:30
ఎప్పుడో బ్రిటీష్ కాలంలో నిర్మించిన కోపల్లె వంతెనపై రాకపోకలు సాగించే సమయాల్లో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఎన్నికల హామీగా మిగిలిన వైనం
నిధులు మంజూరైనా ముందుకురాని కాంట్రాక్టర్లు
ప్రభుత్వాలు మారిన నిర్మాణం ఊసేలేదు
భయాందోళనలో వాహనదారులు
బిక్కుబిక్కుమంటూనే రాకపోకలు
ఎప్పుడో బ్రిటీష్ కాలంలో నిర్మించిన కోపల్లె వంతెనపై రాకపోకలు సాగించే సమయాల్లో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వంతెన శిథిలావస్థకు చేరడం, రక్షణ గోడలు సరిగ్గా లేకపోవడం, ఇరుగ్గా ఉండడంతో వాహనదారులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ప్రాణాలు నీటిలో కలిసిపోవాల్సిందేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోనే ప్రధానంగా భీమవరం – గుడివాడ రాష్ట్రీయ రహదారిపై కోపల్లె వద్ద బొండాడ డ్రెయిన్‌పై ఉన్న వంతెన శిథిలావస్థకు చేరింది. మండలంలోని అన్ని గ్రామాల నుంచి భీమవరం వెళ్లడానికి ఈ వంతెనే ప్రధాన ఆధారం. వంతెన రక్షణ గోడలు ధ్వంసమై ప్రమాదభరితంగా మారింది. భీమవరం నుంచి విజయవాడ ఇతర పట్టణాలకు వెళ్లాలంటే ఈ రోడ్డు దగ్గర మార్గం. రైల్వే గేట్లు తక్కువగా ఉండడంతో ఈ రోడ్డు నుంచి ఎక్కువగా వాహన రాకపోకలు సాగుతున్నాయి.
కాళ్ళ, ఫిబ్రవరి 26 :
కోపల్లె – జక్కరం వంతెన నిర్మిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చడంలో అధికార, ప్రతిపక్ష నాయకులు విఫలమయ్యారు. కాళ్ళ మండలం జక్కరం గ్రామానికి చెందిన పాతపాటి సర్రాజు, కలవపూడి గ్రామానికి చెందిన వేటూకూరి వెంకట శివరామరాజు, మంతెన రామరాజు ఉండి ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1995 నుంచి 2019 వరకూ ప్రతీసారీ సార్వత్రిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో వంతెన నిర్మాణం చేపడతామని పాలకులు హామీలు ఇచ్చారు. ‘నిధులు వచ్చాయి. పనులు జరుగుతాయి’.. అని నాయకులు చెప్పడమే తప్ప ఇప్పటికీ నిర్మాణానికి నోచుకోలేదు.
ముందుకు రాని కాంట్రాక్టర్లు..
జువ్వలపాలెం రాష్ట్రీయ రహదారిపై ప్రయాణించే వాహనదారులకు, ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ఎక్కు వగా ఆక్వా ఉత్పత్తులను నిత్యం తరలిస్తుంటారు. బొండాడ మురుగు కాల్వపై జక్కరం – కోపల్లె వంతెన నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు, ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ వంతెన నిర్మాణానికి రూ.12 కోట్లు నిధులు మంజూరయ్యాయి. టెండర్లు పిలిచారు. అయితే ఈ ప్రభుత్వంలో బిల్లులు అవ్వవ ని భయపడి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. తక్షణం వంతెన నిర్మాణ పనులు చేపట్టాలని ప్రజలు, వాహనదారులు కోరుతున్నారు.
Updated Date - 2023-02-26T23:14:27+05:30 IST