కళ్ల కలక..జర భద్రం
ABN, First Publish Date - 2023-07-29T00:24:18+05:30
సర్వేంద్రియానం నయనం ప్రధానం, కళ్లు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రధాన జ్ఞానేంద్రియం. కళ్లను ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత అద్భుతంగా ఈ ప్రపంచాన్ని ఆస్వాధించగలం.
వాతావరణంలో మార్పులతో వేగంగా వ్యాప్తి
అశ్రద్ధ వహించకూడదని వైద్యుల సూచన
సర్వేంద్రియానం నయనం ప్రధానం, కళ్లు మనకు ప్రపంచాన్ని పరిచయం చేసే ప్రధాన జ్ఞానేంద్రియం. కళ్లను ఎంత జాగ్రత్తగా చూసుకుంటే అంత అద్భుతంగా ఈ ప్రపంచాన్ని ఆస్వాధించగలం. అందుకే మన కళ్లను అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలి. కొన్ని రోజుల నుంచి చాలామంది పిల్లలు, కొంతమంది పెద్దవాళ్లల్లో కళ్లకలక సమస్య ప్రారంభమై చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈనేపథ్యంలో కళ్ల కలక సమస్య వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అవగాహన చేసుకునేందుకు ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం
– నిడమర్రు, జూలై 28
కళ్ల కలకను ఇంగ్లీషులో కంజక్టివిటిస్ అంటారు. కనుగుడ్డు చుట్టూ ఉండే తెల్లని పొర, కంటి రెప్పల వెనకుండే పొరను కంజెటైనా అంటారు. కళ్లల్లో దుమ్ము, దూళి, వేడి, చలి, వాతావరణంలో తేమ మన కంటిపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఈ వాతావరణ ప్రభావం వల్ల కంటిలో వైరస్, బ్యాక్టీరియాల వల్ల ఇన్‌ఫెక్షన్‌కు దారి తీయవచ్చు. ఈ ఇన్‌ఫెక్షన్ సోకితే దానినే కళ్ల కలక అంటారు. దీనినే పింక్ ఐ అంటారు.
కారణాలు.. లక్షణాలు ఇలా..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పది రోజుల నుంచి తీవ్రమైన గాలులతో కూడిన నిరంతరం వర్షాలు వల్ల వాతావరణంలో తీవ్రమైన మార్పులు సంభవించాయి. ఈ మార్పుల వల్ల గాలిలో బ్యాక్టీరియా, వైరస్ క్రిములు విపరీపంగా పెరిగి అతి సున్నితమైన కళ్లపై ప్రభావం చూపుతాయి. ఈ వైరస్, బ్యాక్టీరియా ప్రభావం వల్ల కళ్ల కలకల సమస్య మొదలవుతుంది. ముఖ్యంగా 5 నుంచి 15 ఏళ్ల లోపు చిన్నారులకు ఈ వ్యాధి త్వరగా వ్యాపిస్తుంది. కళ్ల కలక వల్ల కన్నుఎర్రగా మారడం, కంటి నుంచి నీరు కారడం, కంటి రెప్పలవాపు, నిద్రలేచినప్పుడు కళ్ల రెప్పలు అంటుకుపోవడం, కంటి నొప్పి దురద, మంట వంటి లక్షణాలు ఎక్కువగా కనబడతాయి. బ్యాక్టీరియా వల్ల సంభవిస్తే వారం రోజుల పాటు, వైరస్ వల్ల సంభవిస్తే మూడు వారాల పాటు ప్రభావం ఉంటుంది. పసికందులకు, రోజులు, నెలల పిల్లలకు ఇది ప్రమాదకం.
సొంత వైద్యం చేయొద్దు..
అర్హత గల నేత్రవైద్యుడును వెంటనే సంప్రదించడం వల్ల వ్యాధి తీవ్రతను తగ్గించవచ్చు. నేత్ర వైద్యుల పర్యవేక్షణలో యాంటిబయోటిక్ ఐ డ్రాప్స్, లూబ్రి కెంట్ ఐ డ్రాప్స్ మందులు వాడుకోవాలి. సొంత వైద్యం జోలికి పోవడం ద్వారా కళ్ల మీద రోగ ప్రభావం తీవ్రమై కంటి చూపు మందగిస్తుంది.
ముందస్తు నివారణ చర్యలు
మన పరిసరాలలో అనగా ఇళ్లల్లో, ఆఫీసులలో, స్కూల్స్, కాలేజీలలో ఎవరైనా కళ్లకలతో బాధపడుతుంటే వారికి దూరంగా ఉండడం, వారు వాడిన వస్తువులు ముఖ్యంగా టవల్స్, దుప్పట్లు, సబ్బులు తాకడం, వాడడం చేయరాదు, తరచుగా సబ్బుతో, హ్యేండ్ వాష్‌తో చేతులు శుభ్రం చేసుకో వడం ద్వారా వ్యాఽధి వ్యాప్తిని అరికట్టవచ్చు. వీరు కళ్లద్దాలు వాడడం ద్వారా ఇతరులకు వ్యాధి వ్యాపించకుండా అరికట్టవచ్చు. ఇది సాధారణ వ్యాధి అయి నప్పటికీ ప్రారంభంలోనే గుర్తించి వైద్యం చేయించుకోవడం ద్వారా ప్రభావం తగ్గించుకుని త్వరగా నివారించుకోవచ్చని నేత్ర వైద్యులు చెబుతున్నారు.
అశ్రద్ధ చేస్తే రెటీనాపై ప్రభావం
సాధారణంగా కళ్ల కలక వాతావరణంలో మార్పులు సంభవించినప్పుడు వైరస్, బ్యాక్టీరియా వల్ల సంభవిస్తాయి. ఈ వ్యాధి చిన్నపిల్లల్లో త్వరగా వ్యాపించే అవకాశం ఎక్కువ, కళ్లు ఎర్రబడడం, నీరు కారడం, పుసికట్టడం వంటి లక్షణాలు కనిపించిన వెంటనే నేత్రవైద్యుడిని సంప్రదించి యాంటి బయోటిక్ మందులను డ్రాప్స్ రూపంలో వాడాలి. వైద్యం అశ్రద్ధ చేయడం వల్ల కంటి రెటినాపై చెడు ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది.
– కె.హరనాఽథ్‌రెడ్డి
ఆప్ర్తామెట్రీ, మీనాక్షి కంటి ఆసుపత్రి గణపవరం
Updated Date - 2023-07-29T00:24:18+05:30 IST