పేరు నాది.. ఇల్లు నీది!
ABN, First Publish Date - 2023-08-20T23:42:38+05:30
పేరు నాదుంటాది ఇల్లు నువ్వు కట్టుకో.. సరుకు (ప్రభుత్వం నుంచి వచ్చే ఇసుక, ఐరెన్, సిమెంట్) నీ కొస్తాది.. సొమ్ములు నాఖాతాలోకి.. ఇదీ జగనన్న కాలనీలో లబ్ధిదారుడికి రియల్టర్‌లకు మధ్య కుదిరిన ఒప్పందం. ప్రస్తుతం రియల్టర్లు ఆ స్థలాలను ఇప్పటికే హైజాక్ చేసి బయట వ్యక్తులకు విక్రయించడం ప్రారంభించారు.
జగనన్న కాలనీల్లో రియల్ వ్యాపారం
రియల్టర్ల దందా.. రోడ్డు పక్క స్థలాలకు గిరాకి.. గజం రూ.15 వేలు
తాడేపల్లిగూడెం రూరల్, ఆగస్టు 20 : పేరు నాదుంటాది ఇల్లు నువ్వు కట్టుకో.. సరుకు (ప్రభుత్వం నుంచి వచ్చే ఇసుక, ఐరెన్, సిమెంట్) నీ కొస్తాది.. సొమ్ములు నాఖాతాలోకి.. ఇదీ జగనన్న కాలనీలో లబ్ధిదారుడికి రియల్టర్‌లకు మధ్య కుదిరిన ఒప్పందం. ప్రస్తుతం రియల్టర్లు ఆ స్థలాలను ఇప్పటికే హైజాక్ చేసి బయట వ్యక్తులకు విక్రయించడం ప్రారంభించారు. దీంతో జగనన్న కాలనీల్లో గజం స్థలం రూ.15 వేల వరకూ అమ్ముడవుతోంది. దీనికితోడు రోడ్డుపక్కన ఉన్న స్థలాలకు ప్రభుత్వ ఖాళీ స్థలాలు జతకట్టి మరీ విక్రయిస్తూ రియల్టర్ సొమ్ము చేసుకుంటు న్నారు. ముఖ్యంగా తాడేపల్లిగూడెం పట్టణంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల వద్ద రియల్టర్లు పాగా వేసి పేదవారికి చెందాల్సిన సొంత గూడును తన్నుకుపోతు న్నారు. ఈ ప్రభావం ఎంత ఉందంటే లబ్ధిదారులు ఒక వంతు సొంతంగా ఇల్లు నిర్మించుకుంటుంటే రియల్టర్ల చేతిలోకి వెళ్లిన స్థలాలు మూడొంతులు ఉన్నాయంటే ఆశ్చర్యపోనవసరం లేదు. జగనన్న కాలనీల్లో స్థలాలు పొందిన వారు నిరుపేదలు. వారు ఇల్లు కట్టుకునే స్తోమత లేకపోవడంతో ఆ స్థలాలను చూసే ధైర్యం కూడా చేయని పరిస్థితి. దీంతో ఏ స్థలం ఎవరిదో కనుక్కుని ఆ స్థలాలను లాక్కునే ప్రక్రియలో సచివాలయ సిబ్బంది రియల్టర్లకు సహకారం అందిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. లబ్ధిదారుడి వివరాలు తీసుకుని ఆ స్థలాల్లో మీరు ఉండలేరంటూ వారిని మభ్యపెట్టి స్థలాలను అయినకాడికి రాయించుకుంటూ రియల్టర్లు వారి వ్యాపారాలను జగనన్న కాలనీల్లో పెంచుకుంటూ పోతున్నారు.
రోడ్డు పక్క స్థలాలున్నాయా అంతే..
జగనన్న కాలనీల్లో స్థలాలు రోడ్డు పక్కన ఉంటే లబ్ధిదారులకు కొంత మొత్తం ఇచ్చి వాటిని వశం చేసుకుంటున్నారు. ఆ తర్వాత ఆ స్థలాలకు ఒక ధర నిర్ణయిం చి, ఆ ధరకు మరో వ్యక్తికి విక్రయిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఇద్దరు, ముగ్గురు మధ్య పోటీ పెట్టి వారు కొన్న దానికంటే ఆ స్థలం ధర మూడింతలు హెచ్చుకు విక్రయిస్తున్నారు. దీంతో ప్రభుత్వం పేదలకు ఇచ్చిన స్థలాలు రియల్టర్లకు సిరులు కురిపిస్తున్నాయి. జగనన్న కాలనీ లే అవుట్‌లు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో కొంత భాగం ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు ఏర్పాటు చేసేందుకు కొన్ని స్థలాలను రిజర్వ్ చేశారు. అయితే ఆ పక్కన స్థలాలు పొందిన లబ్ధిదారుల దగ్గర రియల్టర్ల స్థలాలు కొనుగోలు చేసి మూడో వ్యక్తులకు ప్రభుత్వ స్థలాలను ఎరగా చూపిస్తూ జేబులు నింపుకుంటున్నారు.
Updated Date - 2023-08-20T23:42:38+05:30 IST