జీపీఎస్.. నో పెన్షన్ గ్యారంటీ!
ABN, First Publish Date - 2023-09-22T00:18:22+05:30
రాష్ట్రప్రభుత్వం ఏకపక్షంగా జీపీఎస్ విధానాన్ని ఉద్యోగుల నెత్తిన రుద్దుతూ గ్యారెంటెడ్ పెన్షన్ స్కీం (జీపీఎస్) బిల్లును కేబినెట్‌లో ఆమోదించడాన్ని నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు పెద్దఎత్తున్న ఉద్యమించడానికి నిర్ణయించాయి.
ఉద్యోగుల ఆగ్రహ జ్వాలలు
అసెంబ్లీలో అడ్డుకోవాలని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఫోన్ మెసేజ్‌లు
నేడు ఏలూరు ఇండోర్ స్టేడియంలో నిరసన ప్రదర్శన, మానవహారం
మద్దతుగా ఫ్యాప్టో ఉమ్మడి కార్యాచరణ
ఏలూరు ఎడ్యుకేషన్, సెప్టెంబరు 21 : రాష్ట్రప్రభుత్వం ఏకపక్షంగా జీపీఎస్ విధానాన్ని ఉద్యోగుల నెత్తిన రుద్దుతూ గ్యారెంటెడ్ పెన్షన్ స్కీం (జీపీఎస్) బిల్లును కేబినెట్‌లో ఆమోదించడాన్ని నిరసిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు పెద్దఎత్తున్న ఉద్యమించడానికి నిర్ణయించాయి. ఉద్యోగ సంఘాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించినా ప్రభుత్వం లెక్క చేయకుండా ఒంటెద్దు పోకడగా జీపీఎస్‌ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టి, ఆమోదింపజేసుకోవడానికి జరుగుతున్న ప్రయత్నాలను ఉద్యోగ నేతలు, మరీ ముఖ్యంగా సీపీఎస్/జీపీఎస్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులు ప్రభుత్వ చర్యలపై అభ్యంతరం చెబుతు న్నారు. ప్రధాన ఉద్యోగ సంఘాల్లో కొన్ని జీపీఎస్‌పై గోడ మీది పిల్లి వాటంలా వ్యవహరిస్తున్న నేపథ్యంలో కాంట్రాక్టు/గ్యారెంటెడ్ పెన్షన్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులంతా ఏకమై ఉద్యమించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో జీపీఎస్ బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టినప్పుడు అది ఆమోదం పొందకుండా ఉండేందుకు నిరసనలు తెలపాలని, అడ్డుకోవాలని అభ్యర్థిస్తూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరికీ మొబైల్ ఫోన్లద్వారా మెసేజ్‌లను పంపినట్టు ఏపీసీపీఎస్‌ఈఏ ఉమ్మడి జిల్లా నాయకులు వెల్లడించారు. తదుపరి ఆందోళనలో భాగంగా ఏలూరులోని ఇండోర్ స్టేడియంలో శుక్రవారం సాయంత్రం 4:30 గంటలకు అన్నిప్రాంతాల ఉద్యోగులు, ఉపాధ్యాయులతో నిరసన ప్రదర్శన, మానవహారంగా ఏర్పడి ప్రభుత్వానికి జీపీఎస్‌పై తమ వ్యతిరేకత, అయిష్టతలను తెలపాలని నిర్ణయించారు. వీరి ఆందోళనకు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాశాఖ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. జీపీఎస్ పరిధిలోకి పలువురు సీనియర్ టీచర్లు రాకపోయినా మాన వతా దృక్ఫథంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంఘీ భావంగా ఆందోళనలో పాల్గొంటామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా టీచర్లు చేపట్టాల్సిన దశలవారీ ఆందోళనపై ఫ్యాప్టో జిల్లా నాయకులు, ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.ఎ.సాల్మన్‌రాజు, జిల్లాశాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.రెడ్డిదొర, ఎస్.కె.రంగావలి కార్యాచరణను విడుదల చేశారు. ఆ ప్రకారం శుక్రవారం నుంచి అన్నిపాఠశాలల టీచర్లు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు, 23న పాత తాలూకా కేంద్రాల్లో సాయంత్రం నిరసన ప్రదర్శనలు, 25న చలో కలెక్టరేట్ ఆందోళనలను చేపట్టాలని పిలుపునిచ్చారు.
పెన్షన్ గ్యారెంటీ ఓ మోసం
సీపీఎస్ ఉద్యోగులు తమ సర్వీసుకాలంలో దాచుకున్న సీపీఎస్ సొమ్ముతో పెన్షన్ ఇవ్వడం, దానికి రాష్ట్రప్రభుత్వం గ్యారెంటీ ఇస్తామని చెప్పడం మోసపూరితం, హాస్యాస్పదం. ఇలాంటి మోసపూరిత విధానం దేశంలో ఎక్కడాలేదు. ఇప్పుడు రాష్ట్రంలో వున్న 3.50 లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాల భవిష్యత్తు ప్రజాప్రతినిధుల చేతుల్లోనే ఉంది. ఉద్యోగులందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించిన జీపీఎస్ బిల్లుని రాష్ట్ర ప్రజలు, ఉద్యోగుల ప్రతినిధులుగా తీవ్రంగా వ్యతిరేకించాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై ఉంది.
– వీరవల్లి వెంకటేశ్వరరావు, ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు, ఏపీ సీపీఎస్ ఉద్యోగుల సంఘం
ప్రభుత్వాన్ని నమ్మలేం
సీపీఎస్ విధానాన్ని రద్దు చేయ కుండా, ప్రభుత్వం ఇచ్చే కాంట్రిబ్యూష న్‌ను ఎప్పుడూ సరిగా జమ చేయ కుండా, కేంద్రప్రభుత్వం రాష్ట్రవాటాను 14 శాతానికి పెంచినా అమలు చేయకుండా ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన జీపీఎస్‌ను అమలు చేస్తుందని ఈ ప్రభుత్వాన్ని ఎలా నమ్మగలం? లోపభూయిష్టంగా వున్న జీపీఎస్‌ను ఉపసంహరించుకుని పాదయాత్ర సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ మేరకు పాతపెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి.
– రెడ్డి రామారావు, ఏపీసీపీఎస్‌ఈఏ
ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి
మా డబ్బుతోనే మాకు పెన్షన్..?
జీపీఎస్‌లో మాత్రమే పెన్షన్ గ్యారెంటీ ఉంది కానీ దీనిని పెన్షన్ ఇవ్వడంలో గ్యారెంటీ లేదని భావించ వచ్చు. ప్రతిపక్షనేతగా వున్న సమయం లో సీఎం తన పాదయాత్రలో సీపీ ఎస్‌ను రద్దు చేస్తానమని చెప్పి, ఇప్పుడు కేబినెట్‌లో జీపీఎస్‌ను ఆమోదించడం మోసం చేయడమే. ఏడు నెలలుగా జీతాల నుంచి మినహా యించిన ఉద్యోగుల వాటా సీపీఎస్ డబ్బును, ప్రభుత్వ వాటా సొమ్మును పెన్షన్ ఖాతాకు జమ చేయ లేదు. ఇప్పుడు జీపీఎస్‌లో వీటికోసం అర్రులు చాచాల్సిన దుస్థితి. అసలు ప్రభుత్వ వాటాను జమ చేస్తారో, లేదో చెప్పలేం, గ్యారెంటీ లేదు. ఈ జాప్యానికి కేంద్రప్రభుత్వం మాదిరిగా వడ్డీ ఇవ్వడం లేదు.
– బి.ఉషాదీప్తి
Updated Date - 2023-09-22T00:18:22+05:30 IST