పశ్చిమలోకి గణపవరం
ABN, First Publish Date - 2023-02-09T00:45:16+05:30
ఇప్పటి వరకు ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం
మంత్రిమండలి ఆమోదముద్ర
ఇప్పటి వరకు ఏలూరు జిల్లాలో కొనసాగుతున్న గణపవరం మండలాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేస్తూ రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ఆమోదముద్ర వేసింది. బుధవారం తాడేపల్లిలో సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పశ్చిమ గోదావరి జిల్లా మండలాలు 19 నుంచి 20కు పెరగగా, ఏలూరు జిల్లా 28 నుంచి 27 మండలాలకు తగ్గుతుంది.
(భీమవరం/ఏలూరు సిటీ/గణపవరం –ఆంధ్రజ్యోతి):15 అసెంబ్లీ నియోజక వర్గాలు, 48 మండలాలతో వున్న పశ్చిమ గోదావరి జిల్లా పునర్వ్యవస్థీకరణలో భాగంగా గత ఏడాది రెండుగా విభజించారు. కృష్ణా జిల్లాలోని కైకలూరు, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి ఏలూరు, దెందులూరు, చింతలపూడి, ఉంగుటూరు, పోలవరం నియోజకవర్గాలతో కలిపి ఏలూరు జిల్లాగా విభజించారు. ఇందులో గోపాలపురం నియోజకవర్గంలోని ద్వారకా తిరుమలను ఈ జిల్లాలోనే ఉంచారు. ఇక గోపాలపురం నియోజకవర్గంలోని మూడు మండలాలు, నిడదవోలు, కొవ్వూరు నియోజకవర్గాలను, తూర్పులోని మరో నాలుగు నియోజకవర్గాలతో కలిపి తూర్పు గోదావరి జిల్లా చేశారు. భీమవరం, ఉండి, నరసాపురం, పాలకొల్లు, ఆచంట, తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలతో పశ్చిమ గోదావరి జిల్లా ఏర్పాటు చేశారు.
గణపవరం డిమాండ్
ఈ సమయంలోనే ఉంగుటూరు నియోజకవర్గంలోని గణపవరం మండలాన్ని ఏలూరు కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో కలపాలని పెద్ద ఎత్తున డిమాండ్‌లు వచ్చాయి. జిల్లా కేంద్రం భీమవరం కావడంతో ఇది ఈ మండల కేంద్రానికి దగ్గరగా ఉంటుంది. ప్రస్తుత జిల్లా కేంద్రం ఏలూరుతో పోలిస్తే గణపవరం మండలం భీమవరానికి దగ్గరగా ఉంటుంది. ఏలూరుతో పోలిస్తే భీమవరానికి మండల కేంద్రం గణపవరం 20 కి.మీ. లోపు కొన్ని గ్రామాలు 15 కిలోమీటర్లు లోపు దగ్గరగా ఉన్నాయి. మండలంలోని దాదాపు అన్ని గ్రామాలు అటు భీమవరం, ఇటు తాడేపల్లిగూడెం పట్టణాలకు సమీపంలో ఉంటున్నాయి. రవాణా సౌకర్యం ఉంది. వైద్య సదుపాయాలు, వ్యాపార లావాదేవీలు, మార్కెటింగ్ అంతా ఈ రెండు పట్టణాల్లోనే నిర్వహిస్తుంటారు. అయితే లోక్‌సభ నియోజకవర్గ పరిధిని ప్రాతిపదికగా తీసుకుని జిల్లాను ఏర్పాటు చేయడం వల్ల గణపవరం ఏలూరు జిల్లాకు వెళ్లాల్సి వచ్చింది. జిల్లాల పునర్వవ్యస్థీకరణే అశాస్ర్తీయంగా జరిగిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. అందుకు తగ్గట్టుగానే గణపవరం మండల ప్రజలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. ప్రజా ప్రతినిధులపైనా ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ గణపవరంలో నిర్వహించిన బహిరంగ సభలో ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు గణపవరం మండల విలీనాన్ని ప్రతిపాదించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేయాలని కోరగా సీఎం ఈ మండలాన్ని పశ్చిమలో కలుపుతున్నట్టు స్పష్టం చేశారు. ఆ తర్వాత ప్రజాభిప్రాయ సేకరణకు నోటిఫికేషన్ జారీ చేశారు. అప్పుడే అధికార పార్టీలో భేదాభిప్రాయాలు గుప్పుమన్నాయి. లోపాయికారిగా ఓ వర్గం ఏలూరులోనే గణపవరం ఉండాలంటూ సంతకాలు సేకరించింది. మరోవర్గం పశ్చిమలో ఉండాలంటూ పట్టుబట్టింది. మొత్తానికి మంత్రిమండలి ఆమోదంతో పశ్చిమలో గణపవరం విలీన ప్రక్రియకు మరో అడుగుపడింది.
కొత్త డివిజన్ : తాడేపల్లిగూడెం
పశ్చిమ గోదావరిలో వీలనమయ్యే గణపవరం మండలాన్ని భీమవరం రెవెన్యూ డివిజన్‌లో పెట్టారు. ప్రస్తుతం పశ్చిమలో రెండు రెవెన్యూ డివిజన్‌లు ఉన్నాయి. నరసాపురం, భీమవరం డివిజన్‌ల పరిధిలో 19 మండలాలు ఉన్నాయి. గణపవరం విలీనమైతే జిల్లాలో 20 మండలాలు కానున్నాయి. తాడేపల్లి గూడెం కేంద్రంగా మరో రెవెన్యూ డివిజన్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోద ముద్ర వేసింది. గతంలోనే దీనిపై తాడేపల్లిగూడెం నుంచి ప్రతిపాదనలు వెళ్లాయి. ఏకకాలంలోనే గణపవరం విలీనం, తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్‌కు మంత్రి మండలి ఆమోదముద్ర వేయడంతో మూడో డివిజన్‌లో ఏయే మండలాలు ఉంటాయనేది ఆసక్తిగా మారింది. తణుకు, పెంటపాడు. ఇరగవరం, తాడేపల్లిగూడెం రూరల్, అత్తిలి, మండలాలతో తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్ ఏర్పాటయ్యే అవకాశం ఉంది.
పాలనాపరంగా ఇబ్బందులు !
ఇప్పటికే గోపాలపురం నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో విలీనమైనా ద్వారకా తిరుమల మండలం ఏలూరు జిల్లాలో అంతర్భాగమైంది. దీంతో నియోజకవర్గ పరంగా కొన్ని సమస్యలు కనిపిస్తున్నాయి. ఉంగుటూరు నియోజక వర్గం ఇప్పటి వరకు ఏలూరు లో ఉండగా ఇందులోని గణపవరం మండలం పశ్చిమ గోదావరిలో విలీనమైంది. ఇక్కడ కూడా పాలనా పరంగా కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి.
Updated Date - 2023-02-09T00:45:18+05:30 IST