పనిచేయలేకే రాజీనామా..
ABN, First Publish Date - 2023-02-15T00:33:56+05:30
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతు న్నట్లు ప్రకటించారు జయమంగళ.
వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇవ్వరనే వెళ్లిపోతున్నా
కైకలూరు మాజీ ఎమ్మెల్యే జయమంగళ
ఇరవై ఏళ్లకు పైగా తెలుగుదేశంలో పనిచేసిన మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకట రమణకు నియోజకవర్గంలో పట్టులేదు. నాయకశ్రేణి పనితీరుపై అవగాహన లేదు. ద్వితీయ, తృతీయ శ్రేణుల్లో మద్దతు కానరాలేదు. ఓ వైపు అనారోగ్య సమస్యలు, మరోవైపు నేతల్లో వ్యతిరేకత.. వెరసి ఆయనను టీడీపీ నుంచి నిష్క్రమించేలా చేశాయి. ఐదేళ్లు జడ్పీటీసీగా, ఒకసారి ఎమ్మెల్యేగా, ఏళ్ల తరబడి ప్రతిపక్ష నేతగా పనిచేశాక వచ్చే ఎన్నికల్లో తనకు సీటు రాదని తనతోపాటు పనిచేస్తోన్న వాళ్లే చెబుతున్నారన్న వ్యాఖ్యలతో మనస్తాపానికి లోనై పార్టీ సభ్యత్వంతోపాటు, ఇన్‌చార్జి పదవికి రాజీనామా చేస్తున్నట్లు మంగళవారం కైకలూరులో ప్రకటించారు !
(ఏలూరు–ఆంధ్రజ్యోతి):
సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరబోతు న్నట్లు ప్రకటించారు జయమంగళ. ఈ సందర్భం గా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయనతోపాటు టీడీపీ నుంచి ఒక్క కార్యకర్త కనిపించలేదు. మొద టి నుంచి జగన్‌తో జరిగిన చర్చల్లో ఆయనతోపా టు పాల్గొన్న సైపరాజు గుర్రాజు అనే వ్యక్తి మాత్ర మే వెంట వెళుతున్నారు. ఈ క్రమంలో పార్టీ నాయకుల్లో ఆయనపై సానుకూల దృక్పథం లేదని మరోసారి ఈ సమావేశం ద్వారా స్పష్టమైంది. ఈ క్రమంలో 2019 ఎన్నికల్లో పార్టీ ఓడిపోతుందని తెలిసీ, తనకు అధిష్టానం సీటు ఇచ్చిందని ఆయన వివరించారు. ఓడిపోతుందని పార్టీకి తెలిసినపుడు ఆయన ఎందుకు తెలుసుకోలేకపోయారు? తెలిసి నా ఎందుకు పోటీ చేశారన్న అంశంపై ఆయన నోరు విప్పలేదు. గడిచిన ఎన్నికల్లో తన వెనుక తిరుగుతూనే కొందరు నాయకులు బహిరంగంగా వైసీపీకి మద్దతుగా పనిచేశారని ఆరోపించారు. అదీ తన ఓటమికి ఓ కారణమేనని తెలిపారు. 2014 ఎన్నికల తర్వాతనైనా తన వర్గానికి పనులు చేయించుకోవడానికి వీలు లేకుండా ఫోర్ మెన్ కమిటీ వేసి తనను పనిచేయకుండా అడ్డుకున్నా రని చెప్పారు. ఈ క్రమంలో 2024లో తనకు గెలిచే అవకాశాలున్నా పొత్తుల పేరిట మరో నేతను తీసుకొస్తున్నట్లు తెలుస్తోందని, ఇక తాను పనిచేసి నా ఉపయోగం లేదని అనుకుని చివరకు వైసీపీ లో చేరుతున్నానని తన ఫిరాయింపు వెనుక అసలు విషయాన్ని జయమంగళ మంగళవారం బయటపెట్టారు.
ఎమ్మెల్యే అసహనం
2019 ఎన్నికల్లో తనపై పోటీ చేసి 9 వేల 470 ఓట్ల తేడాతో ఓటమి పాలైన నేతను తనకు తెలియకుండానే పార్టీలోకి ఆహ్వానించడంపై ఎమ్మె ల్యే దూలం నాగేశ్వరరావు గుర్రుగా ఉన్నారు. పశ్చి మ గోదావరికి చెందిన మంత్రి కారుమూరి నాగేశ్వ రరావు ఆధ్వర్యంలో జయమంగళ సీఎంను కలిసేం దుకు మార్గం సుగమమైంది. ఇప్పటికి 3–4 సార్లు సీఎంను కలిపించడంలో జిల్లా నాయకుల కృషి ఉంది. చివరి నిమిషం వరకు ఈ చేరిక విషయా న్ని ఎమ్మెల్యేకు తెలియకుండానే వైసీపీ నేతలు రాజకీయం నడిపించారు. చివరి నిమిషంలో ఎమ్మె ల్యేకు జయమంగళ చేరిక గురించి తెలిసినా ఏమీ చేయలేక మిన్నకుండిపోయారని సమాచారం. కాగా త్వరలో జగన్ సమక్షంలో జయమంగళ చేరిక సమయంలో మాత్రం ప్రోటోకాల్ ప్రకారంగా స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే కూడా పాల్గొంటారని తెలుస్తోంది. చివరకు బలవంతంగా తన ప్రత్యర్థిని ఎమ్మెల్యే అంగీకరించి, ఆహ్వానిస్తున్నారని ఆ పార్టీ వర్గాల సమాచారం.
త్రీ లేదా ఫోర్ మెన్ కమిటీ
ఖాళీ అయిన కైకలూరు పార్టీ ఇన్‌చార్జి పదవికి ఇప్పటికే పలువురు నేతల నుంచి పోటీ నెలకొంది. కొందరు నాయకులు ఇప్పటికే అధిష్టానం ముందు తమ మనసులో మాటను ముందుంచారు. ఎన్నికలకు ఎక్కువ సమయం లేని వేళ స్థానికంగా వివాదాలు తీసుకురావడంకంటే కార్యకర్తలు, నాయకుల్ని బలోపేతం చేయడమే మంచిదని ఆ పార్టీ అధిష్టానం భావిస్తోంది. ఈ క్రమంలో కైకలూరు నియోజకవర్గంలో త్రీ లేదా ఫోర్ మెన్ కమిటీ ఏర్పాటుకు మొగ్గు చూపుతోంది. అదే జరిగితే స్థానికంగా పలువురు నాయకులు ఇప్పటికే తమ తమ ప్రతిపాదనలతో సిద్ధంగా ఉన్నారు. వారిలో కొందరు ఇప్పటికే స్వయం ప్రకటనలు కూడా చేసుకుంటున్నారు. అయితే వారిలో ఎవరికి 2024లో సీటు అందిస్తారనే అంశంపై మాత్రం అధిష్టానం స్పష్టత ఇవ్వబోమని ముందుగా చెప్పాకే తుది నిర్ణయం తీసుకునే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. అందుకు సిద్ధపడి పలువురు నాయకులు అక్కడ పనిచేయడానికి ఉత్సుకతతో ఉన్నారు. కాగా రాబోయే ఎన్నికల్లో ఏదేని బీసీ సామాజివర్గం నుంచి బలమైన నాయకులు వస్తే బాగుంటుందని స్థానికంగా అధిష్టానానికి ప్రతిపాదనలు వెళ్లినట్లుగా సమాచారం. అయితే తుది నిర్ణయం గురించి అధిష్టానం ప్రస్తుతం ఎలాంటి చర్చలు జరపడంలేదు. కాగా స్థానికంగా పలువురు నాయకుల వివరాలు, పనితీరు తదితర అంశాలపై ఒక నివేదికను సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం.
Updated Date - 2023-02-15T00:33:58+05:30 IST