గోతిలో పడి.. గాల్లోకి లేచి
ABN, First Publish Date - 2023-01-18T00:16:39+05:30
రహదారుల మరమ్మతులను ఏలినవారు ఏనాడో వదిలేశారు. దీంతో అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు ప్రజల పాణాలతో చెలగాటా లాడుతున్నాయి. తాజాగా మంగళవారం రహదారిపై గోతిలో పడిన కారు అంతెత్తులేచి పక్కనే పొలాలకు, రహదారికి మధ్యనున్న కాల్వ(కందకం)లో పడిపోయింది.
రహదారుల మరమ్మతులను ఏలినవారు ఏనాడో వదిలేశారు. దీంతో అస్తవ్యస్తంగా ఉన్న రహదారులు ప్రజల పాణాలతో చెలగాటా లాడుతున్నాయి. తాజాగా మంగళవారం రహదారిపై గోతిలో పడిన కారు అంతెత్తులేచి పక్కనే పొలాలకు, రహదారికి మధ్యనున్న కాల్వ(కందకం)లో పడిపోయింది. కారులో ఐదుగురు ప్రయాణిస్తున్నారు. అదృష్టవశాత్తు స్థానికులు వారిని కారు డోరు పగులగొట్టి కాపాడడంతో క్షేమంగా బయటపడ్డారు. మరి సర్కారు వారు ఎప్పటికి కళ్లు తెరుస్తారో ఏమో?
చాట్రాయి, జనవరి 17: చాట్రాయి– పోలవరం గ్రామాల మధ్య వేగంగా వస్తున్న కారు రహదారిపై గోతిలో పడి అదుపు తప్పి కందకంలో పడిపోయింది. కారులో ఉన్న చిన్నారితో పాటు ఐదుగురు క్షేమంగా బయట పడ్డారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న ఆది కేశవరెడ్డి, తన భార్య జయశ్రీ, తన పాపతో కలసి సంక్రాంతి పండుగకు మండలంలోని బూరుగ్గూడెం గ్రామంలోని మామ ముక్కాల బాల్‌రెడ్డి ఇంటికి వచ్చారు. మంగళవారం ఆదికేశవరెడ్డి తన కారులో భార్య, కుమార్తె, అత్తగారు, వదినతో కలసి బీరంపాలెం బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి వస్తుండగా కారు నడుపుతున్న ఆదికేశవరెడ్డికి రహదారిపై గొయ్యి కనిపించకపోవటంతో కారు గోతిలో పడి గాల్లోకి లేచి రోడ్ పక్కన కందకంలో పడిపోయింది. వెంటనే పొలాల్లో రైతులు, దారిన వెళ్ళే వారు కారు తలుపు పగలగొట్టి కారులో ఇరుక్కుపోయిన ఐదుగురిని బయటకు తీశారు. అందరూ క్షేమంగా బయటపడటంతో ఊపిరి పీల్చుకున్నారు. కారు బాగా దెబ్బతింది. ఈ రహదారిలో 50, 60 టన్నుల బరువైన భారీ వాహనాలు రాకపోకల సాగిస్తుండటంతో రోడ్డు కుంగి ఇక్కడ గొయ్యి ఏర్పడింది. ఈ గొయ్యి వద్ద ఇటీవల కాలంలో 5 ప్రమాదాలు జరిగాయని స్థానికులు చెప్పారు. భారీ వాహనాల కారణంగా ఈ రహదారిలో పోలవరం– మంకొల్లు మధ్య కూడా భారీ గోతులు పడ్డాయి. ఉన్నతాధికారులు స్పందించి గోతుల రహదారికి మరమ్మత్తులు జరిపించి ప్రమాదాలు నివారించాలని ప్రజలు కోరుతున్నారు.
Updated Date - 2023-01-18T00:16:41+05:30 IST