ఏటా భయమే..!
ABN, First Publish Date - 2023-06-11T00:38:20+05:30
వర్షాకాలంలో భారీ వ ర్షాలు పడిన అదే సమయంలో గోదావరి వరద నీటి ప్రవాహం పెరిగినా నక్కల డ్రెయిన్ పొంగి ఏటా ఖరీఫ్ సీజన్‌లో రైతులను నట్టేట ముంచుతూనే ఉంది.
ఆరు వేల ఎకరాల పంట నీళ్ల పాలు
తీవ్రంగా నష్టపోతున్న ఆయకట్టు రైతాంగం
మొరాయిస్తున్న ఔట్‌ఫాల్స్ గే ట్లు
ఆచంట, జూన్ 10 : వర్షాకాలంలో భారీ వ ర్షాలు పడిన అదే సమయంలో గోదావరి వరద నీటి ప్రవాహం పెరిగినా నక్కల డ్రెయిన్ పొంగి ఏటా ఖరీఫ్ సీజన్‌లో రైతులను నట్టేట ముంచుతూనే ఉంది. ఈ నక్కల డ్రెయిన్ తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రు వద్ద మొదలై సుమారు 40 కిలోమీటర్లు విస్తరించి పెనుగొండ, ఆచంట, పోడూరు , మండలాలు మీదుగా యలమంచిలి మండలం వడ్డిలంక వద్ద గోదావరిలో కలుస్తుంది. ఈ నక్కల డ్రెయిన్‌పై ఆధారపడి సుమారు 42 వేల ఎకరాల ఆయకట్టు వరి సాగు సాగవుతుంది. ప్రతీ ఏటా సార్వా సీజన్‌లో ఆగస్టు, సెప్టెంబరు నెలలో అధిక వర్షాలు పడటం, దానికి తోడు గోదావరి వరదకు డ్రెయిన్ పొంగి పొర్లుతుంది. దీని కారణంగా డ్రెయిన్‌లో మురుగునీరు ముందుకు కదిలే దారి లేక వరి చేలల్లో మురుగు నీరు బయటకు పారక పంట పొలాలు ముంపు బారినపడుతున్నాయి. డ్రెయిన్ శివారులోని నక్కల ఔట్‌ఫాల్ స్లూయిజ్‌కు ఉన్న కొన్ని తలుపులు వరదల సమయంలో మొరాయించడంతో వరద నీరు ఎగదన్నడంతో పంట పొలాలు ముంపు బారిన పడుతున్నాయి. డ్రెయిన్‌ను ఆనుకుని ఉన్న ఆయకట్టులో ఆచంట, ఆచంట వేమవరం , గుమ్ములూరు, వద్దిపర్రు, కాంబొట్లపాలెం, చింతలదిబ్బ, పట్టిపాలెం, వడ్డిలంక గ్రామాల పరిధిలో సుమారు ఆరు వేల ఎకరాలు ఏటా ముంపు బారిన పడి రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది.
కలగానే గబియన్ వాల్ నిర్మాణ పనులు
నక్కల డ్రెయిన్ ముంపు సమస్య పరిష్కారానికి అప్పట్లో టీడీపీ ప్రభుత్వం చొరవ చూపి సుమారు 17 కోట్ల అంచనాతో గబియన్ వాల్ నిర్మాణ పనులు 2019లో ప్రారంభించారు. సుమారు 25 కిలోమీటర్ల మేర నిర్మించేందుకు ప్రతిపాదనలు కూడా జరిగాయి. వాల్ నిర్మాణంతో బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో మురుగు కాలువ గట్లు పటిష్టమవుతామని ముంపు సమస్య తీరిపోతుందని రైతులు ఆశపడ్డారు. కాని సుమారు 9 శాతం మాత్రమే పూర్తయిన దశలో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో దీని నిర్మాణ పనులు నిలిచిపోయాయి. నాలుగేళ్లు అవుతున్నా దృష్టి సారించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
శాశ్వత పరిష్కారం చూపాలి
పదేళ్ల క్రితం ఆచంట, కోడూరు, యలమంచిలి మండలాల పరిధిలో నక్కల డ్రెయిన్‌కు 24 బాక్స్ ఇన్‌లెట్‌లు ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టి 22 పూర్తి చేశారు. యలమంచిలి మండల పరిధిలో మిగిలిన రెండిటిలో ఒకదాని పనులు అప్పట్లో ప్రారంభించి షట్టరు బిగించకుండా వదిలి వేశారు. మరో బాక్సు ఇన్‌లెట్ పనులు ప్రారంభించలేదు. 2021 సంవత్సరంలో వచ్చిన గోదావరి వరదల సమయంలో నక్కల ఔట్‌ఫాల్ స్లూయిజ్‌కున్న తలుపులలో ఒకటి ఊడిపోయింది. ఇరిగేషన్ అధికారులు దాని స్థానంలో మరో తలుపనులు డమ్మిగా ఏర్పాటు చేసిన వడ్డిలంక, చింతలదిబ్బ, గుంపర్రు, కాంబొట్లుపాలెం గ్రామాల పరిధిలో వరి పంట నీట మునిగింది. స్లూయిజ్ నిర్వహణ లేకపోవడమే దీనికి కారణమని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఊడిపోయిన తలుపును తిరిగి అమర్చేందుకు ఇరిగేషన్ అధికారులు మూడు సార్లు టెండర్లు పిలిచినా అప్పట్లో కాంట్రాక్టర్‌లు ముందుకు రాకపోవడం గమనార్హం. నక్కల డ్రెయిన్ వల్ల ముంపు బారిన పడి ప్రతీ ఏటా సార్వా పంట నీట పాలవుతుందని దీనివల్ల తీవ్రంగా నష్టపోతున్నామని ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి శాశ్వత పరిష్కారం చేపట్టి ముంపు సమస్య లేకుండా చూడాలని ఈ ప్రాంత రైతులు కోరుతున్నారు.
సార్వాలో ఏటా నష్టమే
నక్కల కాలువను ఆనుకుని నాలుగు ఎకరాలు కౌలువ్యవసాయం చేస్తాను. అయితే ప్రతీ ఏటా సార్వాలో నక్కల డ్రెయిన్ పొంగి పంట పొలాలు నీట మునుగుతున్నాయి. దీని వల్ల ఏటా నష్టమే. గ్రామంలో నక్కల డ్రెయిన్ వద్ద రెండు డ్యామ్‌లు కట్టాల్సి ఉంది. నక్కల డ్రెయిన్ అనుకుని ఉన్న మురుగు కాలువలు కూడా తవ్వాలి.
– కాండ్రేకుల హరిబాబు, కౌలు రైతు,ఎ.వేమవరం
పూర్తిస్థాయిలో తవ్వాలి
నక్కల డ్రెయిన్ తవ్వి సుమారు 15 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుంచి నక్కల డ్రెయిన్ పట్టించుకున్న నాఽథేడే కరువయ్యారు. నక్కల డ్రెయిన్‌ను పూర్తిస్థాయిలో తవ్వితే కొంత వరకు ముంపు లేకుండా కాపాడుకోవచ్చు. అదికారులు స్పందించి నక్కల కాలువను అభివృద్ధి చేయాలి.
–కోళ్ళ సత్యనారాయణ, రైతు, ఎ.వేమవరం
Updated Date - 2023-06-11T00:38:20+05:30 IST