24న పాలకొల్లులో కాపు శంఖారావం
ABN, First Publish Date - 2023-09-22T00:11:39+05:30
కాపు సంక్షేమ సేన శంఖారావం పూరిం చనుంది. వచ్చే ఆదివారం పాలకొల్లులోని ఓ ప్రైవేటు పంక్షన్ హాలులో కాపు సంక్షేమ సేన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించడానికి సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామజోగయ్య పిలుపునిచ్చారు.
టీడీపీ, జనసేన పొత్తుపై కాపు సంక్షేమ సేన చర్చ
జగన్ రాక్షస పాలన విముక్తికి పలు నిర్ణయాలు
పాలకొల్లు, సెప్టెంబరు 21 :కాపు సంక్షేమ సేన శంఖారావం పూరిం చనుంది. వచ్చే ఆదివారం పాలకొల్లులోని ఓ ప్రైవేటు పంక్షన్ హాలులో కాపు సంక్షేమ సేన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం నిర్వహించడానికి సేన వ్యవస్థాపక అధ్యక్షుడు చేగొండి వెంకట హరిరామజోగయ్య పిలుపునిచ్చారు. రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు ఆయా జిల్లాల కో–ఆర్డినేటర్లు, జిల్లాల అధ్యక్షులు, కాపు సంక్షేమ సేన పలు విభాగాల రాష్ట్ర అధ్యక్షులు సుమారు 60 మంది సమావేశానికి హాజరు కానున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో పొత్తు అంశాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించినందున భవిష్యత్ కార్యాచరణపై సమావేశంలో చర్చిస్తారు. రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించడానికి టీడీపీ, జనసైనికులు కాపు సంక్షేమ సేన పూర్తిస్థాయిలో పోరాటం సాగించాల్సిన తరుణం ఆసన్నమైనందున టీడీపీ, జనసేన పొత్తుపై కాపు సామాజిక వర్గీయులలోనే నెలకొన్న భిన్నాభిప్రాయాలను, వారిలో నెలకొన్న సందేహాలను ఈ సమావేశం ద్వారా నివృత్తి చేయనున్నారు. పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్రంలో 22 శాతంగా వున్న కాపు, తెలగ, బలిజ తదితర వర్గాలను ఏకతాటిపైకి తీసుకుని రావడానికి, పొత్తులో భాగంగా ముందుగానే జనసేన, టీడీపీ అధినేతలు ఇద్దరూ ఒక అంగీకారానికి వచ్చి ఆ మేరకు ప్రకటిస్తే సామాజిక వర్గీయుల్లో నెలకొన్న అనుమానాలు వీడతాయని అంచనా వేస్తున్నారు.
Updated Date - 2023-09-22T00:11:39+05:30 IST