ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2వ సారి.. రెండు వేలు

ABN, First Publish Date - 2023-05-20T00:18:15+05:30

ఏడేళ్ల క్రితం కేంద్రం 1000, 500 రూపాయల నోట్లను వాడకం రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి మనుగడలో వున్న రెండు వేల నోట్లను ఇప్పుడు ఉపసంహరిం చుకుంటున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏడేళ్ల క్రితం రూ.500, వెయ్యి నోట్ల రద్దు

తాజాగా రెండు వేల నోటు ఉపసంహరణ

ఆర్‌బీఐ ఉత్తర్వులు జారీ..

సెప్టెంబరు 30లోపు బ్యాంకుల్లో మార్చుకోవచ్చు

బడా వ్యాపారులు, రాజకీయ నేతల్లో అలజడి

ఫస్ట్‌న పింఛన్‌దారులకు ఈ నోట్లే పంపిణీ

వైసీపీ ఖజానాలో నిల్వలు..

ఆ పార్టీకి పెద్ద దెబ్బని విపక్షాల ఆరోపణ

(ఏలూరు–ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

ఏడేళ్ల క్రితం కేంద్రం 1000, 500 రూపాయల నోట్లను వాడకం రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి మనుగడలో వున్న రెండు వేల నోట్లను ఇప్పుడు ఉపసంహరిం చుకుంటున్నట్టు ఆర్‌బీఐ ప్రకటించింది. ఈ వార్త వెలువడిన క్షణాల్లోనే బిగ్‌ షాట్స్‌ ఉలిక్కిపడ్డారు. నాడు రద్దయిన నోట్లను మార్చుకునేందుకు పడిన ఇబ్బందులను ప్రజలు గుర్తు చేసుకున్నారు.

నల్ల ధనం, తీవ్రవాదం తుద ముట్టించేందుకు 1000, 500 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం 2016 నవంబర్‌లో ప్రకటించింది. నెలల వ్యవధిలో వీటిని మార్చు కోవచ్చని సందేశం పంపించింది. దిగువ నుంచి ఉన్నత స్థాయి వరకు జనం హోరెత్తిపోయారు. ఆకస్మిక నోట్ల రద్దుతో విలవిలలాడారు. నోట్ల మార్పిడికి బ్యాంకుల వద్ద క్యూలు కట్టి తిప్పలు పడ్డారు. కొన్నిచోట్ల తొక్కిసలాట జరిగి పేద వర్గాల వారు చనిపోయిన దురదృష్టకర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఏడేళ్ళ క్రితం చోటు చేసుకున్న ఈ పరిణా మాలు చాలా కాలం ప్రజల మనసు నుంచి చెరిగి పోలేదు. ఒక్క ఉమ్మడి పశ్చిమ గోదావరిలోనే రద్దయిన నోట్లు దాదాపు రూ.600 కోట్ల మేర కొత్త నోట్లుగా మార్చుకునేందుకు పడరాని పాట్లు పడ్డారు. పేరొందిన రాజకీయ పక్షాల నేతలు తమకు తెలిసిన బ్యాంకర్లతో లాలూచీ పడ్డారనే ఆరోపణలు వినిపించాయి. అలాంటి వారంతా పెద్ద సంఖ్యలో రూ.1000, 500 నోట్లను అప్పటికప్పుడు మార్చుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇదిగో మరోసారి నోట్ల ఉపసంహరణ జాబితాలో రెండు వేల నోటు చేరింది. శుక్రవారం రాత్రి ఆర్‌బీఐ కీలక ప్రకటన చేసింది. ఈ రోజు నుంచి రెండు వేల నోట్ల వినియోగాన్ని బ్యాంకులు నిలిపివేయాలని ఆదేశాలు ఇచ్చింది. ఐదు నెలల పాటు ఈ నెల 23 నుంచి సెప్టెంబర్‌ నెలాఖరు వరకు రోజుకు రూ.20 వేలకు తగ్గకుండా రెండు వేల నోట్లను మార్చుకోవచ్చంటూ కస్టమర్లకు ఛాన్స్‌ ఇచ్చింది. ఈ పరిణామాలన్నీ శుక్రవారం రాత్రికి రాత్రే మార్కెట్‌లో పెను ప్రకంపనలు సృష్టించింది. తొలుత 2016లో నోట్ల రద్దు జరిగిన పరిణామం క్రమంలో అప్పటికప్పుడు చోటు చేసుకున్న పరిణామాలకు ఇప్పుడు కొత్తగా రెండు వేల నోట్ల ఉపసంహరణ పర్యవసానానికి పెద్దగా పొంతన ఉండే అవకాశంలేదని చెబుతున్నారు. ఎందుకనంటే.. 2018–19 సంవత్సరంలోనే రెండు వేల నోట్లు విస్తృతంగా మార్కెట్‌లోకి రాక నిలిచిపోయింది. ఆర్‌బీఐ రెండు వేల నోట్లు ముద్రించ రాదని నిర్ణయం తీసుకున్న కారణంగా అప్పటికే చలామణిలో ఉన్న నోట్లు మినహా అదనంగా మార్కెట్‌లోకి రాలేదు. 2019 సాధారణ ఎన్నికల్లో రెండు వేల నోట్లు ప్రవాహంలా సాగాయి. ఎవరి చేతిలో చూసినా ఈ నోటే. గులాబీ రంగును పోలిన ఈ నోటును కొందరు ఆ తరువాత నింపాదిగా నొక్కేసినట్టు చెబుతున్నారు. ఆర్‌బీఐ నుంచి బ్యాంకర్లకు ఫ్లో తగ్గింది కాబట్టి మార్కెట్‌లోవున్న రెండు వేల నోట్లు అదృశ్యమైనట్టు సాధారణ జనం భావించారు.

అప్పటికీ.. ఇప్పటికీ ఎంతో తేడా

అప్పట్లో వెయ్యి, 500 నోట్ల చలామణిని రద్దు చేసిన ఉద్వేగభరిత వాతావరణం ఇప్పుడు కొందరికి మినహా మరెవరిలోనూ పెద్దగా ప్రస్పుటం కాలేదు. ఎందుకనంటే అధికార మార్పిడి జరిగి రాష్ట్రంలో నాలుగేళ్ళు కావస్తోంది. ఈ నాలుగేళ్లలో రెండేళ్ళపాటు కరోనా వణికించింది. ద్రవ్య వినియోగం తగ్గుముఖం పట్టింది. 2022 మధ్యస్తం నుంచే మార్కెట్‌లో పుంజుకున్నాయి. అదే క్రమంలో డిజిటల్‌ నెట్‌వర్క్‌లు జోరందుకున్నాయి. టీ కొట్టు నుంచి కిరాణా వరకు ఫోన్‌పే, గూగుల్‌పే, పేటిఎం వంటి వాటికి జనం క్రమేపీ అలవాటుపడ్డారు. నోట్ల వినియోగం బహిరంగంగా తగ్గుముఖం పట్టింది. ఆర్‌బీఐ చెబుతున్నట్టు మార్చి నాటికి కొంత తగ్గు ముఖం పట్టినా మిగతా నోట్లు పలుకుబడి కలిగిన వారి ఖజానాల్లోనే మూలుగుతున్నట్టు అంచనా. ఉమ్మడి పశ్చిమ గోదావరిలో ప్రముఖ ఆక్వా కంపెనీల్లో వీటి నిల్వలు ఉన్నట్టు ఇప్పటికే పుకార్లు షికార్లు చేస్తున్నారు.

ఇలా ఎలా ఇచ్చారు

రెండు వేల నోటు చెలామణిని ఆర్‌బీఐ ఉపసంహరించుకోవడానికి 18 రోజుల క్రితం అంటే ఈ నెల ఫస్ట్‌ తారీఖున వృద్ధుల్లో అనేక మందికి పింఛన్‌గా రెండు వేల నోటే అందింది. బ్యాంకర్లు తమకు ముందస్తుగా అందిన సంకేతాల ప్రకారమే ఈ రెండు వేల నోట్లను చలామణిలోకి తెచ్చారా ? లేక యాదృచ్చికంగానే జరిగిందా ? అనేది అనుమానమే. కిరాణా, సాధారణ దుకాణాల్లో తమ చేతికి అందిన రెండు వేల నోట్లకు చిల్లర ఇవ్వాల్సిందిగా కోరడంతో అప్పట్లోనే అందరు విస్తుపోయారు. ఏలూరులోని అనేక ప్రాంతాల్లో వృద్ధులకు పింఛనుకు రెండు వేల నోటుతోపాటు మిగతా 750 రూపాయలు పింఛన్‌దారులకు అందింది. ఇప్పుడు రెండు వేల నోటు ఉపసంహరణ ప్రభావం కాస్త బడుగులపై పడనుంది. ఎలా లేదన్నా వీరంతా బ్యాంకులకు మళ్లీ క్యూ కట్టాల్సిందే. చేతికొచ్చిన పింఛన్‌ నగదు ఈ రూపంలో అందించి మళ్లీ రద్దు చేస్తున్నారనే ఆగ్రహం వారి మాటల్లోనే వినిపిస్తోంది.

పాలక పక్షానికే ఎదురుదెబ్బ

రెండు వేల నోట్ల ఉపసంహరణ పాలక పక్షానికి అతి పెద్ద దెబ్బగానే మిగతా పార్టీలు భావిస్తున్నాయి. రాబోయే ఏడు నెలల్లో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నందున ఇప్పటికే తమ అనుయాయులందరికీ రెండు వేల నోట్లను గంపగుత్తగా అధికార పార్టీ వివిధ నియోజకవర్గాల్లో చేరవేసిందనే పుకార్లు గుప్పుమంటున్నాయి. ఈ దశలోనే నోట్ల ఉపసంహరణ ప్రకటన ప్రకంపనలు రేపుతుంది. నోట్ల రద్దు ప్రకటన ఆ పార్టీకి శరాఘాతంగానే భావిస్తున్నారు. ప్రత్యేకించి పేరొందిన వ్యాపారస్తులకు ఇదొక పెద్ద షాక్‌గా అభివర్ణిస్తున్నారు. ఎవరికెంత నష్టం.. మరెవరికెంత లాభం అనేదానిపై విస్తృతంగా చర్చ నడుస్తుంది.

‘జగ’మెరిగిన సత్యం

కోట్ల కొద్దీ రెండు వేల నోట్లన్నీ వైసీపీ ఖజానాలో నిల్వ ఉన్నాయి. బయట మార్కెట్‌లో ఎక్కడా లేకపోవడానికి ఇదే కారణం. ఈ నల్ల డబ్బుతో వచ్చే ఎన్నికల్లో ఓట్లు కొనుగోలు చేయాలని జగన్‌ పార్టీ వేసిన ఎత్తుగడకు ఆర్‌బీఐ నిర్ణయం నిజంగానే చెంప దెబ్బ. మిగతా పార్టీలకిది ఆమోదయోగ్యమే.

–గన్ని వీరాంజనేయులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు

ఇదంతా పిచ్చి పని

గతంలో వెయ్యి, 500 నోట్లు రద్దు చేసినప్పుడు బ్లాక్‌ మనీ తగ్గించడం కోసమన్నారు. చిన్నాచితక కుటుంబీకులను గంటల కొద్దీ క్యూ లైన్లలో ఉంచి కొంత మంది ప్రాణాలు పోయేలా చేశారు. ఇదంతా గొప్ప పనిగా మోదీ చెప్పుకొచ్చారు. అప్పుడు కొత్త నోట్ల ముద్రణకు వేల కోట్లు ఖర్చు చేశారే తప్ప బ్లాక్‌ మనీని తగ్గించలేకపోయారు.ఇప్పుడు మరోసారి పిచ్చి పని చేస్తున్నారు. ఇది దేశ ఆర్థిక భారాన్ని పెంచేదే.

–డేగా ప్రభాకర్‌, సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు

నల్లధనం వెలికితీతకు దోహదం

కచ్చితంగా నల్లధనాన్ని బయటకు తీయడానికి రెండు వేల నోటు నిలిపివేయడం ఎంతో ఉపయో గపడుతుంది.. ఇది మంచి నిర్ణయమే. వచ్చే ఎన్నికల్లో ఓట్ల కొనుగోలుకు ఇది అడ్డుకట్ట వేయగలదు అనుకుంటున్నాను.

–కొటికలపూడి గోవిందరావు, జనసేన పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు

మంచి నిర్ణయం

రిజర్వ్‌బ్యాంకు రెండు వేల నోటును నిలిపివేయాలని నిర్ణయించడం చాలా మంచి నిర్ణయం. కొంతకాలంగా ఈ నోటును దుర్వినియోగం చేస్తున్నారు. గతంలో పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు పాకిస్తాన్‌ తీవ్రవాద సంస్థలకు చెక్కుపెట్టారు. ఇప్పుడు కూడా దేశాన్ని దెబ్బతీసే కొన్ని సంస్థలను ఈ నిర్ణయం కచ్చితంగా దెబ్బతీస్తుంది.

–భూపతి రాజు శ్రీనివాస వర్మ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి

Updated Date - 2023-05-20T00:18:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising