తప్పని డోలీ మోత
ABN, First Publish Date - 2023-04-03T00:47:22+05:30
జిల్లాలో గిరిశిఖర గ్రామానికి చెందిన యువతి ఆత్మహత్యకు యత్నించింది. హుటాహుటిన ఆమెను బంధువులు ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు.
మూడు కిలోమీటర్లు మోసుకుంటూ రోడ్డు మార్గం చేరిన బంధువులు
ఆసుపత్రిలో చికిత్స.. తప్పిన ప్రాణాపాయం
గిరిశిఖర గ్రామానికి రహదారి నిర్మించాలని కోరుతున్న గిరిజనులు
సాలూరు రూరల్, ఏప్రిల్ 2: జిల్లాలో గిరిశిఖర గ్రామానికి చెందిన యువతి ఆత్మహత్యకు యత్నించింది. హుటాహుటిన ఆమెను బంధువులు ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో డోలీమోతతో తిప్పలు పడ్డారు. వివరాలిలా ఉన్నాయి. సాలూరు మండలంలో గిరిశిఖర గ్రామం ఎగువరూఢిలో మర్రి సిందో, రోష అనే గిరిజన దంపతులు పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారికి నలుగురు కూతుర్లు. ఇద్దరు కొడుకులు. కాగా వారిలో పెద్ద కూతురు మర్రి లూతి ఖర్చుకు డబ్బులు కావాలని ఆదివారం తండ్రిని కోరింది. ముందు పొలం, ఇంటి పనులు బాగా చేయాలని తండ్రి సిందో చెప్పాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై ఇంటిలో ఉన్న పురుగుల మందు తాగింది. కాసేపటి తర్వాత లూతి స్పృహ కోల్పోయింది. విషయం తెలుసుకున్న బంధువులు ఆసుపత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఎగువరూఢికి రోడ్డు సౌకర్యం లేదు. కొండలపై కాలిబాటలో రాళ్లదారిలో నడవాల్సిందే. దీంతో ఆమెకు డోలీ కట్టి కిందకు దించడానికి తిప్పలు పడ్డారు. సుమారు మూడు కిలోమీటర్లు డోలీ మోసుకుంటూ బట్టివలస గ్రామం వరకూ వచ్చారు. అక్కడ నుంచి రోడ్డు ఉంది. అయితే 108 వాహనాన్ని అక్కడకు రావాలని ముందే వారు ఫోన్ చేసినా కాస్త జాప్యం జరిగింది. ఆమె పరిస్థితి బాగోలేకపోవడంతో మరొకరి బైక్‌పై ఆసుపత్రికి పయనమయ్యారు. మార్గమధ్యలో మామిడిపల్లి వద్దకు వచ్చేసరికి ఎదురుగా 108 వాహనం రావడంతో దానిలో యువతిని ఎక్కించి సాలూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లూతి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. సాలూరు రూరల్ ఎస్‌ఐ ప్రయోగమూర్తి అక్కడకు చేరుకుని ఆమె నుంచి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. కాగా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం ఉంటే మరింత వేగంగా ఆసుపత్రికి తరలించే వారమని ఆ గ్రామానికి చెందిన గిరిజన యువత తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించాలని వారు కోరారు.
Updated Date - 2023-04-03T00:47:22+05:30 IST