‘కౌలు’ కష్టాలు తీరేనా?
ABN, First Publish Date - 2023-06-26T00:24:06+05:30
జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తున్నా తగిన ప్రతిఫలం దక్కడం లేదు. సంక్షేమ పథకాలు, బ్యాంకుల ద్వారా రుణాలు సైతం అందడం లేదు.
సాగులో కీలకం.. అయినా అరకొరగానే గుర్తింపు
సంక్షేమ ఫలాలు, బ్యాంకు రుణాలకు దూరం
ఏటా ఎన్నో ఇబ్బందులు
పట్టించుకోని సర్కారు
(పాలకొండ)
- పాలకొండ మండం ఓని పంచాయతీ పరిధిలో 20 ఎకరాల భూమిని గతేడాది ఖరీఫ్ సీజన్‌లో సీతంపేటలోని సవరగూడకు చెందిన ముగ్గురు గిరిజనులు ఉమ్మడిగా కౌలుకు తీసుకుని వరి సాగు చేపట్టారు. అయితే సదరు భూ యజమాని నుంచి హామీపత్రం ఇవ్వకపోవడంతో మార్కెట్ ధరకు పంటను అమ్ముకోలేకపోయారు. మరోవైపు ప్రభుత్వం అందించే సబ్సిడీ, ప్రయోజనాలు పొందలేకపోయారు. తీవ్రంగా నష్టపోవడంతో వారు ఈ ఏడాది సాగుకు దూరమయ్యారు.
- వెలగవాడకు చెందిన ఓ రైతు తన ఐదెకరాల పాలాన్ని అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కౌలుకు ఇచ్చారు. అయితే గతేడాది ఖరీఫ్‌లో వరి పంటకు గిట్టుబాటు ధర రాకపోవడంతో కౌలు రైతు నష్టపోయాడు. దీంతో ఈ ఏడాది తక్కువ కౌలుకు భూమిని అడిగారు. భూ యజమాని అంగీకరించకపోవడంతో కౌలురైతు తన ఒప్పందాన్ని విరమించుకున్నాడు.
జిల్లాలో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తున్నా తగిన ప్రతిఫలం దక్కడం లేదు. సంక్షేమ పథకాలు, బ్యాంకుల ద్వారా రుణాలు సైతం అందడం లేదు. ‘వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్నాం.. అన్నదాతల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాం’ అని చెబుతున్న సర్కారు ప్రకటనలకే పరిమితమవుతోంది. క్షేత్రస్థాయిలో కౌలు రైతులను మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో వారు ఏటా సాగు సమయంలో అష్టకష్టాలు పడాల్సి వస్తోంది. వాస్తవంగా జిల్లాలో ఏటా ఖరీఫ్, రబీ సీజన్లలో 40 శాతానికి పైగా పంటలు పండించేది కౌలు రైతులే. అయినప్పటికీ వారికి తగిన గుర్తింపు ఉండడం లేదు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో సుమారు మూడు లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో సుమారు 80 వేల మంది కౌలు రైతులే. వారంతా భూ యజమానుల నుంచి భూమిని కౌలుకు తీసుకొని పంటలు సాగుచేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాలో సుమారు 70 వేల హెక్టాల్లో వరి సాగు చేస్తున్నట్టు వ్యసాయాధికారులు అంచనా వేస్తున్నారు. అయితే అందులో 40 శాతం భూముల్లో కౌలు రైతులే సాగు చేపడుతుండడం గమనార్హం. అయితే వారి కష్టానికి తగిన గుర్తింపు ఉండడం లేదు. ప్రభుత్వం అందించే ఫలాలు కూడా కౌలు రైతులదరి చేరడం లేదు. వివిధ రకాల రాయితీలు, రైతు భరోసా వంటివి అందడం లేదు. దీంతో ఏటా ఎన్నో వ్యయప్రయాసలకోర్చి వారు సాగు చేపట్టాల్సి వస్తోంది.
ఒప్పందం ఇలా..
సాగునీటి వసతి అందుబాటులో ఉండి అపరాల పంట కూడా కలిసి వస్తుందనుకుంటే .. ఎనిమిది నుంచి పది బస్తాల ధాన్యం ఇచ్చేందుకు కౌలు ఒప్పందం చేసుకుంటున్నారు. అయితే ఏటా వివిధ కారణాలతో అంత దిగుబడి రావడం లేదు. గిట్టుబాటు ధర కూడా ఉండడం లేదు. మరోవైపు కౌలు రైతులకు భూ యజమానులు హామీ పత్రం ఇవ్వకపోవడంతో పథకాలు, రాయితీలు పొందలేకపోతున్నారు. దీంతో అప్పులు చేసి సాగు చేపట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఏడాదికి రైతులు నాలుగు నుంచి ఐదు బస్తాలకే కౌలుకు అడుగుతున్నారు. అందుకు భూ యజమానులు ఒప్పుకోవడం లేదు. దీంతో చాలామంది కౌలు రైతులు సాగుకు వదులుకుంటున్నారు.
అంతంతమాత్రంగానే..
కౌలు రైతుగా గుర్తింపు పొందితే వ్యవసాయశాఖ నుంచి సబ్సిడీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సబ్సిడీ ధరలకు పొందే అవకాశం ఉంటుంది. అయితే ఇందుకోసం ఏటా ఖరీఫ్ సీజన్ ఆరంభంలో రెవెన్యూ, వ్యవసాయశాఖల అధికారులు గ్రామసభలు నిర్వహించాల్సి ఉంది. ఆ తర్వాత కౌలు రైతులను గుర్తించాల్సి ఉంది. అయితే ఏటా ఈ ప్రక్రియ అంతంతమాత్రంగానే సాగుతోందని చెప్పొచ్చు. కౌలు చట్టాలు, ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారనే ఆరోపణలున్నాయి. గత ఏడాది జిల్లా వ్యాప్తంగా 4,365 మందిని కౌలు రైతులుగా గుర్తించి కౌలు కార్డులు (సీసీఆర్‌సీ) అందించారు. వారిలో కేవలం 2,806 మందికి మాత్రమే రైతు భరోసాలో అర్హులుగా అందించారు.
పక్కాగా అమలైతేనే..
కౌలు రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2005లో కౌలు చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. దీని పక్కాగా అమలు చేస్తే.. కౌలు రైతులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హత సాధించే అవకాశం ఉంది. పంట నమోదు సమయంలో ధాన్యం అమ్ముకోవచ్చు. బ్యాంకు రుణాలను పొందొచ్చు. పంటల బీమా అర్హత, పంట నష్టపరిహారం పొందే అవకాశాలు దక్కే అవకాశం ఉంది. కానీ ఇప్పటివరకు కౌలు రైతులకు మేలు చేసేలా చట్టం అమలు చేసిన దాఖలాల్లేవు.
ఒప్పంద పత్రాలు కరువు...
వాస్తవంగా కౌలుకు చేస్తున్న భూ యజమాని నుంచి రైతులు కౌలు ఒప్పంద పత్రాన్ని పొందాల్సి ఉంటుంది. దీని ఆధారంగా భూ యజమాని వివరాలతో కూడిన వన్‌బీ అడంగల్, ఆధార్‌లను వ్యవసాయ, రెవెన్యూశాఖల అధికారులకు అందించడం ద్వారా కౌలు రైతు కార్డు (సీసీఆర్‌సీ)ను అందిస్తారు. అయితే అత్యధిక శాతం భూ యజమానులు కౌలు రైతులకు ఒప్పంద పత్రాలను ఇవ్వడం లేదు. వారిలో అనుమానాలను నివృత్తి చేసి , కౌలు రైతులకు ప్రయోజనం కలిగించేలా చర్యలు తీసుకోవడంలో అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమవుతోంది. దీంతో చేసేది లేక కౌలు రైతులు పూర్వ పద్ధతినే పాటిస్తున్నారు. యజమానితో నోటి మాట అనుకొని కౌలుకు పంటలను సాగు చేస్తున్నారు. దీంతో చాలామంది ప్రభుత్వం అందించే కౌలు కార్డులను పొందలేకపోతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, వ్యవసాయ శాఖ అందించే అన్ని రకాల రాయితీలు, ప్రయోజనాలకు దూరమవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి తమను అన్నివిధాలుగా ఆదుకోవాలని జిల్లాలో కౌలు రైతులు కోరుతున్నారు.
గ్రామ సభలు నిర్వహిస్తున్నాం
కౌలు రైతుల గర్తింపునకు గ్రామాల్లో సభలు నిర్వహిస్తున్నాం. రెవెన్యూ, వ్యవసాయ శాఖ సమన్వయంతో కౌలు రైతుల గుర్తింపునకు చర్యలు చేపట్టాం. అర్హులందరికీ సీసీఆర్‌సీలు అందిస్తాం. కౌలు చట్టంపై అవగాహన కల్పిస్తున్నాం.
- రత్నకుమారి, ఏడీఏ, వ్యవసాయ శాఖ, పాలకొండ
Updated Date - 2023-06-26T00:24:06+05:30 IST