‘ఫిష్’ ఆంధ్రా ఎక్కడ?
ABN, First Publish Date - 2023-07-31T00:01:23+05:30
నిరుద్యోగ యువతికి ఉపాధి కల్పించేందుకే ఫిఫ్ ఆంధ్రా యూనిట్లు ఏర్పాటు చేసినట్లు సర్కారు గొప్పలు చెప్పుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. జిల్లాలో చాలాచోట్ల ఆ యూనిట్లు మూతబడుతున్నాయి.
నిర్వహణపై దృష్టిసారించని సర్కారు
ఇప్పటికీ అందని సామగ్రి
మొగ్గు చూపని లబ్ధిదారులు
చాలాచోట్ల మూతపడుతున్న వైనం
( గరుగుబిల్లి )
నిరుద్యోగ యువతికి ఉపాధి కల్పించేందుకే ఫిష్ ఆంధ్రా యూనిట్లు ఏర్పాటు చేసినట్లు సర్కారు గొప్పలు చెప్పుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఆ పరిస్థితి లేదు. జిల్లాలో చాలాచోట్ల ఆ యూనిట్లు మూతబడుతున్నాయి. ప్రభుత్వం సకాలంలో పరికరాలు, సామగ్రి అందించకపోవడం, వాటి నిర్వహణను పట్టించుకోకపో వడంతో లబ్ధిదారులు వాటిపై ఆసక్తి చూపడం లేదు. దీంతో అనేక ప్రాంతాల్లో యూనిట్లకు తాళాలు పడుతున్నాయి. మొత్తంగా మత్స్యకారుల స్వయం ఉపాధి ప్రకటనలకే పరిమితమైంది.
పరిస్థితి ఇదీ..
జిల్లాలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను పాలకొండ డివిజన్‌లో 24, సాలూరులో 10, పార్వతీపురానికి 10 యూనిట్లు మంజూరు చేశారు. 2023-24లో మరో 24 యూనిట్లుకు ప్రతిపాదనలు చేశారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎస్సీ, ఎస్సీ, మత్స్యకార సంఘాలు, స్వయం సహాయక సంఘాలకు కేంద్ర ప్రభుత్వం రాయితీని మంజూరు చేస్తుంది. కాగా జిల్లాలో 44 యూనిట్లు ఏర్పాటు చేసినా.. వాటిల్లో ఏ ఒక్కటీ వినియోగంలో లేవు. చాలావరకు మూతబడ్డాయి.
ఫిష్ ఆంధ్రా కింద మంజూరైన యూనిట్ విలువ రూ.23 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో యూనిట్ విలువ రూ.3.25 లక్షలుగా నిర్ధారించారు. రూ.4లక్షలు విలువ చేసే మూడు చక్రాల వాహనం, రూ. 13 లక్షల విలువ గల నాలుగు చక్రాల వాహనం అందజేయాల్సి ఉంది. ఆ మొత్తం విలువలో 10 శాతం లబ్ధిదారుని వాటాగా చెల్లించాల్సి ఉంది. మిగతా మొత్తం బ్యాంకు రుణంగా సమ కూరుస్తారు. పరికరాలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ మహిళలకు 60 శాతం, ఇతర వర్గాలకు 40 శాతం రాయితీ ప్రకటించారు. కాగా గత ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో ఏర్పాటైన యూనిట్లకు ఇంతవరకు సామగ్రి, వాహనాలు అందజేయలేదు. వాటి నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించడం లేదు. మరోవైపు రుణాలు అందించేందుకు బ్యాంకర్లు కూడా ముందుకు రావడం లేదు.
తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టులో మత్స్య సంపద అధికం. ఈ ప్రాంతం నుంచి పలు ప్రాంతాలకు చేపల రవాణా చేస్తుంటారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం తీరుతో చాలామంది మత్స్యకారులు యూనిట్లుకు చేపలను తరలించకుండా ప్రైవేటు వర్తకులకే విక్రయించేందుకు మొగ్గు చూపుతున్నారు. సామగ్రి అందించకుండా యూనిట్లు ఎలా నిర్వహిస్తామని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు.
గ్రామస్థాయిలోనే అమ్మకాలు
ఫిష్ ఆంధ్రా యూనిట్లపై అధికారులు కూడా అంతగా దృష్టి సారించడం లేదు. దీంతో మత్స్యకారులు అధికంగా గ్రామాల్లోనే చేపల అమ్మకాలు చేపడుతున్నారు. తోటపల్లి పరిధిలోనూ అదే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా ప్రాజెక్టు పరిధిలో మత్స్యకారులకు గత టీడీపీ ప్రభుత్వం ఐటీడీఏల పరిధిలో పలు రాయితీలపై రుణాలను అందించి ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చర్యలు చేపట్టారు. ప్రస్తుతం తోటపల్లి ప్రాజెక్టులో చేపల పెంపకం, వాటి సంరక్షణకు కేంద్రం రాయితీపై నిధులు ఇస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఏ సాయం అందించడం లేదు. పైగా కేంద్రం ఇస్తున్న సాయాన్ని వైసీపీ సర్కారు తన ఖతాలో వేసుకుంటోంది.
కానరాని ఆక్వా హబ్‌లు
జిల్లాలో పార్వతీపురం, పాలకొండ ప్రాంతాల్లో పలు రకాల చేపలను తరలించేందుకు వీలుగా ఆక్వా హబ్‌లకు ప్రతిపాదనలు చేశారు. అయితే పార్వతీపురం, పాలకొండ ప్రాంతాల్లో ఇంకా భవన నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి.
యూనిట్ల నిర్వహణకు చర్యలు
జిల్లాలో ఏర్పాటు చేసిన ఫిష్ యూనిట్ల సక్రమంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నాం. ప్రస్తుతం 49 యూనిట్లు నిర్వహిస్తున్నారు. వాటికి సంబంధించి సామగ్రి వారం రోజుల్లో వచ్చే అవకాశం ఉంది. పీఎం మత్స్య సంపద యోజన పథకంలో అనుసంధానం చేస్తున్నాం. యూనిట్లు నిర్వహిస్తామన్న వారికి అవకాశాలు కల్పిస్తాం. పార్వతీపురం, పాలకొండ ప్రాంతాల్లో ఆక్వా హబ్‌ల నిర్మాణాలకు చర్యలు చేపడుతున్నాం.
- వేముల తిరుపతయ్య, జిల్లా మత్స్య శాఖాధికారి
Updated Date - 2023-07-31T00:01:23+05:30 IST