నిలువ నీడ కరువు
ABN, First Publish Date - 2023-03-05T00:11:17+05:30
జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. వేసవి ఆరంభంలోనే భానుడు తన ప్రభావం చూపిస్తున్నాడు. ఉదయం పది గంటల తర్వాత బయటకు రాలేని పరిస్థితి. ఇటువంటి వాతావరణంలో ఉపాధి హామీ వేతనదారుల అవస్థలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఠారెత్తిస్తున్న ఎండలు
‘ఉపాధి’ పనుల ప్రాంతాల్లో కానరాని వసతులు
టెంట్లు ఏర్పాటు చేయని వైనం
తాగునీరు, మజ్జిగ అందించేదెప్పుడో..
స్పందించని అధికారులు
(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)
జిల్లాలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు అమాంతం పెరిగాయి. వేసవి ఆరంభంలోనే భానుడు తన ప్రభావం చూపిస్తున్నాడు. ఉదయం పది గంటల తర్వాత బయటకు రాలేని పరిస్థితి. ఇటువంటి వాతావరణంలో ఉపాధి హామీ వేతనదారుల అవస్థలు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే పని చేసే ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడం లేదు. చాలాచోట్ల టెంట్లు , ప్రథమ చికిత్స కిట్లు, తాగునీటి సదుపాయం కానరావడం లేదు. దీంతో వేతనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఎండలో పనిచేసిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకోవాలన్నా.. భోజనం చేయాలన్నా.. కుదరని పరిస్థితి. ఎండలు ముదురుతున్నా.. సంబంధిత సిబ్బంది కనీస చర్యలు చేపట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదీ పరిస్థితి..
వాస్తవంగా ‘మన్యం’ జిల్లాలో 1,93,825 జాబ్‌కార్డులు ఉన్నాయి. మొత్తంగా 3.63లక్షల మంది వేతనదారులు ఉండగా, ప్రస్తుతం 69,165 మంది పనులు చేస్తున్నారు. జిల్లాలోని 15 మండలాల్లో ప్రతి పంచాయతీలో కనీసం పది గ్రూపులకు తక్కువ కాకుండా ‘ఉపాధి’ పనులు చేస్తున్నారు. అయితే పనులు చేసే ప్రదేశాల్లో తప్పనిసరిగా టెంట్లు ఏర్పాటు చేయాల్సిన బాధ్యత అధికారి యంత్రాంగంపై ఉంది. కాగా ఎండలు మండుతున్నా అవెక్కడా కానరావడం లేదు. కొత్త జిల్లా ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటివరకూ వాటిని పంపిణీ చేయలేదు. ఉమ్మడి జిల్లాగా ఉన్న సమయంలో పంపిణీ చేసిన టెంట్లే దిక్కుగా మారాయి. కొన్ని పంచాయతీల్లో ఒకటి లేదా రెండు టెంట్లే ఉండడంతో ఆయా వేతనదారుల మధ్య వివాదాలు ఏర్పడుతున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా గతంలో వేసవి కాలంలో పనులు జరిగే ప్రాంతాల్లో వేతన దారులకు మజ్జిగ అందించేవారు. కానీ ఇప్పటికీ సరఫరా చేయడం లేదు. మజ్జిగతోపాటు తాగునీరు కూడా ఏర్పాటు చేయకపోవడంపై వేతనదారులు పెదవి విరుస్తున్నారు.
గత అనుభవాల దృష్ట్యా...
రోజురోజుకూ ఎండలు తీవ్రమవుతున్న నేపథ్యంలో ఉపాధి పనులు చేసే వేతనదారులు అస్వస్థతకు గురయ్యే అవకాశం ఉంది. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. గతంలో ఎంతోమంది పనులు చేసిన చోటే కుప్పకూలిన ఘటనలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. లేకుంటే గత అనుభవాల దృష్ట్యా ఇబ్బందులు తప్పవు. జిల్లాలో ఉపాధి పనులు చేసే ప్రాంతాల్లో తక్షణమే టెంట్లు, తాగునీరు వంటి సదుపాయాలను ఏర్పాటు చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు.
కొత్తగా సరఫరా చేయలేదు
నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత కొత్తగా టెంట్లను సరఫరా చేయలేదు. ఉమ్మడి జిల్లా ఉన్న సమయంలోనే సరఫరా చేశారు. టెంట్లు వచ్చిన వెంటనే ప్రతి గ్రామానికి పంపిణీ చేస్తాం.
- రామచంద్రరావు, పీడీ, డ్వామా, పార్వతీపురం మన్యం జిల్లా
Updated Date - 2023-03-05T00:11:17+05:30 IST