బదిలీ.. రద్దు.. బదిలీ
ABN, First Publish Date - 2023-09-23T00:10:25+05:30
రేగిడి అమదాలవలస మండల తహసీల్దార్ కళ్యాణచక్రవర్తి బదిలీ వ్యవహారం మలుపులు తిప్పుతోంది. గురువారం సాయంత్రం అయన్ను కలెక్టర్ కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. అయన స్థానంలో కలెక్టరేట్‌లో పనిచేస్తున్న రామకృష్ణను నియమిస్తూ జీవో నెంబరు 119 జారీ అయింది. ఇందులో ఈయనతో పాటు మరో ముగ్గురికి పరిపాలనా సౌలభ్యం పేరిట డిప్యుటేషన్ బదిలీ చేసినట్లు పొందుపరిచారు.
ఉంగరాడమెట్ట అక్రమణదారులపై కఠినంగా వ్యవహరించడమే కారణమా?
రేగిడి, సెప్టెంబరు 22: రేగిడి అమదాలవలస మండల తహసీల్దార్ కళ్యాణచక్రవర్తి బదిలీ వ్యవహారం మలుపులు తిప్పుతోంది. గురువారం సాయంత్రం అయన్ను కలెక్టర్ కార్యాలయానికి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వులు వెలువడ్డాయి. అయన స్థానంలో కలెక్టరేట్‌లో పనిచేస్తున్న రామకృష్ణను నియమిస్తూ జీవో నెంబరు 119 జారీ అయింది. ఇందులో ఈయనతో పాటు మరో ముగ్గురికి పరిపాలనా సౌలభ్యం పేరిట డిప్యుటేషన్ బదిలీ చేసినట్లు పొందుపరిచారు. అయితే ఏం జరిగిందో ఏమోకానీ 24 గంటల గడవక ముందే శుక్రవారం ఉదయం కళ్యాణచక్రవర్తి బదిలీ ఉత్తర్వులు రద్దు అయ్యాయి. తహసీల్దార్ డిప్యుటేషన్లు మరియు పరిపాలనాపరమైన ఏర్పాట్ల నిమిత్తం జరిగిన ఉత్తర్వులు రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ పీఏ పేరిట ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందులో రేగిడి తహసీల్దార్ కళ్యాణచక్రవర్తి ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమోగానీ శుక్రవారం సాయంత్రం బదిలీ చేస్తున్నట్లు మళ్లీ మరో ఉత్తర్వు వచ్చింది. ఇందులో కళ్యాణ చక్రవర్తి ఉన్నారు. ఈయన్ను కలెక్టరేట్‌లో సూపరింటెండెంట్‌గా డిప్యుటేషన్‌పై బదిలీ చేశారు. ఈయన స్థానంలో దత్తిరాజేరు తహసీల్దార్ బి.సుదర్శనరావును డిప్యుటేషన్‌పై నియమించారు.
ముక్కుసూటిగా వెళ్లడమే కారణమా?
ఉంగరాడమెట్ట అక్రమణలపై ఇటీవల ఆంధ్రజ్యోతిలో వరుస కథనాలు ప్రచురితం అయ్యాయి. జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో ఆక్రమణల పర్వాన్ని తహసీల్దార్ కళ్యాణచక్రవర్తి వెలికితీశారు. గుళ్లపాడు సర్వేనెంబరు 1, 5లో 4.26 ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. వీటిపై నోటీసులు ఇవ్వడం స్థానిక నాయకుల్లో కలకలం రేపింది. కొత్త పట్టాలు జారీ చేసి.. ఉన్న వారివి రెగ్యులర్ చేయాలని ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే వారి వినకపోవడంతో కళ్యాణచక్రవర్తి టార్గెట్ అయినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే ఆయన్ను ఇక్కడి నుంచి పంపించారని చర్చించుకుంటున్నారు.
Updated Date - 2023-09-23T00:10:25+05:30 IST