ఉన్న సీట్లే ఖాళీ
ABN, First Publish Date - 2023-06-11T00:01:20+05:30
ప్రతి మండలంలోనూ రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని, అందులో ఒకటి కో ఎడ్యుకేషన్, మరొకటి బాలికల కోసమని చెబుతూ రానున్న జూన్ నాటికి ఏర్పాటు చేయాలని గురువారం జరిగిన రాష్ట్ర విద్యాశాఖ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
రెండో కళాశాలలో భర్తీ ఎలా?
ప్రభుత్వ జానియర్ కళాశాలల్లో ఏటా మిగిలిపోతున్న వైనం
సీఎం ప్రకటనపై అనేక సందేహాలు
(కలెక్టరేట్)
ప్రతి మండలంలోనూ రెండు జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని, అందులో ఒకటి కో ఎడ్యుకేషన్, మరొకటి బాలికల కోసమని చెబుతూ రానున్న జూన్ నాటికి ఏర్పాటు చేయాలని గురువారం జరిగిన రాష్ట్ర విద్యాశాఖ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు. ఆయన ప్రకటనపై కళాశాలల సిబ్బంది అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సీట్లు ఖాళీగా ఉండిపోతున్నాయని, రెండోది వస్తే నిర్వహణ ఎలా అని ప్రశ్నిస్తున్నారు.
జిల్లాలో 18 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 26 కస్తూర్బాగాంధీ బాలికలు విద్యాలయాలు, 13 మోడల్ కాలేజీలు ఉన్నాయి. మొదటి సంవత్సరానికి 9 వేల సీట్లు ఉండగా ఆరు వేల వరకూ మాత్రమే భర్తీ అయ్యాయి. మిగిలిన సీట్లు ఖాళీగా ఉండి పోయాయి. ఈ సమస్య ఏటా ఉంటోంది. ప్రతి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సైన్సు, ఆర్ట్స్ కలిసి మొదటి సంవత్సరానికి 176 సీట్లు ఉంటాయి. అవసరమైతే ఎంతమంది విద్యార్థులైనా చేర్చుకోవచ్చు. అయితే మొదటి సంవత్సరానికి కొన్ని కళాశాలలో 80 నుంచి 100 మంది వరకూ విద్యార్థులు చేరగా, దత్తిరాజేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 10 నుంచి 15 మంది చేరారు. ఇక్కడ ప్రతి ఏడాది చాలా సీట్లు మిగిలిపోతున్నాయి. ఇటు వంటి కాలేజీలు జిల్లాలో అనేకం ఉన్నాయి. ఈ పరిస్థితికి అనేక కారణాలు ఉన్నాయి.
- ప్రభుత్వం ఉచితంగా అందజేస్తామన్న పాఠ్య పుస్తకాలు గత రెండు సంవత్సరాల నుంచి ఇవ్వలేదు. అలాగే పిల్లలు ఎక్కువగా హాస్టల్‌లో ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. మరోవైపు ఉత్తీర్ణత కూడా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అనుకున్న స్థాయిలో రావడం లేదు. ఇక కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి సంబంధించి ప్రతి కాలేజీకి 40 సీట్లు మాత్రమే ఉంటాయి. వసతి సదుపాయం ఆ సీట్లు నిండుతున్నాయి. మోడల్ కాలేజీల్లో 160 సీట్లు ఉంటున్నాయి. వీటిల్లో కూడా పూర్తిస్థాయిలో చేరడం లేదు. ఈ పరిస్థితిలో ప్రతి మండలానికీ రెండో జూనియర్ కళాశాల ఏర్పాటు చేస్తే నిర్వహణ సాధ్యమేనా అన్న సందేహాన్ని అందరూ వ్యక్తం చేస్తున్నారు.
Updated Date - 2023-06-11T00:01:20+05:30 IST