10 నెలలుగా చెల్లింపుల్లేవ్!
ABN, First Publish Date - 2023-09-22T23:48:21+05:30
గిరిజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి డైట్ బిల్లులు పేరుకుపోయాయి. పది నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. జిల్లాలో సుమారు రూ.22కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.
జిల్లాలో రూ.22 కోట్ల బకాయిలు
మెనూ అమలుకు అవస్థలు
పట్టించుకోని ప్రభుత్వం
(పార్వతీపురం-ఆంధ్రజ్యోతి)
‘ఆశ్రమ పాఠశాలల్లో మెనూ పక్కాగా అమలు చేస్తున్నాం.. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నాం’ అని చెబుతున్న వైసీపీ సర్కారు ప్రకటనలకే పరిమితమవుతోంది. ఆచరణలో భిన్నంగా వ్యవహరిస్తోంది. జిల్లాలో నెలకొన్న పరిస్థితే ఇందుకు నిదర్శనం. గిరిజన విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలకు సంబంధించి డైట్ బిల్లులు పేరుకుపోయాయి. పది నెలలుగా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. జిల్లాలో సుమారు రూ.22కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. మరోవైపు నిత్యావసరాల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మెనూ చార్జీలు పెంచడం లేదు. దీంతో ఆశ్రమ పాఠశాలల నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిల్లులు సక్రమంగా చెల్లించకపోతే మెనూ సక్రమంగా ఎలా అమలవుతుందని, విద్యార్థులకు ఏ విధంగా పౌష్టికాహారం అందుతుందని గిరిజన సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
జిల్లాలో 75 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 25 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరందరికీ ప్రభుత్వం సరఫరా చేసే బియ్యం, పప్పులు, తదితర వస్తువులను మినహాయించి కూరగాయలు, పండ్లు, చికెన్, తదితర వాటిని నిర్వాహకులే బయట కొనుగోలు చేసి వండి పెడుతున్నారు. వీటికి సంబంధించి గతేడాది డిసెంబరు నుంచి ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదు. రూ.22 కోట్లకు పైబడి బిల్లులు నిర్వాహకులతో పాటు ఆశ్రమ పాఠశాలలకు సరుకులు సరఫరా చేస్తున్న గిరిజన సహకార సంస్థకు చెల్లించాల్సి ఉంది. దీంతో అప్పు చేసి విద్యార్థులకు వండి పెట్టాల్సి వస్తోందని నిర్వాహకులు వాపోతున్నారు. పది నెలలకు పైబడి బిల్లులు చెల్లించడం లేదని, దీంతో దుకాణదారులు సరుకులు ఇవ్వడం లేదని చెబుతున్నారు. మరోపక్క పెరిగిన నిత్యావసరాల ధరలకు అనుగుణంగా ప్రభుత్వం మెనూ చార్జీలు చెల్లించడం లేదని, దీనివల్ల నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్నారు. ప్రతి నెలా డైట్ బిల్లులు అందకపోవడంతో కొన్ని ఆశ్రమ పాఠశాలల్లో మెనూను సక్రమంగా అమలు చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ ప్రభావం పిల్లల ఆరోగ్యంపై పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కొన్ని గిరిజన ప్రాంతాల్లో అనేక మంది పిల్లలు రక్తహీనతతో బాధపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి డైట్ బిల్లులు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.
అప్‌డేట్ చేసి పంపించాం
డైట్ బిల్లులను అప్‌డేట్ చేసి ప్రభుత్వానికి పంపించాం. త్వరలోనే చెల్లింపులు జరుగుతాయి. సుమారు రూ.22 కోట్ల బకాయిలు ఉండడం వాస్తవమే. కానీ, డైట్ బిల్లులకు మెనూ అమలుకు సంబంధం లేదు. ఎక్కడైనా మెనూ సక్రమంగా అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం.
- శ్రీనివాసరావు, గిరిజన విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్
Updated Date - 2023-09-22T23:48:21+05:30 IST