కమనీయం.. ఉత్తరద్వార దర్శనం
ABN, First Publish Date - 2023-01-03T00:00:46+05:30
ముక్కోటి ఏకాదశిని జిల్లా ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. స్వామి దర్శనానికి బారులుతీరారు. హరినామస్మరణతో ఆలయాలు హోరెత్తాయి. శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనరోజు కావడంతో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని భక్తులంతా సోమవారం వేకువ జామునుంచే క్యూ కట్టారు. శ్రీమన్నారాయణున్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.
ఘనంగా ముక్కోటి ఏకాదశి
విజయనగరం (ఆంధ్రజ్యోతి), జనవరి 2 :
ముక్కోటి ఏకాదశిని జిల్లా ప్రజలు వైభవంగా జరుపుకున్నారు. స్వామి దర్శనానికి బారులుతీరారు. హరినామస్మరణతో ఆలయాలు హోరెత్తాయి. శ్రీమహా విష్ణువుకు అత్యంత ప్రీతి పాత్రమైనరోజు కావడంతో ఉత్తర ద్వార దర్శనం చేసుకోవాలని భక్తులంతా సోమవారం వేకువ జామునుంచే క్యూ కట్టారు. శ్రీమన్నారాయణున్ని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. జిల్లా వ్యాప్తంగా నియమ నిష్టలు, ఉపవాసాలతో వైష్టవదేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుని ప్రతే ్యక పూజలాచరించారు. ముఖ్యంగా వేంకటేశ్వర స్వామి ఆలయాలు, కృష్ణాలయాలు, వైష్ణవ ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. చాలా చోట్ల స్వామి వారి తీరువిధి కూడా నిర్వహించారు. విజయనగరంలోని రాజమన్నార్ గోపాలస్వామి ఆలయం, టీటీడీ దేవాలయం, తోటపాలెంలోని వేంకటేశ్వర స్వామి ఆలయాల్లో ఉత్తరద్వార దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
వైభవంగా గిరి ప్రదక్షిణ
నెల్లిమర్ల : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం సోమవారం రామనామస్మరణతో మారుమోగింది. జై శ్రీరామ్, జై శ్రీరామ్ అంటూ భక్తుల నినాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. వైకుంఠ ఏకాదశి (ముక్కోటి ఏకాదశి) పర్వదినాన్ని పురస్కరించుకుని రామతీర్థం నీలాచలం (బోడికొండ) వద్ద నిర్వహించిన మెట్ల ఉత్సవం, గోపూజ ఉత్సవం, అనంతరం గిరి ప్రదక్షిణం అట్టహాసంగా సాగాయి. వేలాది మంది భక్తులు రామతీర్థం చేరుకుని ఈ కార్యక్రమాల్లో పాల్గొనడంతో రామతీర్థం ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన మెట్ల ఉత్సవాన్ని ఆలయ అర్చకులు ఖండవిల్ల సాయారామాచార్యులు, స్థానాచార్యులు గొడవర్తి నరసింహాచార్యులు నిర్వహించగా ఆలయ ఈవో డీవీవీ ప్రసాదరావు పర్యవేక్షించారు. అదే ప్రాంతంలో గోపూజ కూడా చేపట్టారు. సాధు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి, నెల్లిమర్ల తామస్‌పేట దుర్గా పీఠం ఉత్తర పీఠాధిపతి శ్రవన చైతన్యానంద చిన్నస్వామి హాజరయ్యారు. డీసీసీబీ వైస్ చైర్మన్ చనుమల్ల వెంకటరమణ, జడ్‌పీటీసీ గదల సన్యాసినాయుడు, నెల్లిమర్ల నగర పంచాయతీ వైస్ ఛైర్మన్ సముద్రపు రామారావు, భక్తులు పాల్గొన్నారు.
- రామతీర్థం ప్రధాన ఆలయం పక్కనే ఉన్న నీలాచలం (బోడికొండ) చుట్టూ గిరి ప్రదక్షిణ సోమవారం చేపట్టారు. మెట్ల ఉత్సవం అనంతరం బోడికొండ మెట్ల వద్ద సాధుపరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసానంద స్వామి ప్రదక్షిణను లాంఛనంగా ప్రారంభించారు. సీతారామలక్ష్మణుల ఉత్సవ విగ్రహాలను పల్లకిలో ఉంచి ఊరేగిస్తూ శ్రీరామ నామ సంకీర్తన చేస్తూ కొండ చుట్టూ ఈ ప్రదక్షిణ నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా కళాకారులు కోలాట ప్రదర్శన, నృత్యాలు నిర్వహించారు. గిరి ప్రదక్షిణ కొండమెట్ల వద్ద ప్రారంభమై ఖానా సెంటర్, రామతీర్థం దేవస్థానం, సీతారామునిపేట జంక్షన్ ప్రాంతాల మీదుగా గొర్లెపేట ఆంజనేయస్వామి ఆలయం, గురుభక్తుల కొండల మీదుగా తిరిగి బోడికొండ మెట్ల వద్దకు చేరుకుంది.
- వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 5 గంటలకు అధికారులు ఉత్తర ద్వారాన్ని తెరిచారు. 7 గంటల వరకు ఉత్తర ద్వారం వద్ద సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఉంచారు. అనంతరం గ్రామంలో ఊరేగింపు చేపట్టారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు సీతారాములను దర్శించుకున్నారు.
ఆకట్టుకున్న తిరుప్పావడ సేవ
విజయనగరం రింగురోడ్డు : ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని కాపువీధి రామాలయంలో వేంకటేశ్వరస్వామికి సోమవారం భక్తులు తిరుప్పావడ సేవ నిర్వహించారు. తొలుత పులిహోరను స్వామి వారి ఆకారంలో వేసి మధ్యలో గారెలు, ఎండుమిరప కాయలు, పూలు, కూరగాయలు, జీడిపప్పు, పండ్లతో అందంగా అలంకరించి తిరుప్పావడ సేవను శాస్త్రోక్తంగా నిర్వహించారు. గోవింద మాలధారులు కలపర్తి లక్ష్మీ, సాయి, షన్ముఖ్, రూప, రాము, రామలక్ష్మీ తదితరులు ఈ తంతులో పాల్గొన్నారు.
Updated Date - 2023-01-03T00:04:38+05:30 IST