ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఆయకట్టుకు నీరందేనా..?

ABN, First Publish Date - 2023-08-02T00:36:54+05:30

పంటలు బాగా పండాలంటే సాగునీరు ఎంతో అవసరం. అయితే సాగుకు నీరు అందించడంలో జలాశయాల తర్వాత కీలక పాత్ర పోషించేవి చెరువులే. కానీ జిల్లాలో వాటి పరిస్థితి దయనీయంగా ఉంది.

చినమేరంగిలో చెరువు తవ్వకాల్లో పైకి ఉండిపోయిన మదుము

అనుమతుల్లేకుండానే పనులు

వాటి ద్వారా పూర్తిస్థాయిలో అందని సాగునీరు

నష్టపోతున్న రైతులు

(జియ్యమ్మవలస)

పంటలు బాగా పండాలంటే సాగునీరు ఎంతో అవసరం. అయితే సాగుకు నీరు అందించడంలో జలాశయాల తర్వాత కీలక పాత్ర పోషించేవి చెరువులే. కానీ జిల్లాలో వాటి పరిస్థితి దయనీయంగా ఉంది. సుమారు 80 శాతం వరకూ ఆక్రమణలకు గురవ్వగా.. మరోవైపు ఉపాధి హామీ పనుల వల్ల రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. నీటి పారుదల శాఖ అనుమతులు తీసుకోకుండానే చెరువుల్లో లోతుగా తవ్వకాలు చేపడుతుండడం వల్ల మదుముల ద్వారా ఆయకట్టుకు సాగునీరు వెళ్లడం లేదు. దీంతో ఏటా అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారు. చెరువుల ద్వారా పూర్తిస్థాయిలో నీరందకపోవడంతో సాగుకు ఆంటంకం ఏర్పడుతోంది.

ఇదీ పరిస్థితి..

జిల్లాలో మొత్తం 15 మండలాల ఉన్నాయి. వీటి పరిధిలో 3.20 లక్షల ఎకరాల్లో సాగు భూములు ఉన్నాయి. ఇందులో వరి 1.71 లక్షల ఎకరాలు పండిస్తుండగా, మరో 1.49 ఎకరాల్లో అరటి, చెరకు, ఇతర ఉద్యాన పంటలు పండిస్తున్నారు. ఈ ఆయకట్టుకు నీరందించే వనరుల్లో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులే అయినప్పటికీ చెరువులు కూడా అత్యంత క్రియాశీల పాత్ర పోషిస్తున్నాయి. వాటి ద్వారానే అవసరమైనప్పుడు సాగు భూములకు నీరు విడుదల చేసుకునే అవకాశం ఉంది. వర్షాలు, సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీటిని విడుదల చేస్తే ఈ చెరువుల్లోనే సాధ్యమైనంతవరకు నిల్వ ఉంచుకోవచ్చు. జిల్లాలో 100 ఎకరాల కంటే ఎక్కువ భూములకు సాగునీరందించే చెరువులు 107 ఉండగా, వీటి ద్వారా 21,591.58 ఎకరాలకు నీరందుతోంది. 100 కంటే తక్కువ ఎకరాలకు సాగునీరందిస్తున్న చెరువులు 2,749 ఉన్నాయి. వీటి ద్వారా జిల్లాలో 50,476.14 ఎకరాలకు సాగునీరందుతోంది. అంటే కేవలం చెరువుల ద్వారానే 72,067.72 ఎకరాలకు సాగునీరందుతోంది. సాగులో ఇంతటి కీలకమైన చెరువుల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ఇష్టారాజ్యంగా పనులు చేస్తున్నారు. నీటి పారుదలశాఖ అనుమతి తీసుకోకుండానే పనులు చేపట్టి చెరువుల ఆకృతి మార్చేస్తున్నారు. లోతుగా తవ్వకాలు చేపడుతుండడం వల్ల మదుములు ఎత్తులో ఉండిపోవడంతో ఆయకట్టుకు సాఫీగా సాగునీరు అందడం లేదు. దీంతో ఏటా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల మోటార్లతో నీటిని తోడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇబ్బందులు ఇలా...

ఉపాధి హామీ పథకం ద్వారా చెరువుల్లో తవ్వకాలు జరుపుతుండగా.. చాలాచోట్ల మదుములు ఎత్తులో ఉండిపోతున్నాయి. దీంతో చెరువులు లోతైపోవడంతో వాటి ద్వారా సాగు భూములకు నీరందడం లేదు. పుష్కలంగా నీరు ఉండేటప్పుడు అంటే సాగుకు అవసరం లేనప్పుడు మాత్రం సాఫీగా నీరందుతుంది. పంట చేతికందుతుందనే సమయానికి అవసరమైన నీరందకుండా పోతోంది. మరోవైపు అవసరమైన సమయాల్లో సాగునీరు వినియోగించేందుకు అవకాశం లేకుండా పోతోంది. మదుముల ద్వారా నీరు వెళ్లకుండా అడ్డుకట్ట వేయాలంటే... రైతులకు తలకు మించిన పనిగా మారింది. ఫలితంగా నీరు మదుముల స్థాయికి వచ్చేంతవరకు వృథాగా పోతోంది. దీనివల్ల పక్కనే ఉన్న ఆయకట్టు భూముల్లో ఇసుక మేటలు వేసి పంటకు ఆటంకంగా నిలుస్తున్నాయి.

చేయాల్సిన పనులివీ...

రెవెన్యూ, నీటి పారుదలశాఖ సూచనలతో ఉపాధి హామీ పథకం ద్వారా సంబంధిత అధికారులు అవసరమైన పనులు చేస్తే సాగు భూములు మరింత సస్యశ్యామలమవుతాయి. జిల్లాలో ఉన్న 2,856 చెరువుల్లో సుమారు 80 శాతం ఆక్రమణలకు గురయ్యాయి. వాటికి ముందు హద్దులు గుర్తించి ట్రెంచ్‌లు వేయాలి. ఆ చెరువు గర్భంలో ఉన్న సాగు భూమిని తవ్వి గట్లు వేయాలి. ఫలితంగా చెరువుల విస్తీర్ణం పెరిగి సాగునీటి నిల్వలు పూర్తిస్థాయిలో ఉంటాయి. కానీ ఉన్న కొద్ది పాటి చెరువులను బాగా లోతుగా తవ్వడం వల్ల మోటార్లు పెట్టుకొని నీరు తోడించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో రెవెన్యూశాఖ హద్దులను గుర్తించి ఉపాధి హామీ అధికారులకు అప్పగించినా ఆ ప్రాంతంలో పనులు మాత్రం చేయించలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని అధికారులు సాగునీటి భూములకు పూర్తిస్థాయిలో సాగునీరందేలా పనులు చేయించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.

అనుమతులు లేవు

చెరువుల్లో జరుగుతున్న పనులకు ఎప్పుడు అనుమతులు తీసుకోలేదు. ఇష్టారాజ్యంగా ఉపాధి హామీ ద్వారా పనులు చేస్తున్నారు. ఎన్నోసార్లు చెప్పినా ఫలితం లేదు.

- జీవీ రఘు, ఏఈ, నీటి పారుదలశాఖ, జియ్యమ్మవలస

===============

ఆదేశాల మేరకే..

ఉపాధి హామీ పథకం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే చెరువు పనుల్లో తవ్వకాల పనులు చేపడుతున్నాం. మెటీరియల్‌ పనులు చేయడం లేదు. ఆ పనులు చేస్తే నీటి పారుదల శాఖ అధికారుల అనుమతులు తీసుకుంటాం.

- కె.శ్రీనివాసరావు, ఏపీవో, ఉపాధి హామీ పథకం, జియ్యమ్మవలస

Updated Date - 2023-08-02T00:36:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising