అట్టపెట్టేల్లోనే..
ABN, First Publish Date - 2023-09-22T00:02:22+05:30
ప్రభుత్వం సచివాలయాలకు అందించిన ఫాగింగ్ యంత్రాలు మూలకు చేరాయి. దోమల వ్యాప్తి నివారించి, పారిశుధ్యం మెరుగుపరిచేందుకు ప్రభుత్వం వీటిని అందించింది. అయితే అధికారులు వీటి వినియోగంపై శ్రద్ధ చూపకపోవడంతో అట్ట పెట్టెల్లోనే భద్రంగా ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
- వినియోగంపై సిబ్బందికి కొరవడిన అవగాహన
- దోమలతో ప్రజల ఇబ్బందులు
( కొమరాడ )
ప్రభుత్వం సచివాలయాలకు అందించిన ఫాగింగ్ యంత్రాలు మూలకు చేరాయి. దోమల వ్యాప్తి నివారించి, పారిశుధ్యం మెరుగుపరిచేందుకు ప్రభుత్వం వీటిని అందించింది. అయితే అధికారులు వీటి వినియోగంపై శ్రద్ధ చూపకపోవడంతో అట్ట పెట్టెల్లోనే భద్రంగా ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో మురుగునీరు బయటకుపోయే మార్గాలు లేవు. దీంతో దోమల వ్యాప్తి అధికమైంది. తరచూ విద్యుత్ సరఫరాలో అంతరాయంతో రాత్రిపూట ప్రజలు దోమలతో యుద్ధం చేయాల్సి వస్తోంది. జిల్లాలోని 452 గ్రామ పంచాయతీల పరిధిలోని 350 గ్రామ సచివాలయాలకు ప్రభుత్వం ఫాగింగ్ యంత్రాలను సరఫరా చేసింది. అయితే వాటి వినియోగంపై సిబ్బందికి అవగాహన లేకపోవడంతో అవి మూలకు చేరాయి. కొన్ని గ్రామాల్లో ప్యాకింగ్ సీలు కూడా విప్పలేదు. ఫాగింగ్ యంత్రాలు ఎలా వాడాలో పంచాయతీ సిబ్బందికి శిక్షణ ఇవ్వలేదు. సరైన అవగాహన లేకుండా వాడలేమంంటూ పారిశుధ్య కార్మికులు వాటి జోలికి వెళ్లడం లేదు. పంచాయతీలకు భారంగా మారడంతోనే ఫాగింగ్ యంత్రాలను వినియోగించడం లేదని సిబ్బంది చెబుతున్నారు. ఒక యంత్రంలో ఐదు లీటర్ల డీజిల్, ఒక లీటరు పెట్రోల్ పోయాలని, అందుకు గాను రూ.600కు పైగా ఖర్చు అవుతుందని చెబుతున్నారు. ఐదు లీటర్ల డీజిల్ 45 నుంచి 50 నిమిషాలు మాత్రమే వస్తుందంటున్నారు. మేజర్ పంచాయతీల్లో ఒకట్రెండు వీధుల్లో ఫాగింగ్ చేసేసరికి ఆయిల్ అయిపోతుందని, దీంతో వాటిని వినియోగించడం లేదని పంచాయతీ పాలకవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించింది. దీంతో నిధులు లేక గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ అంతంత మాత్రంగానే ఉంది. కొన్ని గ్రామాల్లో అధిక శాతం చెత్తను రహదారులపై, కాలువల్లో పడేస్తున్నారు. దీంతో వర్షపు నీరు ఆవాస ప్రాంతాల్లో నిలిచిపోయి దోమల బెడద తీవ్రమవుతుంది. పగలు, రాత్రి తేడా లేకుండా దోమలు దాడి చేస్తుండడంతో ప్రజలు జ్వరాల బారినపడి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి గ్రామాల్లో దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలను వినియోగించాలని కోరుతున్నారు.
ఫాగింగ్ యంత్రాలను వినియోగిస్తున్నాం
జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీల్లో ఫాగింగ్ యంత్రాలను వినియోగిస్తున్నాం. మరికొన్ని చోట్ల వినియోగించడం లేదు. వాటిని కూడా వినియోగించాలని సిబ్బందికి సూచించాం. వీటి వినియోగంపై సంబంధిత ఏజెన్సీ పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వకపోవడం వాస్తవమే.
-బలివాడ సత్యనారాయణ, జిల్లా పంచాయతీ అధికారి
Updated Date - 2023-09-22T00:02:22+05:30 IST