ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఏడాది పూర్తి.. అభివృద్ధి ఏదీ?

ABN, First Publish Date - 2023-04-03T23:59:38+05:30

జిల్లా ఏర్పడిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుందని అంతా భావించారు. కానీ డివిజన్‌గా ఉన్న సమయంలో ప్రారంభించిన అభివృద్ధి పనులు కూడా పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. ఏడాది అవుతున్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో పాలన గాడిన పడలేదనే చెప్పాలి.

కలెక్టర్‌ కార్యాలయం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

వసతుల కల్పనపై దృష్టి సారించని సర్కారు

నిధుల కేటాయింపు అంతంతమాత్రమే..

ప్రభుత్వ కార్యాలయాలకు సొంతగూడు కరువు

ప్రాజెక్టులు, వంతెనల నిర్మాణాల్లో కానరాని పురోగతి

పడకేసిన పర్యాటకం

ఐటీడీఏల ద్వారా గిరిజనులకు పూర్తిస్థాయిలో అందని సేవలు

(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)

పార్వతీపురం... గతంలో విజయనగరం జిల్లాలోని మన్యం ప్రాంతానికి ముఖద్వారం. పూర్తి స్థాయిలో అదే మన్యం జిల్లాకు కేంద్రంగా అవతరించి ఏడాది పూర్తయింది. గతేడాది ఇదే నెలలో ఇదే రోజున కొత్త జిల్లా పురుడు పోసుకుని.. నూతన పాలనకు అంకురార్పణ జరిగిన విషయం తెలిసిందే. 15 మండలాలు, ఒక నగర పంచాయతీ, రెండు పురపాలక సంఘాలతో పార్వతీపురం కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా మన్యం జిల్లాను ఏర్పాటు చేసింది. అయితే ఆ స్థాయిలో మౌలిక వసతులు కల్పించలేదు. దీంతో నేటికీ కొత్త జిల్లాను అనేక సమస్యలు వేధిస్తున్నాయి. మన్యం జిల్లా ఏర్పాటై నేటితో ఏడాది పూర్తయిన సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి ’ ప్రత్యేక కథనం.

జిల్లా ఏర్పడిన తర్వాత అభివృద్ధి పరుగులు పెడుతుందని అంతా భావించారు. కానీ డివిజన్‌గా ఉన్న సమయంలో ప్రారంభించిన అభివృద్ధి పనులు కూడా పూర్తికాని పరిస్థితి ఏర్పడింది. ఏడాది అవుతున్నప్పటికీ ఇంకా పూర్తిస్థాయిలో పాలన గాడిన పడలేదనే చెప్పాలి. టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌లతో రాష్ట్రస్థాయి అధికారులు హడావుడి చేయడం తప్ప కొత్త జిల్లాకు నిధులు మంజూరు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఉపాధి, ఉద్యోగావశాలు లేకపోవడంతో ఎంతోమంది వలస బాట పడుతున్నారు. జిల్లా ఏర్పడక ముందు సాలూరు, కురుపాం సీహెచ్‌సీలను అప్‌గ్రేడ్‌ చేస్తూ పనులను ప్రారంభించారు. అయితే ఆ పనులు నేటికీ నత్తనడకగానే జరుగుతున్నాయి. గిరిజన ప్రాంతాల్లో రహదారి నిర్మాణాలకు ప్రత్యేక నిధులు కేటాయించకపోవడంతో గిరిపుత్రులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర వేళల్లో ఇప్పటికీ వారికి డోలీ మోతలు తప్పడం లేదు. జిల్లా ఏర్పడిన తర్వాత పూర్తిచేసిన రహదారుల పనులు సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యాయని చెప్పొచ్చు. తాగునీటికి సంబంధించి ఇంటింటి కొళాయి పనులు కూడా ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు. పీహెచ్‌సీల పరిధిలో వైద్య సేవలు అంతంతమాత్రంగానే అందుతున్నాయి. ఇక పర్యాటక ప్రగతి కాగితాలకే పరిమితమైంది.

సొంత గూడు కరువు

జిల్లాకేంద్రం పార్వతీపురంలో కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలకు తప్ప మిగిలిన అనేక శాఖలు అద్దెభవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలకు నేటికీ సొంత భవనాలు లేవు. ఇప్పటికీ అద్దెభవనాల్లోనే కొన్ని శాఖలను నిర్వహిస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయాన్ని పార్వతీపురం మండలం నర్సిపురం గ్రామ సచివాలయంలోనే ఒక గదిలో నిర్వహిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. కలెక్టరేట్‌తో పాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల కోసం స్థల పరిశీలన పూర్తయినప్పటికీ ఎటువంటి పనులు ప్రారంభం కాలేదు.

శిలాఫలకానికే పరిమితం

జిల్లా కేంద్రంలో మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం శిలాఫలకానికే పరిమితమైంది. ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు ఒక్క రాయి కూడా వేయలేదు. జిల్లా ఏర్పాటైన కొత్తలో పార్వతీపురంలో ఆస్పత్రి నిర్మాణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ భవనాలను ఖాళీ చేయించేందుకు రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా యంత్రాంగంపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. దీంతో జిల్లా కేంద్ర ఆస్పత్రి ద్వారా త్వరితగతిన సేవలు అందుతాయని ఆశించిన జిల్లావాసులకు నిరాశే ఎదురైంది.

గిరిజనులకు ఒరిగిందేమిటి?

నూతన జిల్లాగా ఏర్పడినప్పటికీ పార్వతీపురం మన్యంలో గిరిజనులకు ఒరిగిందేమీ లేదనే చెప్పొచ్చు. మన్యం జిల్లాగా ఏర్పడిన తర్వాత ఐటీడీఏల ద్వారా గిరిజనులకు పూర్తిస్థాయిలో సేవలు అందడం లేదు. సబ్సిడీలతో కూడిన ట్రైకార్‌ తదితర రుణాలు అందించడం లేదు. ఏజెన్సీ ప్రాంతాల్లో నిరుద్యోగ యువతకు శిక్షణ కోసం ఏర్పాటుచేసిన యూత్‌ ట్రైనింగ్‌ (వైటీసీ) కేంద్రాలు ప్రభుత్వ కార్యాలయాలుగా మారిపోయాయి. మరోవైపు పార్వతీపురం, సీతంపేట కేంద్రాలుగా పనిచేస్తున్న ఐటీడీఏల నిర్వహణకు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదు. దీంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. ఇదిలా ఉండగా మూడు నెలలకొకసారి నిర్వహించాల్సిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశాన్ని పూర్తిగా అధికారులు మర్చిపోయారు. ఏడాది కాలంలో గిరిజన ప్రాంతాల్లో రహదారులు, తదితర అభివృద్ధి పనులను చేపట్టడం లేదు. సుమారు పది బీటీ రహదారులకు మాత్రమే మోక్షం కలిగించారు. కాగా ఏదైనా ప్రమాదంలో గిరిజనులు మృతి చెందితే ఆస్పత్రి నుంచి తరలించేందుకు ఐటీడీఏ ద్వారా అంబులెన్స్‌లను కూడా ఏర్పాటు చేయడం లేదు. దీంతో ఇటీవల కొమరాడ మండలానికి చెందిన గిరిజనులు మృతదేహాలతో పార్వతీపురం ఐటీడీఏ వద్ద నిరసన చేపట్టాల్సి వచ్చింది. అదే మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు గిరిజనులు మృతి చెందినప్పటికీ ఇప్పటివరకు బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఎటువంటి ఆర్థిక సాయం ప్రకటించలేదు. వారికి అధికారులు, ప్రజాప్రతినిధుల ఓదార్పు కూడా కరువైంది.

ఇసుక దోపిడీలో అగ్రస్థానం

ఇసుక దోపిడీలో జిల్లా అగ్రస్థానంలో నిలిచిందని చెప్పొచ్చు. గతంలో ఎన్నడూ లేని విధంగా జోరుగా అక్రమ రవాణా, తవ్వకాలు జరిగినా స్పందించే వారే కరువయ్యారు. వాస్తవంగా గత ఏడాది జూన్‌ 13తో జేపీ కనస్ట్రక్షన్స్‌ సంస్థకు కొమరాడ మండలం కేఆర్‌బీ పురం వద్ద ఇసుక తవ్వకాలకు అనుమతులు ముగిశాయి. అయితే కురుపాం నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ కీలక నేత కన్నుసన్నల్లో యథావిధిగానే ఇసుక తవ్వకాలు, అక్రమ రవాణా జరుగుతున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయాలని టీడీపీ, సీపీఎం, జనసేన నాయకులు పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా సం బంధితఅధికారులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇదే అదునుగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. గతంలో పాలకొండ మండలంలో పోలీసులు దాడి చేసి పెద్దఎత్తున ఇసుక లారీలను సీజ్‌ చేసిన తర్వాత కూడా ఇసుకాసురులు వెనక్కి తగ్గడం లేదు. ఇసుకతో పాటు గ్రావెల్‌, మట్టి దందాను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.

నిలిచిన వంతెనల పనులు

సకాలంలో బిల్లుల చెల్లింపు కాకపోవడంతో జిల్లాలోని సీతానగరం వద్ద వంతెన పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. దీంతో అటు ఒడిశా, ఇటు విశాఖకు చేరుకోవాలనే వారు నరకం చూస్తున్నారు. ప్రస్తుతం బ్రిటిష్‌ కాలం నాటి బ్రిడ్జి మీదుగా రాకపోకలు సాగిస్తున్నప్పటికీ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. నిత్యం ఇక్కడ ట్రాఫిక్‌ స్తంభిస్తుండడంతో వాహనదారులకు నిరీక్షణ తప్పడం లేదు. అదేవిధంగా కొమరాడ మండలంలోని పూర్ణపాడు-లాబేసు వంతెనకు కూడా మోక్షం లభించడం లేదు. దీంతో సుమారు తొమ్మిది పంచాయతీలు, 52 గ్రామస్థులు నానా అవస్థలు పడుతున్నారు. కురుపాం మండలం సీమనాయుడు వలస నుంచి చుట్టూ తిరిగి పార్వతీపురం జిల్లాకేంద్రానికి చేరుకోవాల్సి వస్తోంది. ఇందుకు గాను వారు 35 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. గెడ్డలుప్పి వంతెన నిర్మాణం పూర్తయినా అప్రోచ్‌ రోడ్డు పనులు జరగలేదు. ఇలా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో వంతెన నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. దీంతో ఆయా ప్రాంతవాసులు జిల్లా, మండల కేంద్రాలకు చేరుకోవడానికి అష్టకష్టాలు పడాల్సి వస్తోంది.

నత్తనడకన ‘ఏకలవ్య’ నిర్మాణాలు

కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైన ఏకలవ్య పాఠశాలల భవన నిర్మాణాలు కూడా నత్తనడకగానే సాగుతున్నాయి. కోట్లాది రూపాయలు అందుబాటులో ఉన్నా.. పనులు మాత్రం పూర్తిచేయించలేని పరిస్థితిలో జిల్లా అధికార యంత్రాంగం ఉంది. జిల్లాలోని కురుపాం, సాలూరు, పాచిపెంట మండలాల్లో ఏకలవ్య పాఠశాలలకు సొంత భవనాలు ఎప్పుడు ఏర్పాటవుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఏటా ఆయా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. సొంత భవనాలు అందుబాటులోకి రాకపోకవడంతో వారికి వసతి సమస్య వేధిస్తోంది.

సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం

కొత్త జిల్లా ఏర్పడిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులకు మోక్షం లభిస్తుందని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. జిల్లాలోని జంఝావతి, తోటపల్లి వంటి ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల పనులను పూర్తి చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. బడ్జెట్‌లో నిధుల కేటాయింపులు.. చెల్లింపులకు భారీ వ్యత్యాసం చూపుతోంది. దీంతో నత్తనడకన పనులు సాగుతున్నాయి. మొత్తంగా ఆయా ప్రాజెక్టుల ద్వారా పూర్తిస్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందడం లేదు. రైతులు వరుణుడిపైనే ఆధారపడి పంటలు సాగు చేసుకోవాల్సిన దుస్థితి. గత ఏడాది జంఝావతి ప్రాజెక్టుకు గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రూ.3.26కోట్లు కేటాయిం చినప్పటికీ కనీసం రూ.30లక్షలు కూడా చెల్లించని పరిస్థితి. తోటపల్లి ప్రాజెక్టు పెండింగ్‌ పనుల కోసం గత బడ్జెట్లో రూ.124.61కోట్లు కేటాయించినప్పటికీ పూర్తిస్థాయిలో రూ.20కోట్లు ప్రభుత్వం మంజూరు చేయలేదు. దీంతో గత ఏడాది కాలంలో ప్రధాన సాగునీటి ప్రాజెక్టుల వద్ద అభివృద్ధి పనులేమీ పెద్దగా చేపట్టలేదని చెప్పొచ్చు.

Updated Date - 2023-04-03T23:59:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising