విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే వరకూ పోరాటం
ABN, First Publish Date - 2023-04-20T02:01:40+05:30
రాష్ట్ర ప్రజల ఆస్తిగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేయాలని, అప్పటి వరకు పోరాటాలు కొనసాగిస్తామని రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు.
మే 3న రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలు
రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాల
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
విజయవాడ (గవర్నర్‌పేట), ఏప్రిల్ 19: రాష్ట్ర ప్రజల ఆస్తిగా ఉన్న విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ప్రతిపాదనల్ని కేంద్ర ప్రభుత్వం నిలుపుదల చేయాలని, అప్పటి వరకు పోరాటాలు కొనసాగిస్తామని రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. కేంద్రంపై పోరాటం ఉధృతం చేసే కార్యాచరణలో భాగంగా మే 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా రాస్తారోకోలు నిర్వహించి కేంద్రానికి నిరసన తెలియజేయాలని వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నేత లు పిలుపునిచ్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో బుధవారం విజయవాడలోని బాలోత్సవ్ భవన్‌లో ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు అధ్యక్షతన రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. కేంద్రంపై ఒత్తిడి తెచ్చే పోరాటంలో రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు భాగస్వాములు కావాలని సమావేశంలో తీర్మానించారు. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ, పోలవరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి కేంద్ర పెద్దలతో మాట్లాడాలన్నారు. జగన్ ఢిల్లీ వెళితే ఈసారి అఖిలపక్ష నాయకుల్ని తీసుకువెళ్లాలని డిమాండ్ చేశారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ గతంలో అనేకమార్లు కేంద్రం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు చూస్తే నాటి ప్రభుత్వాలు అడ్డుకున్నాయని, ఇప్పటి వైసీపీ ప్రభుత్వం కనీసం బాధ్యత కూడా తీసుకోవడం లేదన్నారు.
గతంలో ప్రైవేటీకరణ నిర్ణయాలను కాంగ్రెస్ సీఎంలు, చంద్రబాబు వ్యతిరేకిస్తే జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ అందరూ కలిసి కట్టుగా ఆందోళనల ద్వారా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరారు. ఆందోళనల ద్వారా కేంద్రంపై ఒత్తిడి తేవాలని, మే 3న చేపట్టే ఆందోళనకు అన్ని రాజకీయ పార్టీలు భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ ఉద్యమానికి పూర్తి సహకారం అందించాలన్నారు. ఏఐసీసీ సభ్యుడు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ విషయంలో కూడా కలిసి పోరాడకుంటే రాష్ట్ర ప్రజలు రాజకీయ నేతల్ని నమ్మరన్నారు. రాష్ట్ర ప్ర యోజనాల కోసం తమిళనాడు తరహాలో ఐక్యపోరాటాలకు అన్ని పక్షాలు ఏకం కావాలన్నారు. వైసీపీ నేత పి.గౌతంరెడ్డి మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఫ్యాక ్టరీ విషయంలో కార్మిక వర్గంతో చర్చలు చేసిన ఏకైక పార్టీ వైసీపీ అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఢిల్లీ వెళ్లి కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు.
Updated Date - 2023-04-20T02:01:40+05:30 IST