Gannavaram Tdp: గన్నవరంలో వైసీపీ విధ్వంసం
ABN, First Publish Date - 2023-02-21T02:48:42+05:30
కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. గన్నవరం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విధ్వంసానికి తెగబడ్డారు.
పోలీసుల సమక్షంలో వంశీ అనుచరుల అరాచకం
టీడీపీ కార్యాలయంపై వంద మందికిపైగా దాడి
రాడ్లు, కర్రలతో రెచ్చిపోయిన వైసీపీ మూకలు
ఫర్నిచర్ ధ్వంసం.. కార్లపై పెట్రోలు పోసి దహనం
బీసీ నేతను చంపేస్తామంటూ ఫోన్లో బెదిరింపులు
ఆ వెంటనే మారణాయుధాలతో ఇంటికి
ఆయన లేకపోవడంతో భార్యకు వార్నింగ్
దాడిలో పాల్గొన్న వంశీ ప్రధాన అనుచరులు
నిరసనకు దిగిన టీడీపీ నేతలపై రాళ్ల వర్షం
విజయవాడ/గన్నవరం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జిల్లా గన్నవరంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. గన్నవరం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా విధ్వంసానికి తెగబడ్డారు. పక్కా వ్యూహంతో టీడీపీ బీసీ నాయకులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడ్డారు. ఆ పార్టీ నియోజకవర్గ కార్యాలయాన్ని సైతం ధ్వంసం చేశారు. నాయకుల కార్లను తగులబెట్టారు. ఈ మొత్తం అరాచకమంతా టీడీపీ టికెట్‌పై గెలిచి.. ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నేతృత్వంలోనే సాగడం గమనార్హం. కళ్ల ఎదుటే వైసీపీ మూకలు ధ్వంసం చేస్తున్నా.. పోలీసులు కళ్లప్పగించి చూశారు తప్ప అడ్డుకోలేదు.
గన్నవరం ఎమ్మెల్యే వంశీని స్థానిక టీడీపీ నేతలు విమర్శించారన్న సాకుతో ఆయన అనుచరులు రెచ్చిపోయారు. సోమవారం ఉదయం టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ బీసీ నాయకుడు దొంతు చిన్నకు ఎమ్మెల్యే అనుచరుడొకరు ఫోన్ చేశారు. ‘వంశీని విమర్శించే స్థాయి ఉందా నీకు..? నీ అంతు చూస్తాం’ అని బెదిరించారు. తర్వాత ఇంకొందరు వంశీ అనుచరులమంటూ ఫోన్ చేసి బూతులు తిట్టారు. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే వంశీ అనుచరులు సుమారు 10 మంది మారణాయుధాలతో చిన్న ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన లేకపోవడంతో ఆయన భార్య రాణితో అసభ్యకరంగా ప్రవర్తించారు. వంశీ గురించి మాట్లాడితే నీ భర్త అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చారు. దీంతో ఆందోళనకు గురైన ఆమె.. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు గన్నవరం పోలీసుస్టేషన్‌కు వెళ్లారు. ఆమెతోపాటు పలువురు టీడీపీ నాయకులు కూడా అక్కడకు చేరుకున్నారు. గన్నవరం టీడీపీ ఇన్‌చార్జి బచ్చుల అర్జునుడు అనారోగ్యంతో ఆస్పత్రిలో ఉండడంతో నియోజకవర్గ శ్రేణులకు అండగా నిలిచేందుకు టీడీపీ రాష్ట్ర నాయకుడు కొమ్మారెడ్డి పట్టాభిరాం సాయంత్రం 5 గంటలకు నేరుగా స్టేషన్‌కు చేరుకున్నారు. అదే సమయంలో వంశీ అనుచరులు ఓలుపల్లి మోహనరంగా అలియాస్ రంగా, భీమవరపు యేతేంద్ర రామకృష్ణ అలియాస్ రాము, మూల్పూరి ప్రభుకాంత్, రౌడీ షీటర్ యూసుబ్, కొల్లి చిట్టిబాబు, సగ్గుర్తి నాగదీపు, కోటి తదితరులు టీడీపీ నియోజకవర్గ కార్యాలయంపై రాడ్లు, కర్రలతో దాడికి తెగబడ్డారు. ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. ఆవరణలో ఉన్న టీడీపీ నాయకుల కార్ల అద్దాలు పగులగొట్టి పెట్రోలు పోసి తగులబెట్టారు. 5 కార్లలో ఎనికేపాడుకు చెందిన టీడీపీ నాయకుడు కోనేరు పెదబాబు కారు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. సుమారు గంటపాటు విధ్వంసం కొనసాగింది. వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన టీడీపీ నాయకురాలు మండవ లక్ష్మి ముక్కుపై కొట్టడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. మరో టీడీపీ నాయకుడు అంజిబాబు ఛాతీపై కర్రలతో దాడి చేశారు. బుస్సే సరిత, పొదిలి లలిత, మండవ రమ్యకృష్ణ కూడా గాయాలపాలయ్యారు.
పోలీసుల ప్రేక్షకపాత్ర
టీడీపీ కార్యాలయంపై దాడి విషయం తెలిసిన వెం టనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అయితే వంశీ అనుచరులను నిలువరించడానికి ఏ మాత్రం ప్రయత్నించలేదు. పైగా టీడీపీ నాయకులు, కార్యకర్తలపై జు లుం ప్రదర్శించారు. సీఐ కనకారావు స్వయం గా తన ప్రతాపం చూపారు. ఓ దశలో టీడీపీ రూరల్ మండల కార్యదర్శి కోనేరు సందీ్‌పపై దాడి చేయబోయారు.
హైవేపై టీడీపీ ఆందోళన..
తమ కార్యాలయంపై దాడికి నిరసనగా టీడీపీ కార్యకర్తలు 16వ నంబరు జాతీయ రహదారిపై గన్నవరం సెంటర్‌లో ఆందోళనకు దిగారు. వంశీ అనుచరులు కూడా అక్కడకు పెద్ద ఎత్తున చేరుకుని రాళ్లతో దాడిచేశారు. టీడీపీ శ్రేణులు సైతం ఎదురుదాడికి దిగాయి. పోలీసులు అదుపు చేయకపోవడంతో జాతీయ రహదారిపై సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ నేత పట్టాభిపైనా వైసీపీ మూకలు దాడికి తెగబడ్డాయి. అయితే పోలీసులు ఆయన్నే అరెస్టు చేసి తీసుకెళ్లారు.
పక్కా ప్రణాళికతోనే..
టీడీపీ బీసీ నాయకుడిపై దాడితోపాటు పార్టీ కార్యాలయంపై దాడికి వంశీ అనుచరులు పక్కా వ్యూహరచన చేశారు. నియోజకవర్గ పరిధిలోని వైసీపీ కార్యకర్తలు, నాయకులకు సోమవారం ఉదయమే గన్నవరం వంశీ కార్యాలయం నుంచి మెసేజ్‌లు వెళ్లాయి. మధ్యాహ్నం 3 గంటలకు సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ ఉందని, ఆ తర్వాత విలేకరుల సమావేశం ఉందని, అందరూ తప్పకుండా రావాలని సూచించారు. దీంతో నియోజకవర్గ వ్యాప్తంగా 100 మందికిపైగా నాయకులు, కార్యకర్తలు మధ్యాహ్నం 3 గంటలకు వంశీ కార్యాలయానికి చేరుకున్నారు. సాయంత్రం 4 గంటల సమయంలో విధ్వంసం ప్రారంభమైంది. తర్వాత గంటకు సీను జాతీయ రహదారిపైకి మారింది. అక్కడ 3 గంటలపాటు వైసీపీ మూకలు రెచ్చిపోయాయి.
Updated Date - 2023-02-21T04:14:28+05:30 IST