జీతాలు ఇవ్వలేరట!
ABN, First Publish Date - 2023-03-03T00:01:14+05:30
ఐటీడీఏల పరిధిలోని ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ విభాగంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు రాష్ట్రస్థాయి అధికారులు షాక్ ఇచ్చారు. ఇకపై వారికి జీతాలు ఇవ్వలేమని తేల్చేశారు.
ఇకపై వేతనాలు ఇవ్వలేమని తేల్చేసిన రాష్ట్రస్థాయి అధికారులు
తాజాగా ఉత్తర్వులు జారీ
కలెక్టర్ నిర్ణయంపై ఆధారపడిన సిబ్బంది భవితవ్యం
(పార్వతీపురం- ఆంధ్రజ్యోతి)
ఐటీడీఏల పరిధిలోని ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ విభాగంలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు రాష్ట్రస్థాయి అధికారులు షాక్ ఇచ్చారు. ఇకపై వారికి జీతాలు ఇవ్వలేమని తేల్చేశారు. దీనిపై పీఆర్‌అండ్ ఆర్డీ కమిషనర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలో ఆయా సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. తమ పరిస్థితేమిటని ప్రశ్నిస్తున్నారు. దీర్ఘకాలికంగా పనిచేస్తున్న తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇదీ పరిస్థితి..
వాస్తవంగా జిల్లాలోని పార్వతీపురం, సీతంపేట ఐటీడీఏల పరిధిలో సుమారు 46మంది టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వారంతా రెండు దశాబ్దాలుగా పనిచేస్తున్నప్పటికీ ఉద్యోగ భద్రత లేదు. ఉపాధిహామీ పథకంలో మెటీరియల్ విభాగం నుంచి అడ్మినిస్ర్టేటివ్ కోసం కేటాయించిన రెండు శాతం నిధుల్లోనే వేతనాలు అందుకుంటున్నారు. అయితే ఇకపై అలా జీతాలు ఇవ్వలేమని రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉపాధి హామీ పథకం కోసం ఐటీడీఏల ద్వారా ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమించిన సిబ్బంది అవసరం ఇప్పుడు లేదని ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రస్తుతం డీసీసీ వ్యవస్థ అమలులో లేదు. బిల్లులన్నీ (ఎంసీసీ) మండల కంప్యూటర్ సెంటర్ ద్వారా అప్‌లోడ్ అవుతున్నాయి. ఇప్పటికే డ్వామా పరిధిలో ఉపాధి హామీ పథకంలో అనేక మంది సిబ్బంది పనిచేస్తున్నారు. బడ్జెట్ పరిమితుల దృష్యా ఐటీడీఏల్లోని ‘ఉపాధి’ ఎంసీసీల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్ సిబ్బంది లేదా గ్రామ సచివాలయాల్లో ఉన్న సిబ్బంది సేవలను వినియోగించుకోవాలని ఆదేశాల్లో స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఐటీడీఏల పరిధిలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లు , కంప్యూటర్ అపరేటర్లను లైన్ డిపార్ట్‌మెంట్‌లోకి తీసుకోవాలా లేదా అన్న విషయాలను కలెక్టర్లతో సంప్రదించి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో వారు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. తాజా ఆదేశాల ప్రకారం వారి భవిత్వం కలెక్టర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.
ఆదేశాలు రావడం వాస్తవమే..
ప్రత్యేకంగా బడ్జెట్ లేని కారణంగా ఐటీడీఏల పరిధిలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్లకు జీతాలు కేటాయింపు లేదు. వారిని ఖాళీగా ఉన్న పోస్టుల్లో సర్దుబాటు చేయాలని ఆదేశాలు రావడం వాస్తవమే. ఆయా సిబ్బందిని ఖాళీగా ఉన్న ప్రాంతాల్లో నియమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
- విష్ణుచరణ్, పీవో, ఐటీడీఏ, పార్వతీపురం
Updated Date - 2023-03-03T00:01:14+05:30 IST