గాడిన పడేనా?
ABN, First Publish Date - 2023-06-26T23:59:22+05:30
ప్రజా పంపిణీ బియ్యం ఇప్పటికీ పక్కదారి పడుతూనే ఉన్నాయి. సరఫరా విధానంలో ఎన్ని మార్పులు తెచ్చినా అక్రమ రవాణా, అమ్మకాలు తగ్గడం లేదు. ఇటు కార్డుదారులకు గోధుమ పిండి, కంది పప్పు పూర్తిస్థాయిలో చేరడం లేదు.
నిత్యం పట్టుబడుతున్న రేషన్ బియ్యం
కార్డుదారులకు పంపిణీ కాని గోఽధుమ పిండి
కొత్త రైస్‌కార్డుల కోసం పేదల నిరీక్షణ
నేడు జిల్లాకు పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి రాక
కలెక్టరేట్, జూన్ 26: ప్రజా పంపిణీ బియ్యం ఇప్పటికీ పక్కదారి పడుతూనే ఉన్నాయి. సరఫరా విధానంలో ఎన్ని మార్పులు తెచ్చినా అక్రమ రవాణా, అమ్మకాలు తగ్గడం లేదు. ఇటు కార్డుదారులకు గోధుమ పిండి, కంది పప్పు పూర్తిస్థాయిలో చేరడం లేదు. కొత్త రైస్ కార్డుల కోసం నెలలుగా పేదలు ఎదురుచూస్తున్నారు. 2021-22 ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం విక్రయించిన రైతులు తమకు ప్రభుత్వం చెల్లించాల్సిన హమాలీలు, రవాణా చార్జీల కోసం విన్నపాలు ఇస్తూనే ఉన్నారు. ఇలా పౌర సరఫరాల శాఖలో అనేక సమస్యలు ఉన్నాయి. జిల్లాకు మంగళవారం వస్తున్న పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఈ సమస్యలకు ఏదైనా పరిష్కారం చూపిస్తారేమోనన్న ఆశతో లబ్ధిదారులు నిరీక్షిస్తున్నారు.
జిల్లాలో 5,74,625 రైస్ కార్డులు ఉన్నాయి. 1249 రేషన్ డిపోల నుంచి 370 ఎండీయూల ద్వారా ఇంటింటా సరుకులు పంపిణీ చేపడుతున్నారు. ప్రతి నెల బియ్యంతో పాటు పంచదార, కంది పప్పు సరఫరా చేస్తున్నారు. కంది పప్పు అందరికీ చేరడం లేదు. మరోవైపు చాలా చోట్ల బియ్యం అక్రమంగా రవాణా అవుతున్నాయి. పట్టుబడిన చోట అధికారులు 6(ఏ) కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లాలో మొట్టమొదటిగా ఈఏడాది ఫిబ్రవరి నుంచి విజయనగరం, నెల్లిమర్ల, బొబ్బిలి, రాజాం మున్సిపాలిటీల్లో చౌక ధరల దుకాణాల ద్వారా గోఽధుమ పిండి పంపిణీ మొదలు పెట్టారు. ఒక్కో కార్డుకు కిలో రూ.16 చొప్పున రెండు కిలోలు అందజేశారు. గతనెలలో గోధుమ పిండి సరఫరా నిలిపివేశారు. గోధుమ పిండి కిలో బయట మార్కెట్‌లో రూ.55 ఉండగా, రేషన్ డిపోల ద్వారా రూ.16కు అందజేసేవారు. డిపోల ద్వారా పంపిణీ నిలిపివేయడంతో కార్డుదారులు చేసేదిలేక మార్కెట్‌లో కొనుగోలు చేసుకుంటున్నారు.
- జిల్లాలో 2021-22 ఖరీఫ్ సీజన్‌లో జిల్లాలోని 76 వేల మంది రైతుల నుంచి 4 లక్షలు 21 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించారు. అందుకు గాను రూ.650 కోట్లు చెల్లించినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. అయితే హమాలీలకు, రవాణా చార్జీల చెల్లింపులు నేటికీ జరగలేదు. జిల్లా వ్యాప్తంగా 52 వేలమంది రైతులకు రవాణా చార్జీల కింద రూ.20 కోట్లు, హమాలీల చార్జీలు కింద రూ.5కోట్లు రైతులకు రావాల్సి ఉందని రైతు సంఘం నాయకులు వెల్లడిస్తున్నారు.
- జనవరి నెల నుంచి ఇప్పటి వరకూ జిల్లా వ్యాప్తంగా దాదాపు 4,267 మంది కొత్త రైస్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరికి కార్డులు పంపిణీ చేయాల్సి ఉంది.
- జిల్లాలో చాలా పెట్రోల్ బంకుల్లో సరైన సదుపాయాలు లేవు. వీటిపై సివిల్ సప్లయ్ అధికారులు తనిఖీ చేయాల్సి ఉంది. గ్యాస్ సిలెండర్ల డోర్ డెలివరీ పేరిట అదనపు వసూళ్లు కూడా జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్యలపై మంత్రి ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు భావిస్తున్నారు. మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మంగళవారం ఉదయం 11 గంటలకు కలెక్టరేట్‌లో ఆరు జిల్లాలకు చెందిన పౌర సరఫరాల శాఖ అధికారులు, జిల్లా మేనేజర్లతో ప్రాంతీయ సమావేశం నిర్వహించనున్నారు.
----------------------
Updated Date - 2023-06-26T23:59:22+05:30 IST