ప్రశాంతంగా ...
ABN, First Publish Date - 2023-04-03T23:59:35+05:30
జిల్లాలో సోమవారం ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి.
పార్వతీపురంలో ప్రత్యేక కంట్రోల్ రూం ఏర్పాటు
పార్వతీపురం, ఏప్రిల్ 3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సోమవారం ప్రశాంతంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తంగా 64 కేంద్రాల్లో 10,809 మంది విద్యార్థులు పరీక్షలు రాయాల్సి ఉండగా, 10,776 మంది హాజరయ్యారు. అత్యధికులు పరీక్షల సమయానికి ముందే కేంద్రాలకు హాజరయ్యారు. కొందరు తల్లిదండ్రులతో కలిసి కేంద్రాలకు చేరుకున్నారు. అయితే విద్యార్థులు మినహా ఎవరినీ లోపలికి అనుమతించలేదు. కాగా మారుమూల గ్రామాల్లో విద్యార్థులకు రవాణా కష్టాలు తప్పలేదు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించి ఉరుకుల, పరుగుల మీద పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలోని 9కేంద్రాల్లో పరీక్షల తీరును డిప్యూటీ డీఈవో బ్రహ్మాజీరావు ఆధ్వర్యంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు పరిశీలించాయి. సీతానగరం మండలంలో మూడు పరీక్షా కేంద్రాలను డీఈవో రమణ సందర్శించారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థుల హాజరును పరిశీలించారు. పరీక్షల నిర్వహణలో సమస్యలేమైనా ఎదురైతే యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం అధికారిగా పెంట రామూర్తి నియామకమయ్యారు. ఇదిలా ఉండగా పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
ఒత్తిడికి గురవ్వకుండా చూడాలి: కలెక్టర్
గరుగుబిల్లి : మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ నిశాంత్‌కుమార్ సోమవారం సందర్శించారు. విద్యార్థులు ఒత్తిడికి గురవ్వకుండా పరీక్షలు రాసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పరీక్షలు రాసే విద్యార్థులు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణించొచ్చని చెప్పారు. అన్ని రూట్లలో విధిగా ఆర్టీసీ బస్సులను నడపాలని ప్రజా రవాణా అధికారిని ఆదేశించామన్నారు. ఏపీ ఓపెన్ స్కూల్ టెన్త్ పరీక్షలకు 6 కేంద్రాలు, ఇంటర్ పరీక్షలకు 2 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అందులో 751 మంది టెన్త్, 479 మంది ఇంటర్ పరీక్షలు రాస్తారని చెప్పారు. 650 మంది ఇన్విజిలేటర్లను, 12 మంది రూట్ అధికారులను, మూడు ఫ్లయింగ్ స్వ్కాడ్‌లను నియమించామని వివరించారు. పరీక్ష కేంద్రాలకు కిలో మీటరు దూరం పరిధిలో జెరాక్స్ దుకాణాలు మూసి వేయాలని, వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించామని తెలిపారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ అజూ రఫీజాన్, ఎంపీడీవో జి.పైడితల్లి, ఎంఈవో ఎన్.నాగభూషణరావు, తదితరులు ఉన్నారు.
మొరాయించిన బస్సు
గరుగుబిల్లి: పార్వతీపురం నుంచి మాదలంగి వెళ్లే ఆర్టీసీ బస్సు మొరాయించింది. ఉల్లిభద్ర ప్రాంతంలో మరమ్మతులకు గురవడంతో అర్ధాంతరంగా నిలిచిపోయింది. అందులో ఉన్న టెన్త్ విద్యార్థులు ఆందోళన చెందారు. పరీక్ష కేంద్రాలకు ఎలా చేరుకోవాలని టెన్షన్ పడ్డారు. వెంటనే బస్సు దిగిన వారు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చింది. ఉదయం 7.30 గంటల నుంచి 11 గంటల వరకు మరమ్మతులు కాలేదు. ఆ తర్వాత బస్సు కదిలింది.
తప్పని తిప్పలు
కొమరాడ: మండల కేంద్రానికి తూర్పు భాగంలో ఉన్న గ్రామాల విద్యార్థులకు అవస్థలు తప్పలేదు. పదవ తరగతి పరీక్షలకు వారు నాగావళి నదిలో దిగి ప్రయాణం చేయాల్సి వచ్చింది. గత కొద్ది రోజుల నుంచి వర్షాలు కురుస్తుండడంతో నదిలో నీటి ప్రవాహం కూడా ఎక్కువగానే ఉంది. దీంతో పలు గ్రామాల విద్యార్థులు కొట్టు రేవు వద్ద నదిలో దిగి కొమరాడకు చేరుకున్నారు. ఇదిలా ఉండగా మండల కేంద్రంలోని గిరిజన సంక్షేమ గురుకుల ఆశ్రమ పాఠశాల, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో పరీక్ష కేంద్రాలను జిల్లా ఉప విద్యాశాఖ అధికారి సూర్యకుమారి పరిశీలించారు.
Updated Date - 2023-04-03T23:59:35+05:30 IST