మొక్కుబడిగానే..
ABN, First Publish Date - 2023-06-07T00:00:55+05:30
ఇంటి ముంగిటకే వైద్య సేవలంటూ వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ జిల్లాలో మొక్కుబడిగా సాగుతోంది. నాలుగైదు టెస్ట్‌లు, మూడు మందులకే పరిమితమైంది. పథకం అమలు లోపభూయిష్టంగా మారింది.
- నాలుగైదు పరీక్షలతోనే సరి..
- అరకొరగా ఔషధాల సరఫరా
- కనిపించని వైద్య నిపుణులు
- జిల్లాలో ‘ఫ్యామిలీ డాక్టర్’ పరిస్థితిదీ
(పార్వతీపురం ఆంధ్రజ్యోతి)
ఇంటి ముంగిటకే వైద్య సేవలంటూ వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ జిల్లాలో మొక్కుబడిగా సాగుతోంది. నాలుగైదు టెస్ట్‌లు, మూడు మందులకే పరిమితమైంది. పథకం అమలు లోపభూయిష్టంగా మారింది. గ్రామీణులకు వైద్య సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. బీపీ, షుగర్, జ్వరం తదితర పరీక్షలు చేసి చేతులు దులుపుకొంటున్నారు. తీవ్ర రోగాలకు పరీక్షలే చేయడం లేదు. మందులు కూడా మూడు నాలుగు రోగాలకే పరిమితం చేస్తున్నారు. మిగతా మందులకు ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. వైద్య నిపుణులు కాకుండా పీహెచ్‌సీలకు చెందిన వైద్యులు సేవలు అందిస్తున్నారు. దీంతో ఈ ఫ్యామిలీ డాక్టర్ శిబిరాలపై ప్రజలు ఆసక్తి చూపడం లేదు.
జిల్లాలో గతంలో 104 వాహనాల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు విస్తృతంగా అందేవి. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫ్యామిలీ డాక్టర్ పథకం పేరిట అవే 104 వాహనాల్లో సేవలు అందిస్తున్నారు. దీన్నే వైసీపీ నేతలు పాలకులు గొప్పగా చెప్పుకొంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే వాహనాలు తప్ప.. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌కు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం కేటాయించడం లేదు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. పీహెచ్‌సీకి చెందిన వైద్యాధికారే ఫ్యామిలీ డాక్టర్ కావడం.. అక్కడ మందులే అంది స్తుండడంతో ఈ సేవలపై ప్రజలు ఆసక్తి చూపడం లేదు. ఓపీ కోసం స్థానికంగా ఉన్న ఆశ, ఏఎన్‌ఎంలపై అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఫ్యామిలీ డాక్టర్ శిబిరాలకు ప్రజలను తెప్పించే బాధ్యతను వారికి అప్పగిస్తున్నారు. అంతేతప్ప ప్రజలు స్వచ్ఛందంగా శిబిరాలకు రావడం లేదు.
ప్రత్యేక వైద్య నిపుణులు ఎక్కడ?
ఫ్యామిలీ డాక్టర్ పథకం ద్వారా సచివాలయ హెడ్‌క్వార్టర్‌తో పాటు మరో ఒక గ్రామానికి మాత్రమే వైద్య సేవలు అందిస్తున్నారు. పీహెచ్‌సీలో ఇద్దరు వైద్యులు ఉంటే ఒక వైద్యుడిని ఫ్యామిలీ డాక్టర్ శిబిరానికి కేటాయిస్తున్నారు. అయితే, ఆయన సెలవు పెట్టినా, లేదా అధికారికంగా ఏ కార్యక్రమానికి హాజరైనా వైద్య సిబ్బందే రోగులకు దిక్కు అవుతున్నారు. వాస్తవంగా ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమానికి ప్రత్యేక వైద్య నిపుణులతో పాటు ఇతర వైద్యులను నియమించాల్సి ఉంది. ఆ దిశగా చర్యలు లేకపోవడంతో ఈ కార్యక్రమం ప్రభుత్వ ప్రచారానికే పరిమితమైందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇరుకు గదుల్లో సేవలు..
జిల్లాలో 127 వైఎస్సార్ హెల్త్ క్లీనిక్‌లను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. మరికొన్నింటిని పంచాయతీ కార్యాలయాల్లో నిర్వహిస్తున్నారు. దీనివల్ల ఫ్యామిలీ డాక్టర్ శిబిరాలను ఇరుకు గదుల్లోనే నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. గర్భిణులు, బాలింతలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రత్యేక మరుగుదొడ్లు లేకపోవడంతో యూరిన్ టెస్ట్‌లు కూడా చేయలేని పరిస్థితి ఉంది. అసలు ఈ పథకం ద్వారా 14 రకాల పరీక్షలు, 105 రకాల మందులు అందించాల్సి ఉంది. అయితే, కేవలం బీపీ, షుగర్, జ్వరం తదితర పరీక్షలనే నిర్వహిస్తున్నారు. గ్యాస్ట్రిక్, క్షయ, జ్వరం, నొప్పులు, బీపీ, షుగర్ తదితర వాటికే మందులు ఇస్తున్నారు. మిగిలినవాటికి మందులు అందుబాటులో లేవని, ఆస్పత్రులకు రిఫర్ చేస్తున్నారు. ఫలానా ఆసుపత్రికి వెళ్లి తెచ్చుకోవాలని వైద్యసిబ్బంది స్పష్టం చేస్తున్నారు.
సక్రమంగా పనిచేయని మిషన్లు
బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించే మిషన్లు సక్రమంగా పనిచేయకపోవడంతో రోగులు అసహనం వ్యక్తం చేశారు. ఫ్యామిలీ డాక్టర్ సేవలందించేందుకు వస్తున్న వాహనాల్లో కనీసం ఆక్సిజన్ కూడా ఉండడంలేదు. ల్యాబ్ టెక్నీషియన్లు లేకపోవడంతో మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్‌తో రోగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మందులు అందించేందుకు ఫార్మాసిస్టులు కూడా లేని పరిస్థితి కొన్నిచోట్ల నెలకొంది.
విజయవంతంగా నిర్వహిస్తున్నాం..
జిల్లాలో ఫ్యామిలీ డాక్టర్ పథకాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. పూర్తిస్థాయిలో వైద్యసేవలు అందిస్తున్నాం. అన్నిరకాల వైద్య పరీక్షలు చేస్తున్నాం. రోగులకు అవసరమైన ప్రాప్తికి మందులు అందిస్తున్నాం.
- జగన్నాథరావు, డీఎంహెచ్‌వో, పార్వతీపురం మన్యం
Updated Date - 2023-06-07T00:00:55+05:30 IST