ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

అసైన్డ్‌ భూములపై వైసీపీ నేతల కన్ను

ABN, First Publish Date - 2023-07-21T01:15:20+05:30

విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఇప్పుడు అంతా అసైన్డ్‌ భూముల వ్యాపారమే పెద్దఎత్తున నడుస్తోంది.

విక్రయానికి అనుమతి ఇవ్వాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయం

ఈ నేపథ్యంలో విశాఖపట్నం చుట్టుపక్కల గల అసైన్డ్‌ భూముల కోసం అధికార పార్టీ నాయకుల అన్వేషణ

ఆనందపురం, పద్మనాభం మండలాల్లో భూముల కొనుగోలుకు ఎకరాకు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల వరకూ అడ్వాన్స్‌లు

ఓ మంత్రి ఒప్పందాలు

ప్రభుత్వ అధికారి పేరు చెప్పి మరికొన్ని...

తెర వెనుక పెద్ద తలకాయలు వున్నట్టు ప్రచారం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో ఇప్పుడు అంతా అసైన్డ్‌ భూముల వ్యాపారమే పెద్దఎత్తున నడుస్తోంది. అధికార పార్టీలో పెట్టుబడి పెట్టగలిగిన వారంతా ఈ రెండు జిల్లాలపైనే ప్రధానంగా దృష్టిపెట్టి ఒప్పందాలు చేసుకుంటున్నారు. అసైన్డ్‌ భూముల విక్రయానికి అనుమతి ఇవ్వాలని ఇటీవల జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇరవై ఏళ్లు దాటిన భూములను అమ్ముకోవడానికి త్వరలో ఉత్తర్వులు జారీచేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో వున్న ఉమ్మడి జిల్లా వైసీపీ నేతలతో పాటు ఇతర జిల్లాలకు చెందిన నాయకులు కూడా నగరంలో మకాం వేసి రైతులతో మంతనాలు జరుపుతున్నారు. ముఖ్యంగా ఆనందపురం, భీమిలి, పద్మనాభం, విశాఖ రూరల్‌ మండలాల్లో అసైన్డ్‌ భూముల కోసం వీరు గాలిస్తున్నారు. అంతా తాము చూసుకుంటామని, ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల కోసం రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని చెప్పి అడ్వాన్సులు ఇస్తున్నారు. ఆనందపురం మండలంలో అత్యధికంగా ఎకరాకు రూ.50 లక్షల వరకు ఆఫర్‌ చేస్తున్నారు. పద్మనాభం, భీమిలి మండలాల్లో ఎకరాకు రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షలు ఇస్తామని చెబుతున్నారు. అడ్వాన్స్‌గా ఎకరాకు రూ.5 లక్షలు ఇస్తున్నారు. ఎకరా రూ.30 లక్షలు దాటిన భూములకు రూ.10 లక్షలు అడ్వాన్స్‌ ఇస్తున్నారు. రాజకీయంగా ప్రతిపక్షాలపై విరుచుకు పడేందుకు ప్రతి నెలా విశాఖపట్నం వచ్చి పార్టీ కార్యాలయంలో, ప్రభుత్వ అతిథి గృహంలో సమావేశాలు నిర్వహించే ఓ మంత్రి ఏకంగా తన కుమారుడితో ఎంవీపీ కాలనీలో ఓ కార్యాలయం తెరిపించినట్టు చెబుతున్నారు. అక్కడే ఈ భూముల కొనుగోళ్లకు మంతనాలు నడుస్తున్నాయి. వీరు పద్మనాభం మండలం అనంతవరం గ్రామంలో 60 మంది రైతుల నుంచి 21 ఎకరాలు, విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం రెల్లివలసలో మరో 15 ఎకరాలు కొనుగోలుకు ఒప్పందాలు చేసుకొని అడ్వాన్స్‌లు ఇచ్చారు. ఎకరాకు రూ.25 లక్షల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. వాస్తవానికి ఆ మంత్రికి కోట్ల రూపాయల్లో భారీగా పెట్టుబడి పెట్టే స్థోమత లేదని, వెనకాల ఇంకా ఎవరో ఉన్నారని అధికార పార్టీ నాయకులే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

సీనియర్‌ ఐఏఎస్‌ పేరుతో....

ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న ఓ సీనియర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ పేరు చెప్పి మరికొందరు ఒప్పందాలు చేసుకుంటున్నారు. తాము డీల్‌ చేస్తున్న భూముల్లోకి వేరే వారు రాకుండా ఉండేందుకు ఇలా పెద్ద అధికారి పేరు వాడుతున్నారని సమాచారం.

నగరంలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో వున్న అధికారి పార్టీకి చెందిన ఒక నేత ఈసారి ఎన్నికకు అయ్యే ఖర్చు మొత్తం ఈ అసైన్డ్‌ భూముల లావాదేవీల ద్వారానే సమకూర్చుకోవడానికి యత్నిస్తున్నారు. తన సామాజిక వర్గం వారితో కొనిపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన చాలామంది నేతలు ఈ ఒప్పందాలు చేసుకుంటున్నారు. సబ్బవరం, పెందుర్తి, లంకెలపాలెం, కశింకోట, విజయనగరం జిల్లా కొత్తవలస....ఇలా ఎక్కడ అసైన్డ్‌ భూములు అందుబాటులో ఉంటే అక్కడ కొనేస్తున్నారు.

రికార్డులు దాచేస్తున్నారు

అసైన్డ్‌ భూములను అమ్ముకోవచ్చునని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వెంటనే రెవెన్యూ అధికారులు వారి మండలాల్లో వాటికి సంబంధించిన రికార్డులను దాచేశారు. అధికార పార్టీ నేతలు ఒత్తిళ్లు పెడుతూ, ఎక్కడెక్కడ అసైన్డ్‌ భూములు ఉన్నాయో వివరాలు అడుగుతున్నారు. తమకు వాటా ఇవ్వకుండా ఎలా సెటిల్‌ చేసుకుంటారంటూ కొందరు అధికారులు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పర్సంటేజీ ఇవ్వకపోతే...రికార్డుల్లో ఆయా రైతుల పేర్లు మాయం అయ్యే ప్రమాదం ఉండడంతో నయానో భయానో వారిని దారికి తెచ్చుకోవడానికి నేతలు యత్నిస్తున్నారు.

Updated Date - 2023-07-21T01:15:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising