కదలరు..వదలరు...
ABN, First Publish Date - 2023-06-02T01:28:46+05:30
జీవీఎంసీలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు, ఉద్యోగులు ఏళ్ల తరబడి ఒకేచోట తిష్ఠ వేసుకుని ఉండిపోతున్నారు.
ఏళ్ల తరబడి జీవీఎంసీలోనే తిష్ఠ
ఐదేళ్లు దాటినా బదిలీపై వెళ్లేందుకు ససేమిరా
ఇక్కడే కొనసాగేందుకు పైరవీలు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
జీవీఎంసీలో పనిచేస్తున్న కొంతమంది అధికారులు, ఉద్యోగులు ఏళ్ల తరబడి ఒకేచోట తిష్ఠ వేసుకుని ఉండిపోతున్నారు. ఐదేళ్ల సర్వీసు పూర్తయినప్పటికీ బదిలీకి ససేమిరా అంటున్నారు. అక్కడే కొనసాగేందుకు పైరవీలు చేసుకుంటున్నారు. ఏదో ఒక కారణం చూపిస్తూ...తమను జీవీఎంసీలోనే కొనసాగించాలంటూ రాజకీయ నేతల ద్వారా ఉన్నతాధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
ఒకేచోట ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న వారిని బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు మే 31లోగా బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దీంతో జీవీఎంసీలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న వారందరికీ ఈసారి స్థానచలనం తప్పదని అంతా భావించారు. కానీ జీవీఎంసీని విడిచి వేరొకచోటకు వెళ్లేందుకు ఇష్టపడని అధికారులు ఏదో ఒక సాకుతో బదిలీ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. జీవీఎంసీలో ఐదేళ్లకుపైగా సర్వీసు పూర్తిచేసుకున్న వారిలో ఇంజనీరింగ్ విభాగంలో ఇద్దరు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ముగ్గురు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, ఐదుగురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, 25 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు ఉన్నారు. అలాగే టౌన్‌ప్లానింగ్ విభాగంలో చీఫ్ సిటీప్లానర్ బి.సురేష్‌కుమార్‌కు ఐదేళ్ల సర్వీసుపూర్తవ్వడంతో ఆయన్ను సీఆర్‌డీఏకి బదిలీ చేశారు. టౌన్‌ప్లానింగ్ అధికారిగా పనిచేస్తున్న మరొకరికి కూడా జీవీఎంసీలో ఐదేళ్లకు పైగా సర్వీసు పూర్తవడంతో ఆమెకు బదిలీ తప్పనిసరి. కానీ ఆమె కూడా జీవీఎంసీలోనే కొనసాగాలని కోరుకుంటున్నారు. ఇంజనీరింగ్ విభాగంలో బదిలీ కావలసిన ఇద్దరు ఎస్‌ఈలు తమకు మినహాయింపు ఇవ్వాలని కోరడంతో వారిని జీవీఎంసీలోనే కొనసాగించేందుకు ఉన్నతాధికారులు అంగీకరించినట్టు తెలిసింది. బదిలీల్లో భాగంగా ఇతర ప్రాంతాల నుంచి ఎస్‌ఈ ఒకరు జీవీఎంసీకి రావడం ఖాయం కాబట్టి, ఆయన కోసం ప్రత్యేకంగా ఏదైనా ఒక విభాగాన్ని ఏర్పాటుచేసే అవకాశం వుందని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. ఇక ఏఈల విషయానికి వస్తే ఒకేసారి 25 మంది ఏఈలను ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తే...అంతే సంఖ్యలో తిరిగి జీవీఎంసీకి ఏఈలు వచ్చే అవకాశం ఉండదని ఇంజనీరింగ్ అధికారులు చెబుతున్నారు. అందువల్ల అర్హులైన వారందరినీ కాకుండా కొంతమంది ఏఈలనే బదిలీ చేయాలని జీవీఎంసీ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికే విజ్ఞప్తి చేసినట్టు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఏఈల్లో చాలామంది తిరిగి జీవీఎంసీలోనే కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. హార్టికల్చర్ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న దామోదర్ కూడా ఐదేళ్ల సర్వీస్ పూర్తిచేసినప్పటికీ, తన పోస్ట్ జీవీఎంసీ పరిధిలోనిదే కాబట్టి, ఇక్కడే కొనసాగించాలని ఆయన కోరుతున్నట్టు సమాచారం. ఇలా ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నప్పటికీ కొందరు తిరిగి జీవీఎంసీలోనే కొనసాగే అవకాశం వుందని ఉద్యోగులు అంచనా వేస్తున్నారు.
జీవీఎంసీ చీఫ్ సిటీప్లానర్‌గా సునీత
సీఆర్‌డీఏ అదనపు డైరెక్టర్‌గా సురేష్‌కుమార్‌కు బదిలీ
విశాఖపట్నం, జూన్ 1 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ చీఫ్ సిటీప్లానర్‌గా వి.సునీతను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం సీపీపీగా పనిచేస్తున్న బి.సురేష్‌కుమార్‌ను సీఆర్‌డీఏ అదనపు డైరెక్టర్‌గా బదిలీ చేసింది. అక్కడ పనిచేస్తున్న సునీతను జీవీఎంసీ సీసీపీగా నియమించింది. సునీత గతంలో జీవీఎంసీలో డీసీపీగా పనిచేశారు. ఆమెకు జీవీఎంసీపై పూర్తిస్థాయిలో అవగాహన ఉంది. అలాగే జీవీఎంసీలో డీసీపీగా పనిచేస్తున్న సంజయ్‌రత్నకుమార్‌ను వీఎంఆర్‌డీఏ సీయూపీగా బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న ఎ.ప్రభాకరరావును సీఆర్‌డీఏలోని జగనన్న శాశ్వత భూహక్కు ప్రాజెక్టు అదనపు డైరెక్టర్‌గా బదిలీ చేశారు.
Updated Date - 2023-06-02T01:28:46+05:30 IST