రేషన్ డిపోలకు విజిలెన్స్ కమిటీలు
ABN, First Publish Date - 2023-09-04T00:53:57+05:30
రేషన్ డిపోల ద్వారా కార్డుదారులకు సరకుల పంపిణీలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలన్న కేంద్రం ఆదేశాలను అమలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో రేషన్ డిపోల వారీగా విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖలో జవాబుదారీతనం, సజావుగా సరుకుల పంపిణీలో తలెత్తే ఇబ్బందులు, తదితర అంశాలపై పర్యవేక్షణకు గతంలో మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఆహార సలహా కమిటీలు ఉండేవి.
ఆహార కమిటీల స్థానంలో ఏర్పాటు
కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా చర్యలు
జిల్లాలో 615 డిపోల పరిధిలో ప్రతిపాదనలు
సమస్యలపై మూడు నెలలకోసారి భేటీ
సరకుల సక్రమ పంపిణీపై కార్డుదారుల ఆశలు
విశాఖపట్నం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి):
రేషన్ డిపోల ద్వారా కార్డుదారులకు సరకుల పంపిణీలో పారదర్శకత ఉండేలా చర్యలు తీసుకోవాలన్న కేంద్రం ఆదేశాలను అమలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా క్షేత్రస్థాయిలో రేషన్ డిపోల వారీగా విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. పౌరసరఫరాల శాఖలో జవాబుదారీతనం, సజావుగా సరుకుల పంపిణీలో తలెత్తే ఇబ్బందులు, తదితర అంశాలపై పర్యవేక్షణకు గతంలో మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ఆహార సలహా కమిటీలు ఉండేవి. ప్రస్తుతం వాటిని పక్కనెబెట్టి, ఆ స్థానంలో ప్రభుత్వం విజిలెన్స్ కమిటీలు ఏర్పాటు చేస్తోంది. మండల, డివిజన్, జిల్లా విజిలెన్స్ కమిటీలతోపాటు ప్రతి రేషన్‌డిపోకు ఒక కమిటీని నియమిస్తోంది. డిపోల వారీగా నగరంలో వార్డు కార్పొరేటర్, గ్రామీణ ప్రాంతంలో సర్పంచ్ అధ్యక్షతన ఏర్పాటు చేసే విజిలెన్స్ కమిటీకి సంబంధిత వీఆర్వో సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన కమిటీలో ఇద్దరు డ్వాక్రా గ్రూపు సభ్యులు, ఇద్దరు సామాజిక కార్యకర్తలు, ఐదుగురు కార్డుదారులు, ఐసీడీఎస్ సూపర్‌వైజర్, పౌరసరఫరాల డీటీ/ఇన్‌స్పెక్టరు, దివ్యాంగుల నుంచి ఒకరు, సహాయ సాంఘిక సంక్షేమశాఖాధికారి, ఎండీయూ ఆపరేటర్, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాఽధ్యాయుడు ఉంటారు.
మండల కమిటీకి సంబంధిత తహసీల్దారు అధ్యక్షతన విజిలెన్స్ కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ కమిటీలో మొత్తం 21 మంది సభ్యులుంటారు. జిల్లాలోని 11 మండలాల్లో మొత్తం 642 దుకాణాలున్నాయి. వీటిలో ఇంతవరకు పెందుర్తి, విశాఖ రూరల్ మినహా మిగిలిన 9 మండలాలకు కమిటీలు నియమిస్తూ ప్రతిపాదించారు. 642 దుకాణాలకు గాను ఇప్పటివరకు 615 డిపోలకు కమిటీలు నియమిస్తూ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి కలెక్టర్ ఆమోదం తెలపాల్సి ఉండగా, మరో 27 దుకాణాలకు కమిటీలు నియమించాల్సి ఉంది.
మూడు నెలలకో సమావేశం
కమిటీలు ప్రతి మూడునెలకు ఒకసారి చొప్పున ఏడాదికి నాలుగుసార్లు సమావేశం కావాల్సి ఉంటుంది. డిపో కమిటీ సమావేశంలో ఆ పరిధిలోని కార్డుదారులకు సరకులు పంపిణీ సక్రమంగా జరుగుతోందా? లేదా అనేది చర్చిస్తారు. మండల కమిటీలు మండలంలోని డిపోలు, ఎండీయూ ఆపరేటర్ల మధ్య సమన్వయం, కార్డుదారులకు సరకుల అందజేతపై చర్చిస్తారని పౌరసరఫరాల శాఖాఽధికారి ఒకరు తెలిపారు.
డీలర్లపై ఒత్తిడి
రేషన్‌డిపో పరిధిలో విజిలెన్స్ కమిటీ నియామకం వరకు బాగానే ఉన్నా.. కమిటీలో కొందరు సభ్యుల నుంచి పలు రకాల ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదురవుతాయని డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో డిపో విజిలెన్స్ కమిటీ చైర్మన్‌గా ఉన్న కార్పొరేటర్లు అప్పుడే కొందరు డీలర్లను తమ ఇంటికి పిలిచి నెలవారీ మామ్మూళ్లు ఇవ్వాలని హుకుం జారీ చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఇప్పటివరకు మండలస్థాయిలో కమిటీలుండేవని, వాటిలో సభ్యులుగా అన్ని పార్టీలకు చెందిన వారిని నియమించేవారని, కొత్త కమిటీలతో ఇబ్బందులు తప్పేలా లేవని వాపోతున్నారు. కాగా మొబైల్ డిస్పెన్సింగ్ యూనిట్లు (ఎండీయూ ఆపరేటర్లు), డీలర్లకు మధ్య కొన్నిచోట్ల వివాదాలున్నాయి. ఇంటింటికీ రేషన్ సరఫరా చేయాల్సి ఉండగా వీధి చివరిలో వాహనం నిలిపివేసి సరకుల పంపిణీ చేస్తున్నారు. అదికూడా నెలకు ఒకసారి మాత్రమే.దీంతో పనులకు వెళ్లిపోయిన కార్డుదారులకు సరకులు అందడం లేదు. తప్పనిసరిగా ఒక రోజు పనులు మానుకోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. అదే డిపోల వద్ద కనీసం 15 రోజుల పాటు ఉదయం, సాయంత్రం సరకుల పంపిణీ జరిగేదని గుర్తుచేస్తున్నారు. త్వరలో సమావేశం కానున్న విజిలెన్స్ కమిటీలు కార్డుదారులకు సౌలభ్యంగా సరకుల పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Updated Date - 2023-09-04T00:53:57+05:30 IST