Vande Bharat : ‘వందేభారత్’ ఒక్కరోజు ముచ్చటే!
ABN, First Publish Date - 2023-01-18T03:02:27+05:30
సంక్రాంతి పండుగ రోజున సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య అట్టహాసంగా ప్రారంభమైన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో సీట్లు నిండటమే గగనంగా మారింది.
రేపటి నుంచి సగానికి పైగా సీట్లు ఖాళీ..
మధ్య తరగతికి అందుబాటులో లేని రేట్లు
వందే భారత్ కంటే ‘దురంతో’కే డిమాండ్
ఈ రెండింటి వేగం ఒక్కటే... చార్జీల్లోనే తేడా
విమానం టికెట్‌తో సమానంగా వందేభారత్ ధర
మిగిలిన రైళ్లతో పోలిస్తే రెండు రెట్లు అధికం
విమాన ప్రయాణానికే ధనిక వర్గాల మొగ్గు
(విజయవాడ/విశాఖపట్నం- ఆంధ్రజ్యోతి) : సంక్రాంతి పండుగ రోజున సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య అట్టహాసంగా ప్రారంభమైన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో సీట్లు నిండటమే గగనంగా మారింది. పండుగ రోజున ప్రారంభోత్సవం కాబట్టి ఎంపిక చేసినవారిని అనుమతించారు. అధికారికంగా కనుమ రోజున నుంచి మాత్రమే ఈ రైలు ప్రారంభమైనట్టుగా భావించాల్సి ఉంటుంది. ఆ ఒక్కరోజు తప్పితే ఈ రైలుకు ప్రయాణికులు పెద్దగా ఆదరణ చూపడం లేదనే చెప్పాలి. మంగళవారం వందేభారత్‌లో సగానికి పైగా సీట్లు ఖాళీగానే ఉన్నట్టు తెలుస్తోంది. రానున్న రెండు రోజుల్లో కూడా సగానికి పైగానే సీట్ల లభ్యతను ఆన్‌లైన్ బుకింగ్‌లో చూపిస్తోంది. బుధవారం అంటే ఈ నెల 18న చైర్‌కార్‌లో 185 సీట్లు, 19న 544 సీట్లు, 20న 495 సీట్లు చొప్పున ఖాళీలు ఉన్నాయి. అలాగే 21న 535, 22న 632, 24న 621 సీట్లు ఖాళీగా చూపిస్తున్నాయి. పరిమిత సీట్లు ఉండే ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో జనవరి 21 వరకు వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది. దీనిలో కూడా 23న 24, జనవరి 24న 26 సీట్లు ఖాళీగానే ఉన్నాయి.
దురంతోకే ప్రయాణికుల ఓటు
వందేభారత్ ఎక్స్‌ప్రె్‌సలో విమానం స్థాయిలో సదుపాయాలు ఉన్నాయని ఊదరగొట్టినప్పటికీ ప్రయాణికుల నుంచి ఆశించినంత స్పందన కానరావడం లేదు. సికింద్రాబాద్ నుంచి విశాఖకు నడిపే సూపర్‌ఫాస్ట్ రైళ్లలో దురంతో ఎక్స్‌ప్రెస్ అతి ముఖ్యమైనది. దురంతో రైళ్లలో బుధవారం, శనివారం వెయిటింగ్ లిస్టులు కనిపిస్తున్నాయి. దీనిలో ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ కోచ్‌లు ఉంటాయి. అన్నీ స్లీపర్ బెర్తులే. దురంతోలో ఫస్ట్ ఏసీ టికెట్ ధర రూ.2,800, సెకండ్ ఏసీ రూ.2,300, థర్డ్ ఏసీ రూ.1,630గా ఉంది. ఈ ఎక్స్‌ప్రెస్ కూడా గంటకు 130 కిలోమీటర్ల నుంచి 140 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖకు 10 గంటల 10 నిమిషాల వ్యవధిలో చేరుకుంటుంది. ఇక వందే భారత్ రైలు ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు రూ.3,170గా ఉంది. గంటకు 180 కిలోమీటర్ల మేర ప్రయాణించే సత్తా ఉన్నా మన రూట్‌లో మాత్రం 130 కిలోమీటర్ల వేగ పరిమితిని విధించారు. ఇందులో స్లీపర్ బెర్తులు ఉండవు. అన్నీ చైర్ సీటింగ్ మాత్రమే ఉంటాయి. సికింద్రాబాద్ నుంచి 8.30గంటల ప్రయాణంతో విశాఖకు చేరుకోవచ్చు. దురంతోతో పోల్చుకుంటే గంటా 40 నిమిషాలు ముందుగా వందేభారత్‌లో ప్రయాణించవచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత సగటు ప్రయాణికుడు వందేభారత్ కంటే దురంతో వైపే ఆసక్తి చూపిస్తున్నారు. గంటన్నర వ్యత్యాసానికి అంత డబ్బు చెల్లించి వందేభారత్‌లో వెళ్లే కంటే ఇతర సూపర్‌ఫాస్ట్ రైళ్లలో ప్రయాణించడం మేలని భావిస్తున్నారు. వందేభారత్‌లో 1,128 సీటింగ్‌కు కాను 1,050 సీట్లు చైర్‌కార్ సదుపాయంతో ఉన్నాయి. మిగిలినవి ఎగ్జిక్యూటివ్ క్లాస్‌కు కేటాయించారు.
పాచిపోయిన చట్నీ.. రుచిలేని ఆహారం
వందేభారత్ రైలులో ప్యాంట్రీ కార్ లేదు. అయినా ఆహారం ఇస్తామంటూ ముందుగానే టికెట్‌తో కలిసి డబ్బులు తీసుకుంటున్నారు. ఎగ్జిక్యూటివ్ క్లాసులో ఏకంగా రూ.400 వరకు చార్జి చేస్తున్నారు. ఈ రైలులో ఆహార పదార్థాలను వేడి చేసుకునే సదుపాయం తప్పితే కనీసం కాఫీ పెట్టడానికి కూడా ఏర్పాట్లు లేవు. విశాఖలో ఈ రైలు ఉదయం 5.45 గంటలకు బయలుదేరుతుంది. అందరూ ఎక్కిన తరువాత బిస్కెట్లు, మసాలా టీ ఇస్తున్నారు. శాకాహార, మాంసాహారం ఆప్షన్ తీసుకొని రాజమండ్రిలో టిఫిన్ అందిస్తున్నారు. మంగళవారం ప్రయాణించిన వారికి రెండు గారెలు, ఉప్మాతో పాటు చట్నీ ఇచ్చారు. చట్నీ పులిసిపోవడంతో చాలామంది డస్ట్‌బిన్‌లో పడేశారు. నాన్‌వెజ్ ఆప్షన్ తీసుకున్న వారికి బ్రెడ్ ఆమ్లేట్ తదితరాలు ఇచ్చారు. ఈ ఆహారం అంత రుచిగా ఏమీ లేదని, కేవలం వేడి చేసి ఇస్తున్నారని పలువురు పెదవి విరిచారు.
సమయం మార్చాల్సిందే
విశాఖ నుంచి ఈ రైలు బయలుదేరే సమయం అందరికీ అనుకూలంగా ఉంది. అయితే సికింద్రాబాద్ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకునే సరికి రాత్రి 11.30 గంటలు అవుతోంది. అర్ధరాత్రి స్టేషన్‌లో దిగి ఆటో/టాక్సీలో ఇంటికి వెళ్లాలంటే భద్రతాపరమైన సమస్యలు ఉంటాయని ప్రయాణికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ రైలు తెల్లవారుజామున విశాఖకు చేరుకునేలా సమయం మార్చాలని సూచిస్తున్నారు. ఇక సంక్రాంతి సెలవులు పూర్తిగా అయిపోయి, డిమాండ్ తగ్గిన తరువాత ఈ రైలుకు ప్రయాణికుల ఆదరణ ఎలా ఉందనే విషయం తెలుస్తుందని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రస్తుతం ఇతర రైళ్లలో టికెట్లు దొరకని వారు మాత్రమే ఈ రైలును ఆప్షన్‌గా తీసుకుంటున్నారు. రూ.3వేలకు పైగా వందేభారత్‌లో పెట్టే బదులు విమానంలో ప్రయాణమే ఉత్తమమని ధనిక వర్గాలు భావిస్తున్నాయి.
వామ్మో... వందే భారత్!
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్ల రేట్లు వింటేనే గుండె గుభేల్ మంటోంది. ఈ రైల్లో వసతులు బాగున్నా, టికెట్ ధరలపై ప్రయాణికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లడానికి పది రోజుల ముందు బుక్ చేసుకుంటే విమానం టికెట్ రూ.3,900కే లభిస్తుంది. ప్రయాణ సమయం గంట మాత్రమే. అదే వందే భారత్ రైలులో ఎగ్జిక్యూటివ్ క్లాస్ టికెట్‌కి రూ.3,170 తీసుకుంటున్నారు. ప్రయాణ సమయం 8.30గంటలు. ఇంకో రూ.700 అదనంగా పెడితే.. విమానం ఎక్కి ఏకంగా ఏడు గంటల సమయం ఆదా చేసుకోవచ్చు. విశాఖపట్నం-హైదరాబాద్/సికింద్రాబాద్ మధ్య నిత్యం పది రైళ్ల వరకు నడుస్తున్నాయి. వాటిలో ఏసీ టికెట్ ధరలు రూ.995తో మొదలై రూ.1,080 వరకు ఉన్నాయి. అదే వందేభారత్ రైల్లో ఎకానమీ క్లాస్‌కు రూ.1,720 తీసుకుంటున్నారు. ఇతర రైళ్లలో ప్రయాణ సమయం 11.30 నుంచి రూ.12.30 గంటలు పడుతోంది.
Updated Date - 2023-01-18T08:10:49+05:30 IST