ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పర్యాటకం... ప్రచారం పూజ్యం

ABN, First Publish Date - 2023-09-27T01:14:30+05:30

పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రపంచమంతా ఏర్పాట్లు చేసుకుంటుంటే విశాఖపట్నంలో మాత్రం ఆ ఛాయలే లేవు. ఒక్క కార్యక్రమం లేదు.

ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితం

కైలాసగిరిపై స్కై టవర్‌, స్కై డైవింగ్‌, తొట్లకొండ వద్ద సముద్రంలో టన్నెల్‌ అక్వేరియం, భీమిలిలో జల విహార్‌ ఏర్పాటుచేయనున్నట్టు ప్రకటనలు

ఒక్కటీ కార్యరూపం దాల్చని వైనం

నిధుల కొరతతో విశాఖ, భీమిలి ఉత్సవ్‌లకూ బ్రేక్‌

నేడు ప్రపంచ పర్యాటక దినోత్సవం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడానికి ప్రపంచమంతా ఏర్పాట్లు చేసుకుంటుంటే విశాఖపట్నంలో మాత్రం ఆ ఛాయలే లేవు. ఒక్క కార్యక్రమం లేదు. ఒక ఉత్సవం లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే విశాఖ జిల్లాకు పర్యాటక శాఖ అధికారి లేరు. రీజనల్‌ డైరెక్టరే ఆ బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. జిల్లాకు ప్రత్యేకంగా అధికారి ఉన్నా చేసేది ఏముందిలే?...అనుకున్నారేమో. ఇక పర్యాటక శాఖా మంత్రి రోజా విశాఖపట్నం గురించి పట్టించుకోవడమే మానేశారు. వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులను ప్రకటించడం తప్పితే వాటిని సాకారం చేసే దిశగా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు. విశాఖపట్నంలో పర్యాటక కేంద్రాలుగా పేరొందిన కైలాసగిరి, సబ్‌మెరైన్‌ మ్యూజియం, టీయూ-142, సీ హారియర్‌ మ్యూజియం వంటివన్నీ వీఎంఆర్‌డీఏ (గతంలో వుడా) అభివృద్ధి చేసినవే. ఇలా చెప్పుకునే ప్రాజెక్టు పర్యాటక శాఖకు ఒక్కటి కూడా లేదంటే అతిశయోక్తి కాదు.

ఎన్నో ఆర్భాటపు ప్రకటనలు

ఉమ్మడి విశాఖ జిల్లాలో చేపట్టిన ప్రాజెక్టులను పర్యాటక శాఖ మధ్యలోనే వదిలేసింది. అలాంటివి అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ, అనంతగిరి, చింతపల్లిల్లో అనేకం ఉన్నాయి. ఇక అనకాపల్లి జిల్లాలో అద్భుతమైన కొండకర్ల ఆవకు సందర్శకుల సంఖ్య పెరుగుతున్నా అక్కడ కనీస మౌలిక వసతులు కూడా కల్పించడం లేదు. వీటికి భారీగా నిధులు అవసరం లేదు. అయినా పట్టించుకోవడం లేదు. విశాఖలో ఆరు నెలల క్రితం జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులకు ఒప్పందాలు చేసుకున్నారు. అందులో కేవలం విశాఖ జిల్లాకు సంబంధించి రూ.8,800 కోట్ల వరకు ఉన్నాయి. వాటిలో కేవలం ఒకే ఒక్కటి ఒబెరాయ్‌ గ్రూపు అన్నవరంలో హోటల్‌/రిసార్ట్స్‌ నిర్మాణానికి ఇటీవల శంకుస్థాపన చేసింది. అది కూడా కొత్తగా భోగాపురం విమానాశ్రయానికి చేరువగా విలువైన తీరప్రాంత భూములు ఇవ్వడంతో వారు ముందుకువచ్చారు. అక్కడ నిర్మాణాలకు కేంద్రం నుంచి అనుమతులు అవసరం. వాటిని తీసుకురావాలంటే చాలా కష్టం. ఈ ప్రాజెక్టు అంత త్వరగా సాకారం కాదు. మిగిలినవన్నీ ఒప్పందాలుగా పుస్తకాల్లోనే మగ్గుతున్నాయి.

స్కై టవర్‌..టన్నెల్‌ అక్వేరియం ఎక్కడ?

కైలాసగిరిపై స్కై టవర్‌ నిర్మిస్తామని వైసీపీ నేతలు, అధికారులు నాలుగేళ్లుగా చెబుతున్నారు. ఓ సంస్థ రూ.100 కోట్లు వెచ్చించడానికి ముందుకు వచ్చిందని ప్రకటనలు గుప్పించారు. ఇప్పటివరకు అతీగతీ లేదు. తొట్లకొండ వద్ద సముద్రంలోనే టన్నెల్‌ అక్వేరియం ఏర్పాటుచేస్తామని, దీనికి మరో రూ.100 కోట్లు పెట్టుబడులు వస్తున్నాయని ఊదరగొట్టారు. ఇక కైలాసగిరి పైనుంచి స్కై డైవింగ్‌, రుషికొండ బీచ్‌లో స్కూబా డైవింగ్‌ , తెన్నేటి పార్కు నుంచి జిప్‌ లైనర్‌, ఏజెన్సీలో రోప్‌వేలు ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. కానీ ఏవీ కార్యరూపం దాల్చలేదు. భీమిలి మండలం అన్నవరంలో రూ.250 కోట్లతో జల విహార్‌ పేరుతో ఏకంగా ఒక హార్బర్‌ను నిర్మించి, జలవిహారానికి ఏర్పాట్లు చేస్తామన్నారు. మరిచిపోయారు.

ఉత్సవాలు ఆపేశారు

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏటా డిసెంబరు, జనవరి నెలల్లో విశాఖ ఉత్సవ్‌, భీమిలి ఉత్సవ్‌, అరకు ఉత్సవ్‌లు నిర్వహించేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఒక ఏడాది నిర్వహించారు. ఆ తరువాత కరోనా పేరు చెప్పి పూర్తిగా ఆపేశారు. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చేసిన భీమిలి ఉత్సవ్‌కు ఇప్పటికీ బిల్లులు మంజూరు కాలేదు. కనీసం పర్యాటక దినోత్సవం వంటి ప్రత్యేక రోజుల్లోనైనా చక్కటి ప్రచారంతో ఏదైనా కార్యక్రమం చేసి ఉంటే విశాఖపట్నానికి మరింత మంది పర్యాటకులు వస్తారు. ఆ శాఖ అధికారులు ఆ ప్రయత్నం కూడా లేదు. సెప్టెంబరు 27న ప్రపంచ పర్యాటక దినోత్సవానికి సంబంధించి కనీసం పోస్టర్‌ కూడా ముద్రించలేదు. అదీ ఇక్కడి పర్యాటక శోభ. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజుకు మాత్రం ఆ శాఖా మంత్రి రోజా ఆయన మెప్పు కోసం రూ.30 కోట్లు వెచ్చించి అన్ని జిల్లాల్లోను భారీ కార్యక్రమాలు నిర్వహించారు. పర్యాటకుల కోసం మాత్రం చేసిందేమీ లేదు.

Updated Date - 2023-09-27T01:14:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising