పట్టాదారులకు టైటిల్ డీడ్‌లు
ABN, First Publish Date - 2023-02-21T01:16:02+05:30
గాజువాకలో హౌస్ కమిటీ సమస్య పరిష్కారానికి గత తెలుగుదేశం ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను అమలు చేసేందుకు ఎట్టకేలకు వైసీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
గాజువాక హౌస్ కమిటీపై ప్రభుత్వ నిర్ణయం
గత తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన జీవో అమలుకు ఎట్టకేలకు అంగీకారం
చంద్రబాబు హయాంలో 7,500 మందికి పట్టాలు మంజూరు
విశాఖపట్నం, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి):
గాజువాకలో హౌస్ కమిటీ సమస్య పరిష్కారానికి గత తెలుగుదేశం ప్రభుత్వం జారీచేసిన ఆదేశాలను అమలు చేసేందుకు ఎట్టకేలకు వైసీపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు సీసీఎల్‌ఏ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. గాజువాకలో 900 ఎకరాల ఇనాం భూమిపై చాలాకాలం నుంచి వివాదం కొనసాగుతుంది. ఆ భూముల్లో నిర్మించుకున్న సుమారు పది వేల ఇళ్ల క్రయవిక్రయాలకు అవకాశం లేకుండా పోయింది. అయితే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు 2016లో ఆక్రమణదారులకు పట్టాలు మంజూరుచేసి, రెండేళ్ల తరువాత క్రమబద్ధీకరించేలా జీవో నంబరు 301 తీసుకువచ్చారు. దీని ప్రకారం చదరపు గజానికి రూ.25 చెల్లిస్తే పట్టా మంజూరు చేయాలని అప్పట్లో నిర్ణయించారు. ఈ మేరకు 7,500 మంది గృహ యజమానులు సొమ్ము చెల్లించడంతో ప్రభుత్వం పట్టాలు మంజూరుచేసింది. మరో 2,500 మంది సొమ్ము చెల్లించలేదు. జీవో జారీచేసిన రెండేళ్ల తరువాత సొమ్ము చెల్లించిన వారందరికీ పట్టాలు క్రమబద్ధీకరిస్తూ కన్వెయన్స్ డీడ్‌లు ఇవ్వాల్సి ఉంటుంది. వాస్తవంగా 2016లో జీవో వచ్చినా 2017లో అమలుచేశారు. అందువల్ల 2019 తరువాత పట్టాలు క్రమబద్ధీకరించాల్సి ఉంది. అయితే తెలుగుదేశం ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలో తప్పులు ఉన్నాయంటూ వైసీపీ నాయకులు మోకాలడ్డుతూ వచ్చారు. అయితే తెలుగుదేశం నేతలు మాత్రం గాజువాకలో పది వేల మంది కుటుంబాలకు ఆమోదయోగ్యమైన రీతిలో చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకుని జీవో ఇచ్చారని, సొమ్ము చెల్లించిన వారి పట్టాలు క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం జారీచేసిన జీవో 301 మేరకు సొమ్ము చెల్లించిన 7,500 మందికి ఇచ్చిన పట్టాలు క్రమబద్ధీకరించాలని ప్రస్తుత సీసీఎల్‌ఏ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు సొమ్ములు చెల్లించని వారు జీవో 225 మేరకు ప్రస్తుత రిజిస్ట్రేషన్ విలువలో 30 శాతం చెల్లించాల్సి ఉంటుందని తాజాగా ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల మేరకు 7,500 మందికి తక్షణమే డీడ్‌లు జారీచేయాలని గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
Updated Date - 2023-02-21T01:16:03+05:30 IST