జిల్లాలో 20 వేల మంది డ్రాపవుట్ విద్యార్థులు
ABN, First Publish Date - 2023-08-16T23:27:56+05:30
జిల్లాలో సుమారుగా 20 వేల మంది విద్యార్థులు డ్రాపవుట్‌గా ఉన్నారని, వారిని గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని అధికారులను కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు.
వారి వివరాలు సేకరించాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశం
పాడేరు, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): జిల్లాలో సుమారుగా 20 వేల మంది విద్యార్థులు డ్రాపవుట్‌గా ఉన్నారని, వారిని గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించాలని అధికారులను కలెక్టర్ సుమిత్‌కుమార్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో బుధవారం విద్యాశాఖాధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బడిబయట ఉన్న విద్యార్థులను పక్కాగా గుర్తించాలని, వారి డ్రాపవుట్‌కు గల కారణాలను విశ్లేషించాలన్నారు. అందుకు గాను గ్రామ వలంటీర్లు, వెల్ఫేర్ అసిస్టెంట్‌ల సహాయాన్ని తీసుకోవాలన్నారు. డ్రాపవుట్‌లను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించి, చైల్డ్ ఇన్‌ఫోలో అప్‌లోడ్ చేయాలని తెలిపారు. అలాగే పాఠశాలల్లోని విద్యార్థులందరికీ విద్యాకానుకలను అందించి, వాటి వివరాలను ఆన్‌లైన్ చేయాలని, విద్యాలయాలకు ఇచ్చిన స్మార్ట్ టీవీలను ఇన్‌స్టాల్ చేయాలని కలెక్టర్ సూచించారు. విద్యాలయాల్లోని నాడు- నేడు పనులను వేగవంతం చేయాలని, అందుకు జరిగిన ఎంఓయూను ఆన్‌లైన్ చేయాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో భోజన మెనూను సక్రమంగా అమలు చేయాలని, నాణ్యతలో రాజీ పడకూడదన్నారు. ఆశ్రమాలకు సంబంధించిన నిత్యావసర సరకులను నేరుగా విద్యాలయాలకు సరఫరా చేసేలా చర్యలు చేపడతామన్నారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి సలీం బాషా, గిరిజన సంక్షేమ విద్యాశాఖ డీడీ ఐ.కొండలరావు, ఏటీడబ్ల్యూవోలు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Updated Date - 2023-08-16T23:27:56+05:30 IST