ఆకతాయిల ఆగడాలు
ABN, First Publish Date - 2023-02-17T01:07:32+05:30
నగరంలో అల్లరిమూకల ఆగడాలు పెరిగిపోతున్నాయి.
మద్యం, గంజాయి మత్తులో విచక్షణా రహితంగా ప్రవర్తన
రోడ్లపై ఎవరైనా ప్రశ్నిస్తే భౌతికదాడులు
నగరంలో తరచూ ఎక్కడో ఒక చోట ఘటనలు
భయభ్రాంతులకు గురవుతున్న ప్రజలు
పోలీసులు కఠినంగా వ్యవహరించాలని డిమాండ్
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
కొన్నాళ్ల కిందట ప్రకాశరావుపేటలోని సింగ్ హోటల్ జంక్షన్‌లో నిలబడి వున్న యువకుడిని బైక్ ఢీకొంది. ఆ యువకుడు...బైక్ నడుపుతున్న యువకుడిపై ఆగ్రహం వ్యక్తంచేశాడు. దీంతో బైక్ నడుపుతున్న యువకుడు నిమిషాల వ్యవధిలో తన స్నేహితులను అక్కడకు రప్పించి యువకుడిపై కత్తితో దాడి చేశాడు.
వన్‌టౌన్‌లోని రంగిరీజువీధికి చెందిన ఒక కుటుంబం బుధవారం ఫంక్షన్‌కు వెళ్లి రాత్రి 9.30 గంటలకు ఇంటికి నడుచుకుంటూ వెళుతుండగా...బైక్‌పై వస్తున్న యువకుడు వారిని రాసుకుంటూ వెళ్లాడు. దీనిని గమనించిన మహిళ భర్త అతడిని గదమాయించాడు. కాస్త నెమ్మదిగా వెళ్లాలని సూచించాడు. దీంతో ఆ యువకుడు ఆగ్రహంతో ‘నా ఏరియాలో నన్నే ఎదిరించి మాట్లాడతావా...నీ అంతు చూస్తాను..నీ భార్యను రేప్ చేస్తాను...ఎలా అడ్డుకుంటావో చూస్తాను’ అంటూ తన బ్యాచ్‌కు చెందిన నలుగురైదుగురు యువకులను పిలిచాడు. నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే మహిళపై చెయ్యి వేసి, ఆమె దుస్తులను చించేశాడు. అడ్డుకోబోయిన ఆమె సోదరుడిపై దాడి చేసి గాయపరిచాడు.
నగరంలో అల్లరిమూకల ఆగడాలు పెరిగిపోతున్నాయి. మద్యం మత్తులో కొందరు, గంజాయి వంటి మాదక ద్రవ్యాలను సేవించి మరికొందరు రోడ్లపై విచక్షణరహితంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే భౌతిక దాడులకు దిగి వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఒకవేళ అవతలివారు ఎదురు తిరిగితే తమ స్నేహితులు, గ్యాంగ్‌లోని సభ్యులకు పిలిపిస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో మహిళలు వుంటే వారిపట్ల అసభ్యంగా, జుగుప్సాకరంగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మహిళలు ఒంటరిగా లేదంటే కుటుంబంతో రావాలంటే...అల్లరిమూకల నుంచి ఎటువంటి ఉపద్రవం ముంచుకొస్తుందోననే భయపడుతున్నారు. బుధవారం రాత్రి వన్‌టౌన్‌లోని రంగిరీజువీధికి చెందిన ఒక మహిళ తన భర్త, పిల్లలు, సోదరుడితో కలిసి ఒక ఫంక్షన్‌కు వెళ్లింది. రాత్రి 9.30 గంటల సమయంలో తిరిగి ఇంటికి నడుచుకుంటూ వస్తుండగా బైక్ మీద వెళుతున్న ఇద్దరు యువకులు వారికి దగ్గర నుంచి రాసుకుంటూ వెళ్లారు. ఆమె భర్త వారిని నిలదీశారు. దీంతో ఆ ఇద్దరు యువకులు సదరు మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఈ ఘటనతో అవాక్కైన ఆమె సోదరుడు అడ్డుకునే ప్రయత్నం చేశాడు. దీంతో వారు అతడిపై పిడిగుద్దులు కురిపించి, రాళ్లతో దాడి చేసి రక్తం కారేలా చితకబాదారు. అడ్డుకున్న ఆమె భర్తను కూడా తీవ్రంగా గాయపరిచారు. బాధితురాలు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేశారు. దాడికి పాల్పడిన యువకులిద్దరూ మద్యం మత్తులో వున్నారని పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. అదే తరహాలో కొన్నాళ్ల కిందట సింగ్ హోటల్ వద్ద యువకుడిపై కత్తులతో దాడి జరిగింది. నగరంలో వన్‌టౌన్, ఆరిలోవ, మల్కాపురం, కైలాసపురం, శివాజీపాలెం, రైల్వేన్యూకాలనీ, కంచరపాలెం, గోపాలపట్నం వంటి ప్రాంతాల్లో ఆకతాయిలు దాడులకు పాల్పడుతున్నట్టు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. పోలీసులు ప్రతీరోజూ కొందరిని పట్టుకుని కౌన్సెలింగ్ చేసి విడిచిపెడుతున్నారు. అయినప్పటికీ పరిస్థితిలో ఎటువంటి మార్పు లేదనేందుకు బుధవారం వన్‌టౌన్‌లో చోటుచేసుకున్న ఘటనే నిదర్శనం. ఈ నేపథ్యంలో మద్యం, గంజాయి మత్తులో ఇతరులకు ఇబ్బంది కలిగిస్తున్న వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు పోలీసులు కఠినంగా వ్యవహరించినట్టయితే కొంతైనా పరిస్థితిలో మార్పువస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Updated Date - 2023-02-17T01:07:33+05:30 IST