ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Simhachalam: తప్పులు లేవట అప్పన్నా!

ABN, First Publish Date - 2023-04-25T02:57:40+05:30

సింహాచలం చందనోత్సవం నిర్వహణలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం తప్పును ఒప్పుకోవడం లేదు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తలేదని, ఘనంగా దర్శనాలు చేయించామని బుకాయిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్న ప్రభుత్వం

చందనోత్సవ నిర్వహణలో వైఫల్యాలెన్నో

అధికార దర్పంతో అడ్డగోలుగా నిర్ణయాలు

అంతరాలయ దర్శనాలతో భక్తులకు ఇక్కట్లు

లెక్కకు మించి వీవీఐపీ టికెట్ల అమ్మకాలు

ఇబ్బందులు తలెత్తలేదని మంత్రి బుకాయింపు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): సింహాచలం చందనోత్సవం నిర్వహణలో ఘోరంగా విఫలమైన ప్రభుత్వం తప్పును ఒప్పుకోవడం లేదు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందీ తలెత్తలేదని, ఘనంగా దర్శనాలు చేయించామని బుకాయిస్తోంది. దేవదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ సోమవారం కలెక్టరేట్‌లో సమావేశం ఏర్పాటుచేసి ఇదే విషయాన్ని ప్రకటించారు. ఏటా సామాన్య భక్తులకు కేవలం మూడు,నాలుగు గంటల వ్యవధిలోనే దర్శనం జరిగేది. ఈసారి ఆరేడు గంటల సమయం పట్టింది. ఘాట్‌రోడ్డులో బస్సులు ఆగిపోవడం వల్ల భక్తులు మెట్ల మార్గంలో కొండపైకి వచ్చి, దర్శనం అనంతరం తిరిగి అదేమార్గంలో కిందికి నడుచుకొని వెళ్లాల్సి వచ్చింది. క్యూలైన్లన్నీ రాళ్లు, రప్పలతో నిండి, అరికాళ్లకు రాళ్లు గుచ్చుకుంటున్నా ఆ మార్గంలోనే భక్తులు కిలోమీటర్ల కొద్దీ నడిచారు. అయినా, ఇవేవీ భక్తుల సమస్యలు కాదన్నట్టుగా మంత్రి తేలికగా తీసిపారేశారు.

20 వేలకు మించి అంతరాలయ టికెట్ల విక్రయం..

గతంలో వెంకటరెడ్డి కమిటీ చేసిన సిఫారసుల ప్రకారం చందనోత్సవం నాడు కేవలం అనువంశిక ధర్మకర్తలకే అంతరాలయ దర్శనం చేయించాలి. ఇతరులను గర్భగుడిలోకి అనుమతించకూడదు. కానీ, గతేడాది సూర్యకళ ఈఓగా ఉన్న సమయంలో స్వల్ప సంఖ్యలో వీఐపీలకు అంతరాలయ దర్శనం చేయించారు. అప్పుడూ విమర్శలు వచ్చాయి. ఈసారి దేవదాయ శాఖ మంత్రే అంతరాయల దర్శనాలపై కీలక నిర్ణయం తీసుకున్నారని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. తొలుత ఐదు వేల మందికి అనుకొని ఏర్పాట్లు చేయగా, ఆ దర్శనానికి సంబంధించి 20 వేలకుపైగా టికెట్లు జారీచేశారు. అందులో సగం మందికి వాహన పాస్‌లు ఇచ్చారు. ఈ అంతరాలయ దర్శన టికెట్లు కూడా పెద్దల సిఫారసు ప్రకారం జారీచేశారు. రూ.1,500కు తామూ తీసుకుంటామని చాలామంది నగర ప్రముఖులు ముందుకొచ్చినా, ఒక్క టికెట్‌ కూడా ఇవ్వలేదు. మంత్రి, కలెక్టర్‌ అనుగ్రహం పొందిన వారికే స్వామి వారి అంతరాలయ దర్శనం జరిగింది. ఇదే విమర్శలకు దారితీసింది. ఈ టికెట్లతో వచ్చిన వారికి రెండు లైన్లు పెట్టారు. ఒకటి ప్రోటోకాల్‌. మరొకటి ఆర్డినరీ. ప్రోటోకాల్‌ లైను వేగంగా కదలడంతో చాలామంది అందులోకి వెళ్లిపోయారు. అక్కడే తోపులాటలు జరిగాయి. పోలీస్‌ అధికారులు టికెట్లు లేనివారిని సైతం ఆ లైన్‌లో పంపించి దర్శనాలు చేయించారు. ఈ విషయం స్వయంగా మంత్రి కొట్టు సత్యనారాయణ గమనించారు. అంతా వీవీఐపీల దర్శనాలపైనే దృష్టి పెట్టడంతో మిగిలిన క్యూలైన్లలో వారు ఇబ్బంది పడ్డారు.

దర్శన సమయం పెరిగిపోయింది. లక్షకు పైనే భక్తులు వచ్చారని, అంతరాలయ దర్శనాలు కొనసాగిస్తే, వారికి స్వామి దర్శనం జరగడం కష్టమని మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుర్తించి, అప్పటికప్పుడు అంతరాలయ దర్శనాలపై నిర్ణయం తీసుకొని ఆపేశారు. ఉదయం 4 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అంతరాలయ దర్శనాలు జరిగాయి. కొండపైన ఆర్టీసీ బస్సుల కంటే ప్రైవేటు వాహనాలే అధికంగా కనిపించాయి. ఇక్కడ కూడా పోలీసులు నిబంధనలను పాటించలేదు. పాస్‌ లేని వాహనాలను కూడా అనుమతించారు. దాంతో సామాన్య భక్తుల కోసం ఏర్పాటుచేసిన బస్సులు నడిచే అవకాశం లేకుండా పోయింది. వాహనాలను అదుపు చేయడంలోనూ, భక్తుల క్యూలైన్లు నిర్వహించడంలోనూ పోలీసులు విఫలమయ్యారు. వారి సహకారంతోనే అడ్డగోలు వ్యవహారాలు జరిగాయి. ఇలాంటి ఉత్సవ సమయాల్లో ఎక్కడికక్కడ సీసీ టీవీ కెమేరాలు పెట్టి, కంట్రోల్‌ రూమ్‌ ద్వారా ఎక్కడ ఏమి జరుగుతున్నదీ గమనించేవారు. ఈసారి ఆ ఏర్పాట్లూ చేయలేదు. వేల మందికి అంతరాలయ దర్శనాలు కల్పించడమే ఉత్సవం వైఫల్యానికి అసలు కారణం. అది తప్పుడు నిర్ణయమని ఇటు మంత్రి గానీ, అటు కలెక్టర్‌ గానీ అంగీకరించడం లేదు.

కాగా, వీవీఐపీ క్యూలైన్లలో తప్పులు జరిగాయని దేవదాయ శాఖ మంత్రి స్వయంగా ఒప్పుకొన్నారు. ఇలాంటి పెద్ద ఉత్సవాలు జరిగినప్పుడు చిన్న చిన్న లోపాలు ఉంటాయని, దిగువ స్థాయి సిబ్బంది నిబంధనలు అతిక్రమించడం సహజమని చెప్పుకొచ్చారు. కలెక్టర్‌ నేతృత్వంలో ఒక అధికారిని నియమించి విచారణ చేయిస్తామని, ఎవరు బాధ్యులో తేలితే...అవసరమైతే చర్యలు చేపడతామని ప్రకటించారు.

సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో భక్తులు ఎదుర్కొన్న తీవ్ర ఇక్కట్లపై పలువురు స్పందించారు. ఇది పూర్తిగా ప్రభుత్వవైఫల్యంగా పేర్కొన్నారు. నిర్వహణ ఏర్పాట్లను గాలికి వదిలేశారని విమర్శించారు. భక్తులకు కనీసం మంచినీరు కూడా ఇవ్వలేని దుస్థితిపై మండిపడ్డారు. కాగా, ఆదివారం స్వామి దర్శనానికి వచ్చి నానా అగచాట్లు పడ్డ భక్తులు ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతూ కన్నీటితో వెనుదిరగగా, తనకు భక్తుల కళ్లలో ఆనందభాష్పాలు కనిపించాయని దేవదాయ శాఖమంత్రి కొట్టు సత్యనారాయణ సమర్థించుకున్నారు.

భక్తుల కళ్లల్లో ఆనంద బాష్పాలు చూశా

అప్పన్న చందనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాం

దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ

విశాఖపట్నం, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): సింహాచలంలో ఆదివారం జరిగిన చందనోత్సవం నిర్వహణలో ప్రభుత్వం అత్యంత ఘోరంగా విఫలం కాగా, సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనాలు చేయించామని, వారి కళ్లల్లో ఆనంద బాష్పాలను తాను స్వయంగా చూశానని దేవదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ సమర్థించుకున్నారు. విశాఖ కలెక్టర్‌ కార్యాలయంలో కలెక్టర్‌ మల్లికార్జున, పోలీస్‌ కమిషనర్‌ త్రివిక్రమవర్మలతో కలిసి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ఎంతో శ్రమించి ఉత్సవానికి ఏర్పాట్లు చేసి.., విజయవంతంగా నిర్వహిస్తే, పత్రికలు ఉత్సవం సరిగ్గా నిర్వహించలేకపోయామని, ఇంకా ఏవో కట్టుకథలు అల్లి పతాక శీర్షికల్లో ప్రచురించాయన్నారు. దాదాపు రెండు లక్షల మంది సామాన్య భక్తులు వస్తే వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా స్వామి దర్శన భాగ్యం కల్పించామన్నారు. చిన్న సంఘటన కూడా జరగలేదన్నారు. అంతరాలయ దర్శనం కోసం వచ్చిన వీవీఐపీల క్యూలైన్లలోనే సమస్యలు వచ్చాయన్నారు. ప్రొటోకాల్‌ లైన్‌లోకి వేరే వ్యక్తులు టికెట్లు లేకుండా దూరిపోయారని, దానికి ఎవరు సహకరించారో గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు. సామాన్య భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలిగించలేదని పదేపదే చెప్పుకున్నారు. భక్తుల కోసం కేటాయించిన ఉచిత బస్సు సర్వీసులు ఘాట్‌రోడ్డులో ఆగిపోయిన విషయాన్ని మరోవైపు అంగీకరించారు. రవాణా సదుపాయం లేక సామాన్య భక్తులు కొండ పైనుంచి కింద వేపగుంట బస్టాండ్‌ వరకు నడుచుకుంటూ వచ్చారని విలేకరులు చెప్పగా, దానిని కూడా ఆయన ఒప్పుకొన్నారు. ఒకవైపు ఇబ్బందులు కలగలేదని చెబుతూనే మరోవైపు లోపాలను అంగీకరించారు. సింహాచలం దేవస్థానానికి త్వరలోనే రెగ్యులర్‌ ఈఓను నియమిస్తామని చెప్పారు.

Updated Date - 2023-04-25T02:57:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising