కలెక్టరేటా.. వైసీపీ కార్యాలయమా?
ABN, First Publish Date - 2023-06-26T23:06:33+05:30
జిల్లా కలెక్టరు కార్యాలయం వైసీపీ కార్యాలయంలా అధికారులు మార్చేశారని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు.
అనకాపల్లి రూరల్, జూన్ 26: జిల్లా కలెక్టరు కార్యాలయం వైసీపీ కార్యాలయంలా అధికారులు మార్చేశారని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఆరోపించారు. సోమవారం తుమ్మపాల వీవీ రమణ చక్కెర కర్మాగారంపై వినతిపత్రం ఇచ్చేందుకు కలెక్టరేట్‌కు వచ్చిన మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణకు మూడు గంటలపాటు కలెక్టరు, జేసీని కలిసేందుకు అధికారులు అనుమతి ఇవ్వలేదు. దీంతో మాజీ ఎమ్మెల్యే రైతులతో కలిసి కలెక్టరేట్‌లో బైఠాయించారు. దీంతో స్పందించిన ఆర్డీవో చిన్నికృష్ణ మాజీ ఎమ్మెల్యే గోవింద వద్దకు వచ్చి సీసీఎల్‌ఏ నుంచి ఉన్నతాధికారి వచ్చారని, అందుకే అనుమతి ఇవ్వడానికి సమయం పట్టిందని నచ్చజెప్పడంతో ‘పీలా’ శాంతించి కలెక్టరు వద్దకు వెళ్లారు. తుమ్మపాల చక్కెర కర్మాగారం కోసం ఏర్పాటు చేసిన లిక్విడేషన్ ప్రక్రియ, లిక్క్విడిటేర్‌ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ కలెక్టరు రవి పట్టన్‌శెట్టికి రైతులతో కలిసి పీలా గోవింద వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరు కార్యాలయం ఎదుట మీడియాతో మాట్లాడారు. సుగర్ ఫ్యాక్టరీ ఆస్తుల పరిరక్షణపై స్పందనలో అర్జీ అందజేసేందుకు తాను ముందస్తు అనుమతి తీసుకుని కలెక్టరేట్‌కు వస్తే అధికారులు అనుమతి ఇవ్వకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి కడప నుంచి వచ్చిన భూబ్రోకర్లతో రివ్యూలు పెడతారా అని ప్రశ్నించారు. తన గోడునే ఆలకించడానికి ఇష్టం చూపని అధికారులు, సామాన్యుల గోడును ఏమి ఆలకిస్తున్నారని పీలా గోవింద ప్రశ్నించారు. అధికారులు అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. 2014లో సంవత్సరంలోని టీడీపీ అధికారంలోకి వచ్చాక అప్పటికి సుగర్ ఫ్యాక్టరీ బకాయిలు రూ.3.75 కోట్లు చెల్లించామని గుర్తు చేశారు. కర్మాగారం మూతపడే పరిస్థితిలో ఉంటే మరో రూ.32.6లక్షలు తీసుకొచ్చి నడిపించామన్నారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొలిసారిగా ఫ్యాక్టరీకీ తాళాలు వేసి, రైతుల ఉసురుపోసుకున్నారన్నారు. ఇపుడు ఏకంగా ఫ్యాక్టరీకి లిక్క్విడేటర్‌ను నియమించి ఆస్తులను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారన్నారు. తుమ్మపాల చక్కెర కర్మాగారం జోలికి వస్తే ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు తలారి కాశినాయుడు, మళ్ల సురేంద్ర, పచ్చికూర రాము, కొణతాల శ్రీనివాసరావు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-26T23:06:33+05:30 IST