అగ్నిగుండం అనకాపల్లి జిల్లా
ABN, First Publish Date - 2023-06-11T00:16:40+05:30
జిల్లా కేంద్రమైన అనకాపల్లి పట్టణం శనివారం అగ్నిగుండాన్ని తలపించింది.
అనకాపల్లి టౌన్, జూన్ 10: జిల్లా కేంద్రమైన అనకాపల్లి పట్టణం శనివారం అగ్నిగుండాన్ని తలపించింది. మండుటెండలకు ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఉదయం నుంచే ఉష్ణోగ్రత పెరగడంతోపాటు వడగాడ్పులు వీయడంతో ప్రజలు అల్లాడిపోయారు. ఇళ్లల్లోంచి బయటకు రావడానికి జనాలు సాహసించలేదు. శనివారం అత్యధిక ఉష్ణోగ్రత 44.3 డిగ్రీలు నమోదైంది. ద్విచక్ర వాహనాలపై వెళుతుంటే వేడి సెగలు తగిలాయని వాహనచోదకులు చెప్పారు. ఒకపక్క వడగాడ్పులతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా.. మరోపక్క ఈపీడీసీఎల్ అధికారులు విద్యుత్ లైన్ల నిర్వహణ పనుల నిమిత్తం విద్యుత్ సరఫరాను ఉదయం ఎనిమిది నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు నిలిపివేశారు. దీంతో ప్రజలు అల్లాడిపోయారు.
-కోటవురట్ల మండలంలో శనివారం 42 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. మెయిన్ రోడ్డు నిర్మానుష్యం అయ్యింది.
-నక్కపల్లి మండలం శనివారం నిప్పుల కొలిమిగా మారిపోయింది. శనివారం నక్కపల్లిలో 43.37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం నుంచి ఎండతోపాటు తీవ్రమైన వడగాడ్పులు వీచాయి.
- పాయకరావుపేటలో శనివారం ఉష్ణోగ్రత 42 డిగ్రీలు నమోదు కావడంతో పట్టణం నిప్పుల కొలిమిగా మారింది. ఉదయం నుంచే ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు భయపడ్డారు. ఆపై వడగాడ్పులు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరయ్యారు.
-అచ్యుతాపురంలో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వడగాడ్పులకు ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. సెజ్‌కు వెళ్లే రహదారి నిర్మానుష్యంగా మారింది.
-ఎలమంచిలిలో 42.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. భానుడి ప్రతాపానికి జనం విలవిలలాడారు. వేడి గాలులకు ఉక్కిరిబిక్కిరయ్యారు.
-ఎస్.రాయవరం మండలంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కావడంతో ప్రజలు అల్లాడిపోయారు. ఆపై వడగాడ్పులు వీయడంతో జనం తట్టుకోలేకపోయారు.
- మునగపాక మండలంలో శనివారం 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గత పదేళ్లుగా ఇంత ఉష్ణోగ్రత ఎన్నడూ చూడలేదని మండల ప్రజలు అంటున్నారు.
- రాంబిల్లి మండలంలో శనివారం 42,8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో మండల ప్రజలు సూర్యతాపానికి తట్టుకోలేక విలవిలలాడిపోతున్నారు.
Updated Date - 2023-06-11T00:16:40+05:30 IST